35–ఏను రద్దుచేయాలంటూ జమ్మూలో ఆందోళనకు దిగిన శివసేన డోగ్రా ఫ్రంట్ సభ్యులు
న్యూఢిల్లీ: కశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులు కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్–35ఏ సుప్రీంకోర్టు విచారణ అంశం ఆ రాష్ట్రంలో తీవ్ర అలజడిని రేపింది. సుప్రీం విచారణకు నిరసనగా వేర్పాటువాదుల పిలుపు మేరకు బంద్‌తో కశ్మీర్, చీనాబ్ లోయలో జనజీవనం స్తంభించింది. 35ఏపై సోమవారం సుప్రీంకోర్టులో ప్రారంభం కావాల్సిన విచారణ జస్టిస్ వైవీ చంద్రచూడ్ లేకపోవడంతో 28వ తేదీకి వాయిదాపడింది. ఈ అంశాన్ని ఐదుగురు సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి బదలాయించే అంశాన్ని పరిశీలించనున్నట్లు సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది.
కశ్మీర్‌లో రెండు రోజుల బంద్
ఆర్టికల్–35ఏ సుప్రీంకోర్టు విచారణ చేపట్టరాదంటూ గత కొన్ని రోజులుగా కశ్మీర్ వ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలు, సంఘాలు ఆందోళనలు చేపడుతున్నాయి. వేర్పాటువాద నేతలు సయ్యద్ అలీ షా, మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్, మహ్మద్ యాసిన్ మాలిక్ పిలుపు మేరకు ఆది, సోమవారాల్లో బంద్ పాటించారు. వివిధ వర్గాలు మద్దతు తెలపడంతో రెండు రోజులుగా కశ్మీర్, చీనాబ్‌లోయలో జనజీవనం పూర్తిగా స్తంభించింది. వాణిజ్య, వ్యాపార, రవాణా సేవలు నిలిచిపోయాయి. కీలక ప్రాంతాల్లో సైన్యం, పోలీసులను మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని అధికారులు తెలిపారు. ముందు జాగ్రత్తగా అమర్‌నాథ్ యాత్రను రెండు రోజులుగా నిలిపివేశారు.
కశ్మీరీల ప్రత్యేక హక్కులేమిటి?
రాష్ట్రంలో శాశ్వత నివాసితులను కశ్మీర్ శాసనసభ నిర్ధారిస్తుంది. స్థానికేతరులు లేదా ప్రవాసులు స్థిరాస్తులు కొనుగోలు చేసి స్థిరపడేందుకు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రాయితీలు, ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశం, ఉపకార వేతనాలు పొందడానికి అనర్హులు. వీరు అసెంబ్లీ మొదలుకుని మున్సిపల్, పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు, ఓటు వేసేందుకు అనర్హులే. 1911కు ముందు ఆ రాష్ట్రంలో పుట్టిన, స్థిరపడిన లేదా అంతకు పదేళ్ల ముందు న్యాయబద్ధంగా స్థిరాస్తి పొందిన, పాక్‌కు వలస వెళ్లిన వారితో పాటు జమ్మూకశ్మీర్ నుంచి వలస వెళ్లిన వారు స్థానికులు. వలసవెళ్లిన వారి తర్వాతి 2 తరాల వరకూ ఇదే వర్తిస్తుంది. పాక్ పౌరుడై ఉండి కశ్మీర్‌లో ఆస్తిని కొనుగోలు చేయగలిగిన విచిత్ర పరిస్థితికి ఇది అవకాశం కల్పిస్తుండగా, ఇతర రాష్ట్రాల్లోని భారత పౌరులకు ఆ హక్కులేదు. స్థిరనివాస సర్టిఫికెట్ లేని వారిని కశ్మీరీ మహిళలు భర్తలుగా ఎంచుకుంటే ఆమె ఆస్తిపై హక్కు కోల్పోతుంది. వారి పిల్లలకు తదుపరి హక్కులు లభించవు.
ఈ హక్కులు ఎలా వచ్చాయి ?
1954 రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా రాజ్యాంగంలో ఆర్టికల్–35ఏను చేర్చారు. పార్లమెంట్‌లో చర్చించకుండా, రాజ్యాంగ సవరణ రూపంలో కాకుండా రాజ్యాంగానికి అనుబంధంగా దీనిని చూపడంపై అభ్యంతరాలున్నాయి. 35ఏపై చర్చ అంటే ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370పై చర్చగా భావించాలి. ఇది తేనెతుట్టెను కదిపినట్లేనని నిపుణుల భావన. రాజ్యాంగం కశ్మీర్‌కు కల్పించిన ప్రత్యేక హక్కులు, వాటి చెల్లుబాటును ప్రశ్నించకుండా ఆర్టికల్ 35ఏ చెల్లుబాటును, 1954లోని రాష్ట్రపతి ఉత్తర్వులను ప్రశ్నించలేమని వారంటున్నారు.
సుప్రీంలో పిటిషన్లు ఎవరివి?
అక్కడివారికి 35ఏ ద్వారా సంక్రమించే హక్కులు, అధికారాలను రద్దు చేయాలంటూ ఢిల్లీకి చెందిన ‘ వీ ది సిటిజన్స్’ అనే స్వచ్ఛంద సంస్థ, 35ఏ కారణంగా తమ పిల్లలు ఓటు హక్కును కోల్పోయారంటూ ఇద్దరు కశ్మీరీ మహిళల పిటిషన్లతోపాటు ఇతర పిటిషన్లు సుప్రీంలో దాఖలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment