న్యూఢిల్లీ: భారత్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే ఫోకస్డ్ ఆఫ్ షోర్ ఫండ్స్, ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) నుంచి విదేశీ పెట్టుబడిదారులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో 1.5 బిలియన్ డాలర్లు (రూ.11,250 కోట్లు) వెనక్కి తీసుకున్నారు. మార్నింగ్ స్టార్ నివేదిక ప్రకారం చూస్తే.. వరుసగా తొమ్మిదో త్రైమాసికంలోనూ పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగింది. అయితే, ఈ ఏడాది మార్చితో ముగిసిన మూడు నెలల కాలంలో వెనక్కి వెళ్లిపోయిన నిధులతో చూస్తే చాలా తక్కువే.
మార్చి క్వార్టర్ లో విదేశీ ఇన్వెస్టర్లు ఇండియా ఫోకస్డ్ ఫండ్స్, ఈటీఎఫ్ ల నుంచి ఏకంగా 5 బిలియన్ డాలర్లు (రూ.37,500 కోట్లు) ఉపసంహరించుకున్నారు. దీంతో 2020లో జూన్ నాటికి మొత్తం 6.5 బిలియన్ డాలర్లు (రూ.48,750 కోట్లు) భారత్ నుంచి వెళ్లిపోయినట్టు అయింది. 2019 పూర్తి సంవత్సరంలో ఇన్వెస్టర్లు 5.9 బిలియన్ డాలర్లనే వెనక్కి తీసుకోగా.. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనే ఇంతకంటే అధికంగా ఉపసంహరించుకోవడం గమనార్హం. విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీల్లో ప్రధానంగా ఫోకస్డ్ ఆఫ్ షోర్ ఫండ్స్, ఫోకస్డ్ ఈటీఎఫ్ ల ద్వారానే ఇన్వెస్ట్ చేస్తుంటారు.
ఈ నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే..
► జూన్ త్రైమాసికంలో వెనక్కి వెళ్లిపోయిన పెట్టుబడులు.. ఇండియాఫోకస్డ్ ఫండ్స్ నుంచి 698 మిలియన్ డాలర్లు, ఇండియా ఫోకస్డ్ ఆఫ్ షోర్ ఈటీఎఫ్ ల నుంచి 776 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
► ఇండియా ఫోకస్డ్ ఆఫ్ షోర్ ఫండ్స్ లోకి వచ్చే పెట్టుబడులు సాధారణంగా దీర్ఘకాల విధానంతో ఉంటాయి. అదే ఆఫ్ షోర్ ఈటీఎఫ్ ల పెట్టుబడులు స్వల్పకాల విధానంతో కూడినవి.
► ఈ రెండు విభాగాల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ 2018 ఫిబ్రవరి నుంచి నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. నాటి నుంచి ఈ ఏడాది జూన్ వరకు ఇండియా ఫోకస్డ్ ఆఫ్ షోర్ ఫండ్స్ నుంచి 14.5 బిలియన్ డాలర్లు (రూ.1,08,750 కోట్లు) బయటకు వెళితే, ఇండియా ఫోకస్డ్ ఈటీఎఫ్ ల నుంచి ఇదే కాలంలో 4.2బిలియన్ డాలర్లు (రూ.31,500 కోట్లు) వెనక్కి తీసుకోవడం గమనార్హం. అంటే దీర్ఘకాల పెట్టుబడులే ఎక్కువగా బయటకు వెళ్లినట్టు తెలుస్తోంది. భారత్ పట్ల ఇన్వెస్టర్లలో ఉన్న అప్రమత్త ధోరణిని ఇది తెలియజేస్తోందని మార్నింగ్ స్టార్ నివేదిక తెలియజేసింది.
► ఈ స్థాయిలో నిధులు వెనక్కి వెళ్లడం ఊహించనిదేనని, భారతదేశ ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, కరోనా వైరస్ చూపే ప్రభావంపై అనిశ్చిత పరిస్థితులను ఇందుకు కారణంగా పేర్కొంది.
► కరోనాపై భారత్ ఏ విధంగా పైచేయి సాధిస్తుందన్న దాని ఆధారంగానే భవిష్యత్తు పెట్టుబడులు ఆధారపడి ఉంటాయని తెలిపింది.
► ఈ రెండు రకాల ఫండ్స్ నిర్వహణలోని పెట్టుబడులు జూన్ త్రైమాసికంలో 13 శాతం పెరిగి 33.8 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈక్విటీ మార్కెట్లు భారీగా కోలుకోవడం ఆస్తుల విలువ పెరిగేందుకు దోహదపడింది.
Comments
Please login to add a commentAdd a comment