
శ్రీనగర్: ఒకవేళ సుప్రీం కోర్టు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 35ఏకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలని వేర్పాటువాద నేతలు కశ్మీర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ అంశంలో ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకున్నా రాష్ట్రం మరో పాలస్తీనాగా మారుతుందని హెచ్చరించారు. ఈ మేరకు వేర్పాటువాద నేతలు సయ్యద్ అలీషా గిలానీ, ఉమర్ ఫారుఖ్, యాసిన్ మాలిక్‌లు ఆదివారం ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. కశ్మీర్ పౌరులకు విశేషాధికారాలు కల్పిస్తున్న ఆర్టికల్ 35ఏ చట్టబద్ధతపై సుప్రీంకోర్టు విచారణ జరపనున్న సంగతి తెలిసిందే. ‘ఒకవేళ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, ప్రయోజనాలకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు ఇస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టండి’ అని కోరారు. అధికార పీడీపీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్)కు మిత్రుడిగా మారిందని వారు ప్రకటనలో విమర్శించారు.