కాంగ్రెస్‌కు ఇదొక్కటే చాన్స్‌ | Fourth face Chance for the Congress party | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు ఇదొక్కటే చాన్స్‌

Published Sun, Apr 28 2019 1:01 AM | Last Updated on Sun, Apr 28 2019 9:21 AM

Fourth face Chance for the Congress party - Sakshi

ఏడు దశల సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌లో ఇంకో అంకానికి రంగం సిద్ధమైంది. లోక్‌సభలోని మొత్తం 543 స్థానాలకుగాను తొలి మూడు దశల్లో 302 స్థానాల ఎన్నికలు పూర్తికాగా.. నాలుగోదశలో భాగంగా మరో 71 స్థానాలకు రేపు పోలింగ్‌ జరగనుంది. తొలి దశ పోలింగ్‌ ప్రాంతీయ పార్టీలకు అనుకూలంగా ఉంటే.. రెండు, మూడోదశలు ఎన్డీయేకు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. నాలుగో దశ పోలింగ్‌ జరగనున్న కేంద్రాలను విశ్లేషిస్తే.. రాజకీయంగా కాంగ్రెస్‌కు కొద్దోగొప్పో ఉపయోగపడేలా కనిపిస్తోంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈ దఫా ఎక్కువ స్థానాలు సంపాదించుకునే ఈ దశను విశ్లేషిస్తే....

మహారాష్ట్ర....
రాజధాని ముంబైలోని ఆరు లోక్‌సభ స్థానాలతోపాటు మొత్తం 17 స్థానాలకు ఏప్రిల్‌ 29న పోలింగ్‌ జరగనుంది. గత ఎన్నికల్లో బీజేపీ– శివసేన ఈ పదిహేడు స్థానాల్లో 14 గెలుచుకుంది. కాంగ్రెస్‌–ఎన్సీపీలకు ఒక్కటీ దక్కలేదు. గత ఐదేళ్లలో బీజేపీ – శివసేనల సంబంధాలు తరచూ మారిపోయిన సంగతి తెలిసిందే. 2014లో జరిగిన అసెంబ్లీలో ఒంటరిగా పోటీ చేసిన శివసేన ఆ తరువాతి కాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వైదొలగింది. కానీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మళ్లీ పొత్తు కుదుర్చుకుని ఉమ్మడిగా పోటీకి దిగారు. కాంగ్రెస్‌ –ఎన్సీపీలు కూడా సీట్ల సర్దుబాటులో విలువైన సమయాన్ని వృథా చేయడంతో ఎన్నికల సన్నాహాలకు ప్రచార వ్యూహాలను సిద్ధం చేసుకునేందుకు సమయం లేకుండా పోయింది. ఎన్నికల సమయంలో మాజీ కేంద్ర మంత్రి మురళీ దేవరా కుమారుడు మిలింద్‌ దేవరాను ప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా చేయడం ఆ పార్టీలో పరిస్థితులు ఏమంత గొప్పగా లేవన్న విషయాన్ని స్పష్టం చేస్తుంది.

ఉద్ధవ్‌ ఠాక్రే, రాజ్‌ ఠాక్రే, మిలింద్‌

కూటమికి పరీక్ష...
మహారాష్ట్రలో బీజేపీ – శివసేన కూటమికి రాజ్‌ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్‌) రూపంలో ఓ పరీక్ష ఎదురవుతోంది. శివసేన వ్యవస్థా పకుడైన బాలాసాహెబ్‌ ఠాక్రే తమ్ముడి కుమారుడైన రాజ్‌ఠాక్రే బీజేపీ – శివసేనలను బహిరంగంగానే విమర్శిస్తున్న నేపథ్యంలో పరిస్థితి ఆసక్తికరంగా మారింది. ఎంఎన్‌ఎస్‌ స్వయంగా ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. అలాగని కాంగ్రెస్‌  – ఎన్సీపీలతో పొత్తు కూడా పెట్టుకోలేదు. కానీ.. పార్టీ అధ్యక్షుడు రాజ్‌ ఠాక్రే మాత్రం ప్రచార సభలు నిర్వహిస్తూ హిందుత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రసంగాలు గుప్పిస్తున్నారు. ఈ సభలకు మంచి ఆదరణ లభిస్తూండటం ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

ఈ సారి ఎన్నికల్లో మహారాష్ట్రలోని అత్యంత కీలక నియోజకవర్గాల్లోముంబై సౌత్‌ ఒకటని చెప్పుకోవాలి. ప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మిలింద్‌ దేవరా పోటీ చేస్తున్నారిక్కడ. 2004, 2009లలో ఈ స్థానం నుంచే గెలుపొందిన మిలింద్‌ 2014 ఎన్నికల్లో మాత్రం అరవింద్‌ సావంత్‌ చేతిలో ఓటమిపాలయ్యారు. ఈ నేపథ్యంలో దేశంలోనే అత్యంత ధనికుడిగా పేరొందిన ముఖేష్‌ అంబానీ మద్దతుతో పోటీ చేస్తున్న మిలింద్‌ దేవరా ఎంత మేరకు విజయవంతమవుతారో వేచి చూడాల్సిందే. ఇక ముంబై నార్త్‌ నుంచి  సినీనటి ఊర్మిళా మటోండ్కర్‌ బీజేపీ ఎంపీ గోపాల్‌ షెట్టిల మధ్య ఆసక్తికరమైన పోరు నెలకొని ఉంది. ముంబై నార్త్‌–వెస్ట్‌లో ప్రదేశ్‌ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు సంజయ్‌ నిరుపమ్, శివసేన ఎంపీ గజానన్‌ చంద్రకాంత్‌ కీర్తికర్, ముంబై నార్త్‌ –సెంట్రల్‌లో ప్రియాదత్‌ (కాంగ్రెస్‌), సిట్టింగ్‌ ఎంపీ పూనమ్‌ మహాజన్‌ (బీజేపీ)ల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ఈ స్థానం నుంచి ప్రియాదత్‌ 2009లో గెలుపొందగా.. పూనమ్‌ 2014లో గెలుపొందారు.

రాజస్థాన్‌...
ఈ దఫా ఎన్నికల్లో బీజేపీకి అత్యంత ముఖ్యమైన రాష్ట్రాల్లో ఒకటైన రాజస్థాన్‌లో పరిస్థితులు అత్యంత ఆసక్తికరంగా ఉన్నాయి. గత ఎన్నికల్లో రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్‌ పార్టీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగిన బీజేపీ రాష్ట్రంలోని మొత్తం 25 స్థానాల్లోనూ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే 2014 తరువాత అక్కడి పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. బీజేపీ 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. మొత్తం 200 అసెంబ్లీ స్థానాల్లో వంద గెలుచుకుని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. బీజేపీ 73 స్థానాలకే పరిమితమైంది.2013 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఏడు శాతం ఓట్లు కోల్పోగా కాంగ్రెస్‌ అంతమేరకు లాభపడింది.

పద్మావత్‌ సినిమా వివాదం రాజ్‌çపుత్‌లలో బీజేపీపై వ్యతిరేకతకు కారణం కాగా.. జైపూర్‌లోని రాజ్‌ మహల్‌ ప్రధాన ద్వారాన్ని మూసివేయడం, భరత్‌పూర్‌ –ధోపూర్‌ ప్రాంతంలోని జాట్‌ సామాజిక వర్గం రిజర్వేషన్లు వంటి అంశాలన్నీ వసుంధర రాజే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశాయని అంచనా. ఏప్రిల్‌ 29న పోలింగ్‌ జరుపుకునే స్థానాల్లో రాష్ట్రం పశ్చిమ ప్రాంతంలోని పాలి, జోధ్‌పూర్, బర్మార్, జాలోర్‌లతోపాటు దక్షిణ ప్రాంతంలోని ఉదయ్‌పూర్, బాన్స్‌వారా, చిత్తోర్‌ఘర్, రాజ్‌సమంద్, భిల్వారాలు, హరోతీ ప్రాంతంలోని కోట, జల్వార్‌ –బరోన్‌లు, మధ్య రాజస్థాన్‌లోని అజ్మీర్, మత్సయ్‌ ప్రాంతంలోని టోంక్‌–సవాయి మాధోపూర్‌లు ఉన్నాయి.

నిరుద్యోగం.. వ్యవసాయ సంక్షోభం వంటి సమస్యలు ఈ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే అంశాలు. బీజేపీ జాతీయ వాదం, భద్రత, బాలాకోట్‌ దాడులు వంటి అంశాలతో ప్రచారం నిర్వహిస్తోంది. అధికార కాంగ్రెస్‌ రైతులకు తాము అందించిన పాక్షిక రుణమాఫీ, వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ ఏర్పాటు చేయడం వంటి అంశాలను తమ విజయాలుగా ఓటర్లకు వివరిస్తోంది. న్యాయ్‌ పథకం ద్వారా కనీస ఆదాయ పథకం లబ్ధిని నేరుగా జన్‌ధన్‌ యోజన అకౌంట్లలోకి వేస్తామన్న రాహుల్‌ గాంధీ హామీ కూడా కాంగ్రెస్‌కు మేలు చేయవచ్చు. వీటికి తోడు రాష్ట్రంలోని పన్నెండు మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌కే మద్దతివ్వడంతో లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామన్న ఆశాభావంతో ఉంది ఆ పార్టీ.

రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోట్‌ కుమారుడు వైభవ్‌ గెహ్లోట్‌కు, బీజేపీకి చెందిన జి.ఎస్‌.షెఖావత్‌ల మధ్య జోధ్‌పూర్‌ లోక్‌సభ స్థానానికి జరుగుతున్న పోటీ అందరి దృష్టిని ఆకర్శిçస్తుం డగా బర్మార్‌లో కాంగ్రెస్‌ టిక్కెట్‌పై బీజేపీ దిగ్గజ నేత జశ్వంత్‌ సింగ్‌ కుమారుడు మానవేంద్ర సింగ్‌ పోటీ చేస్తూండటం ఆసక్తికరంగా మారింది. చిత్తోర్‌ఘర్‌లో బీజేపీ సిట్టింగ్‌ ఎంపీ సీపీ జోషీ కాంగ్రెస్‌కు చెందిన గోపాల్‌ సింగ్‌ ఐద్వాపై పోటీ చేస్తున్నారు. మొత్తమ్మీద రాజస్థాన్‌లో రాజకీయ వాతావరణం కాంగ్రెస్‌కు కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ అంతర్గత కుమ్ములాటలు, రైతు రుణమాఫీని పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోవడం వంటి అంశాలు ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలు ఉన్నాయి.

మానవేంద్ర సింగ్, వైభవ్, సి.పి.జోషి

మహాఘట్‌బంధన్‌తో బీజేపీకి నష్టం?
మొత్తం పదమూడు స్థానాలకుగాను సోమవారం పోలింగ్‌ జరగనుంది. సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ, ఆర్‌ఎల్‌డీలతో కూడిన మహాఘట్‌బంధన్‌ కారణంగా బీజేపీకి కొన్ని స్థానాలు తగ్గే అవకాశాలు ఎక్కువ. అయితే ఇందుకు కూటమిలోని పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు సక్రమంగా జరగాల్సిన అవసరం ఉంది. అవధ్‌ ప్రాంతంలోని ఖేరీ, హర్దోయి (ఎస్సీ), మిస్రిక్‌ (ఎస్సీ), దోయాబ్‌ ప్రాంతంలోని ఉన్నావ్, ఫరుక్కాబాద్, ఇటావా (ఎస్సీ), కనౌజ్, కాన్పూర్, అక్బర్‌పూర్, బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలోని జలౌన్‌ (ఎస్సీ), ఝాన్సీ, హమీర్‌పూర్, రుహేల్‌ఖండ్‌ ప్రాంతంలోని షాజహాన్‌పూర్‌లలో గత ఎన్నికలల్లో బీజేపీ ఏకంగా 12 స్థానాలు గెలుచుకోగా, అతిస్వల్ప మార్జిన్‌తో కనౌజ్‌ స్థానాన్ని సమాజ్‌వాదీ పార్టీ గెలుచుకోగలిగింది. తాజా ఎన్నికల్లోనూ కనౌజ్‌లో ఆసక్తికరమైన పోటీ నెలకొని ఉంది. సమాజ్‌వాదీ పార్టీ తరఫున డింపుల్‌యాదవ్‌ బరిలో ఉండగా బీజేపీ సుభ్రత్‌పాఠక్‌ను నిలబెట్టింది. ఈ స్థానం నుంచి కాంగ్రెస్‌ పోటీ చేయడం లేదు.

ఇక కాన్పూర్‌ విషయానికొస్తే.. సిట్టింగ్‌ ఎంపీ, బీజేపీ దిగ్గజ నేత మురళీమనోహర్‌ జోషీ స్థానంలో సత్యదేవ్‌ పచౌరికి టికెట్‌ ఇచ్చింది. కాంగ్రెస్‌ నుంచి శ్రీ ప్రకాశ్‌ జైస్వాల్, శ్రీ రామ్‌కుమార్‌ సమాజ్‌వాదీ పార్టీ తరఫున బరిలో ఉన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలకెక్కే బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్‌ పోటీ చేస్తున్న ఉన్నావ్‌లో సమాజ్‌వాదీ పార్టీ తరఫున అరుణ్‌ కుమార్‌ శుక్లా, కాంగ్రెస్‌ నుంచి అను టాండన్‌లు బరిలో ఉన్నారు. సమాజ్‌వాదీ పార్టీ కంచుకోట ఇటావాలో బీజేపీ రమాశంకర్‌ కథారియాతో గెలుపుకోసం ప్రయత్నిస్తూండగా సిట్టింగ్‌ ఎంపీ అశోక్‌ కుమార్‌ దొహారే పార్టీని వీడి కాంగ్రెస్‌ టిక్కెట్‌పై పోటీ చేస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ నుంచి కమలేశ్‌ కథారియా బరిలో ఉన్నారు. ఝాన్సీలో సిట్టింగ్‌ ఎంపీ స్థానంలో బీజేపీ అనురాగ్‌ శర్మను బరిలోకి దింపగా శివ శరణ్‌ కుష్వహా (కాంగ్రెస్‌), శ్యామ్‌ సుందర్‌ సింగ్‌ యాదవ్‌ (ఎస్పీ)ల రూపంలో ఇక్కడ ముక్కోణపు పోటీ జరగనుంది.

డింపుల్, సాక్షి మహరాజ్, సత్యదేవ్‌

బెంగాల్‌లో హోరాహోరీ...
తృణమూల్‌ కాంగ్రెస్‌ కంచుకోటలో కమల వికాసానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు విజయవంతమవుతాయా? అన్నది కౌంటింగ్‌ తరువాతే తెలుస్తుందిగానీ ఈ సారి పోరు మాత్రం హోరాహోరీగానే సాగుతోంది. గత ఎన్నికల్లో టీఎంసీ ఆరు స్థానాలు గెలుచుకున్న లోక్‌సభ స్థానాలతోపాటు బీజేపీ, కాంగ్రెస్‌లు ఒక్కో స్థానం గెలుచుకున్న వాటికి సోమవారం పోలింగ్‌ జరగనుంది. వీటిల్లో బర్హమ్‌పూర్, కృష్ణనగర్, రానాఘాట్‌లతోపాటు బర్దమాన్‌ పుర్బా, దుర్గాపూర్, అసన్‌సోల్, బీర్‌బమ్, బర్దమాన్‌లు ఉన్నాయి. బహరంపూర్‌లో పోటీ ప్రధానంగా సిట్టింగ్‌ ఎంపీ అధిర్‌ రంజన్‌ చౌదరీ (కాంగ్రెస్‌), అపూర్వా సర్కార్‌ (టీఎంసీ), కృష్ణ జౌర్‌దార్‌ ఆర్య (బీజేపీ)ల మధ్యనే ఉంది. రివల్యూషనరీ సోషలిస్ట్‌ పార్టీ తరఫున ఈద్‌ మహమ్మద్‌ కూడా బరిలో ఉన్నారు. టీఎంసీ కృష్ణ నగర్‌ స్థానానికి సిట్టింగ్‌ ఎంపీ తపస్‌ పాల్‌ ను కాదని మహువా మొయిత్రాను బరిలోకి నిలపగా కల్యాణ్‌ చౌబే (బీజేపీ), శంతనూ ఝా (సీపీఎం)లు ఆమెకు ప్రత్యర్థులుగా ఉన్నారు. అసన్‌సోల్‌ విషయానికొస్తే.. ఇక్కడ కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియో (బీజేపీ)కి పోటీగా సినీనటి మూన్‌మూన్‌ సేన్‌(టీఎంసీ), గౌరాంగ్‌ ఛటర్జీ (సీపీఎం)లు ఉన్నారు. బీర్‌బమ్‌లో టీఎంసీ, సీపీఎం, కాంగ్రెస్, బీజేపీల మధ్య బహుముఖ పోటీ ఉంది.

అధిర్‌ రంజన్, మూన్‌మూన్‌ సేన్, బాబుల్‌ సుప్రియో

మధ్యప్రదేశ్‌లో మళ్లీ మోదీ హవా వచ్చేనా?
మోడీ హవా కారణంగా బీజేపీ బాగా లాభపడ్డ రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్‌ కూడా ఒక్కటి. ఈ సార్వత్రిక ఎన్నికల నాలుగోదశలో మధ్యప్రదేశ్‌లోని ఆరు స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. వింధ్యప్రదేశ్‌ ప్రాంతంలోని సిధి, షాదోల్‌లతోపాటు మహాకోశల్‌ ప్రాంతంలోని జబల్‌పూర్, మండ్ల, బాలాఘాట్, ఛింద్వారాలను గత ఎన్నికల్లో బీజేపీ గెలుచుకుంది. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలై, కాంగ్రెస్‌ అధికారం చేపట్టిన నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. మాండసోర్‌లో రైతులపై కాల్పులు, వ్యవసాయ సంక్షోభాన్ని అరికట్టడంలో విఫలమవడం వంటి అంశాలు బీజేపీకి ప్రతికూలంగా మారితే.. రుణమాఫీ, గో సంరక్షణకు సమగ్ర పథకం వంటి అంశాలు ఓటర్లు కాంగ్రెస్‌వైపు మొగ్గు చూపేలా చేస్తున్నాయి. రాష్ట్రస్థాయిలో ఎస్పీ, బీఎస్పీ, గోండ్వానా గణతంత్ర పార్టీలు పొత్తు పెట్టుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా త్రిముఖ పోటీ ఏర్పడింది. ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ 1980 నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఛింద్వారా లోక్‌సభ నియోజకవర్గంలో ఈ సారి కాంగ్రెస్‌ తరఫున నకుల్‌ నాథ్‌ పోటీ చేస్తూండగా.. బీజేపీ నుంచి నాథన్‌ షా, జ్ఞానేశ్వర్‌ గజ్‌భియే (బీఎస్పీ)లు పోటీలో ఉన్నారు.

నఖుల్‌ నాథ్, నాథన్‌ షా, జ్ఞానేశ్వర్‌

ఒడిశాలో పోలింగ్‌ పూర్తి..
ఏప్రిల్‌ 29 వతేదీతో ఒడిశాలోని అన్ని లోక్‌సభ స్థానాలకు ఓటింగ్‌ పూర్తవుతుంది. మిగిలిన మయూర్‌భంజ్‌ (ఎస్టీ), బాలాసోర్‌ (ఎస్సీ), భద్రక్‌ (ఎస్సీ), జజ్‌పూర్‌ (ఎస్సీ), కేంద్రపారా, జగత్‌సింగ్‌పూర్‌ (ఎస్సీ) స్థానాలు గత ఎన్నికల్లో బీజేడీ గెలుచుకున్నవే. అయితే ఈ సారి బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. 1998 నుంచి బీజేడీని గెలిపిస్తూ వచ్చిన కేంద్రపారాలో ఈసారి ఇటీవలే బీజేడీకి రాజీనామా చేసి బీజేపీలో చేరి వైజయంత్‌ జై పాండా పోటీ చేస్తూండగా.. ఆయన ప్రత్యర్థిగా బీజేడీ తరఫున సినీనటుడు అనుభవ్‌ మహంతి ఉన్నారు. బీజేడీని గెలిపించేందుకు ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ సర్వశక్తులు ఒడ్డుతున్నారు.

అనుభవ్, వైజయంత్‌

కన్హయ్య కుమార్‌కు కఠిన పరీక్ష...
బిహార్‌లో నాలుగోదశలో భాగంగా ఐదు స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌ పోటీ చేస్తున్న బేగూసరాయితోపాటు దర్భంగ, ఉజిర్‌పూర్, సమస్ఠిపూర్, ముంగేర్‌లలో ఈ పోలింగ్‌ జరగనుంది. గత ఎన్నికల్లో ఈ స్థానాల్లో మూడింటిని బీజేపీ, రెండింటిని ఎల్‌జేఎన్‌ఎస్‌పీ గెలుచుకున్నాయి. ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్న నియోజకవర్గం బేగూసరాయి అనడంలో సందేహం ఏమీ లేదు. ఒకప్పుడు వామపక్ష పార్టీలకు మద్దతిచ్చిన బేగూసరాయిలో ఈ సారి సీపీఐ తరఫున కన్హయ్య కుమార్‌ పోటీ చేస్తున్నారు. బీజేపీ మాజీ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ ప్రధాన ప్రత్యర్థిగా ఉండగా.. ఆర్జేడీకి చెందిన తన్వీర్‌ హసన్‌ కూడా ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు.

దేశద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్హయ్య కుమార్‌కు వామపక్ష నేతలతోపాటు ప్రకాశ్‌రాజ్, షబానా ఆజ్మీ, జావేద్‌ అక్తర్, స్వరా భాస్కర్‌ వంటి సినీ ప్రముఖుల మద్దతు లభిస్తుండగా ఆర్జేడీ అభ్యర్థి తన్వీర్‌ హసన్‌కు బలమైన కేడర్‌ ఉండటం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఇవే కాకుండా జార్ఖండ్‌లో ఛత్రా, లోహార్‌డాగా (ఎస్టీ), పలమావు (ఎస్సీ) లోకసభ స్థానాల్లో రెండింటిని గత ఎన్నికల్లో బీజేపీ గెలుచుకున్నప్పటికీ ఈ సారి అక్కడ గట్టిపోటీ ఎదుర్కొంటోంది. కాంగ్రెస్, జేవీఎం(పీ), జేఎంఎం, ఆర్జేడీల కూటమి బీజేపీని నిలువరించే ప్రయత్నం చేస్తోంది. ఏతావాతా.. తొలి మూడు దశల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు సంపాదించుకునే అవకాశం లేకపోయిన కాంగ్రెస్‌ ఈ దశలో మాత్రం కొంచెం లాభపడనుందని చెప్పాలి. 2014లో ఈ స్థానాల్లో కేవలం రెండింటిని మాత్రమే కాంగ్రెస్‌ గెలుచుకోగా.. ఈ సారి మాత్రం సీట్ల సంఖ్య రెండు అంకెల్లో ఉండవచ్చునని అంచనా.

కన్హయ్య, గిరిరాజ్‌ సింగ్, తన్వీర్‌ హసన్‌


ప్రవీణ్‌ రాయ్, రాజకీయ విశ్లేషకులు, సెంటర్‌ ఫర్‌ ద స్టడీ ఆఫ్‌ డెవలపింగ్‌ సొసైటీస్, ఢిల్లీ.


ద్వైపాయన్‌ సన్యాల్‌, ఫ్రీలాన్స్‌ పొలిటికల్‌ ఎకనమిస్ట్, నోయిడా, ఉత్తర ప్రదేశ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement