ఏడు నెలల్లో 63 కొత్త పథకాలు
రూ.10.95 లక్షల కోట్లకు ఆస్తులు
రూ.15వేల కోట్లకు నెలవారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్స్ (ఇండెక్స్ ఫండ్స్) పథకాల పట్ల ఇన్వెస్టర్లలో అవగాహన విస్తృతం అవుతోంది. పనిలో పనిగా ఈ డిమాండ్‌ను సొంతం చేసుకునేందుకు ప్రముఖ మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు (ఏఎంసీలు) కొత్త పథకాలతో (ఎన్‌ఎఫ్‌వో) మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. యాక్టివ్‌గా నిర్వహించే ఈక్విటీ పథకాలు రాబడుల విషయంలో సూచీలతో వెనుకబడుతున్న తరుణంలో ప్యాసివ్ ఫండ్స్‌కు ఇన్వెస్టర్లలో నమ్మకం పెరుగుతున్నట్టు కనిపిస్తోంది.
ఇందుకు నిదర్శనం.. గడిచిన ఏడు నెలల్లో (జనవరి–జూలై) 63 ప్యాసివ్ ఫండ్స్ ఎన్‌ఎఫ్‌వోలు మార్కెట్లోకి రావడమే. గతేడాది మొత్తం మీద 51 ప్యాసివ్ ఫండ్స్ ఎన్‌ఎఫ్‌వోల రికార్డును ఈ ఏడాది ఇప్పటికే అధిగమించడం గమనార్హం. ముఖ్యంగా ఈ నెలలో మార్కెట్లోకి 12 ఎన్‌ఎఫ్‌వోలు రాగా, అందులో సగం మేర ప్యాసివ్ ఫండ్స్ నుంచే ఉన్నాయి. జూలై చివరి నాటికి అత్యధికంగా టాటా మ్యూచువల్ ఫండ్ 10 ప్యాసివ్ ఫండ్ ఎన్‌ఎఫ్‌వోలను చేపట్టింది.
హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ 5, మిరే అస్సెట్ మేనేజ్‌మెంట్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ చెరో నాలుగు చొప్పున ప్యాసివ్ ఫండ్స్ ఎన్‌ఎఫ్‌వోలను తీసుకొచ్చాయి. ప్యాసివ్ ఫండ్స్ పరిధిలోని ఫోలియోలు (పెట్టుబడి ఖాతాలు) 22 శాతం పెరిగి జూలై చివరికి 3.22 కోట్లుగా ఉన్నాయి.
ఇదే కాలంలో యాక్టివ్ ఫండ్స్ విభాగంలో ఫోలియోలు 19 శాతం పెరిగి 13.84 కోట్లుగా ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్యాసివ్ ఫండ్స్ నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) 24 శాతం వృద్ధితో రూ.10.95 లక్షల కోట్లకు చేరాయి. నెలవారీ ఈ పథకాల్లోకి వచ్చే పెట్టుబడులు ఈ ఏడాది జనవరిలో రూ.3,983 కోట్లుగా ఉండగా.. జూలైలో రూ.14,778 కోట్లకు వృద్ధి చెందడం, వీటి పట్ల ఉన్న డిమాండ్‌ను తెలియజేస్తోంది.
ప్రత్యామ్నాయాలపై దృష్టి
కొత్త పెట్టుబడులు ఆకర్షించేందుకు మ్యూచువల్ ఫండ్స్ వినూత్న మార్గాలపై దృష్టి సారించాయి. సంప్రదాయ పథకాల పరంగా ఇప్పటికే తగినంత మార్కెట్ ఏర్పడడంతో.. కొత్త పెట్టుబడుల ఆకర్షణ దిశగా ఇన్వెస్టర్ల ప్రాధాన్యతలకు అనుగుణంగా ఫండ్స్ సంస్థలు వ్యూహాలు రచిస్తున్నాయి. యాక్టివ్ పథకాలు ఇప్పటికే తగినంతగా మార్కెట్లో ఉండడంతో, ప్రముఖ ఏఎంసీలు ప్యాసివ్, థీమ్యాటిక్ ఎన్‌ఎఫ్‌వోల బాట పట్టినట్టు మారి్నంగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ ఇండియా డైరెక్టర్ కౌస్తభ్ బేల్‌పుర్కార్ తెలిపారు.
ప్యాసివ్, యాక్టివ్ ఫండ్స్ మధ్య అంతరాన్ని భర్తీ చేసే విధంగా స్మార్ట్ బీటా తదితర వినూత్నమైన విధానాలను కొత్త ప్యాసివ్ ఫండ్స్ విషయంలో ఏఎంసీలు అమలు చేస్తున్నాయి. స్మార్ట్ బీటా అంటే.. ఆయా ప్యాసివ్ ఫండ్ ఒక సూచీని అనుసరించి పెట్టుబడులు పెట్టినప్పటికీ.. రాబడుల్లో మార్కెట్‌ను అధిగమించేలా ఉంటుంది. ఈ తరహా ప్యాసివ్ ఫండ్ వ్యూహాల్లో ‘ఈక్వల్ వెయిట్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ ఇండెక్స్’ ఇన్వెస్టర్లను ఎక్కువగా ఆకర్షిస్తోంది. నిఫ్టీ సూచీలో టాప్–10లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా, తక్కువ రిస్క్‌తో కూడిన రాబడులు ఆఫర్ చేసే విధానానికీ ప్రాచుర్యం పెరుగుతోంది. మొత్తానికి ప్యాసివ్ ఫండ్స్ రూపంలో మెరుగైన రాబడులు ఆఫర్ చేయడం ద్వారా ఇన్వెస్టర్ల ఆదరణ సొంతం చేసుకునే దిశగా ఏఎంసీలు ప్రయతి్నస్తుండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment