గుత్తా జ్వాల, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి
‘మహిళలకు ఎన్నో అవకాశాలున్నాయి, ఎదగడానికి ఆకాశమే హద్దు’ అనే మాటలు వినడానికి ఎంత బాగున్నప్పటికీ వాస్తవంలో అలా ఏ మాత్రం లేదంటున్నారు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల. సాధికారత సాధనలో మహిళలకు అడుగడుగునా అవాంతరాలే ఎదురవుతున్నాయని, కెరీర్‌లో నిలదొక్కుకోవడం కంటే మహిళ అయిన కారణంగా ఎదురయ్యే విమర్శలను, వివక్షను ఎదుర్కోవడానికే ఎక్కువ శక్తి అవసరమవుతోందన్నారామె.
‘‘ఫిఫ్టీ– ఫిఫ్టీ అనేది ఒక ముసుగు మాత్రమే. క్రీడాకారుల్లో పది మంది అబ్బాయిలుంటే అమ్మాయిలు ముగ్గురో నలుగురో ఉంటారు. ఆ ముగ్గురు నలుగురిని చూపించి మహిళలకు ఎన్ని అవకాశాలో అని భూతద్దంలో చూపించుకుంటారు. క్రీడారంగంలోకి రావాలనే ఆసక్తి ఉన్న అమ్మాయిలకు కొదవలేదు. అయితే పరిస్థితులే అందుకు అనుకూలంగా లేవు. స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేయడానికి స్టేడియాలున్నాయి. కానీ కోచ్‌లే తగినంతగా లేరు. ప్రభుత్వం కోచ్‌లను నియమించి ట్రైనింగ్ ఇప్పిస్తూ, వాటిలో దిగువ స్థాయి బాలికలకు అవకాశం ఇస్తే వారిలో నుంచి ఎంతోమంది క్రీడాకారిణులు వస్తారు. అలాంటి ప్రయత్నమే కనిపించడం లేదు. రాను రాను బ్యాడ్మింటన్ రిచ్‌మన్ గేమ్‌గా మారిపోతోంది.
మా నాన్నలాంటి నాన్న ఉంటే!
మనది పితృస్వామ్య సమాజం. కాబట్టి సమాజం మహిళలనే ప్రశ్నిస్తుంది. మహిళలు ప్రశ్నిస్తే సహించలేదు. అమ్మాయి ఇలాగే ఉండాలి... అన్నట్లు కండిషన్ అయిపోయింది సొసైటీ. ఆ మైండ్‌సెట్ నుంచి సొసైటీ బయటపడాలి. ఉదాహరణకు నన్ను మా నాన్న చాలా లిబరల్‌గా పెంచారు. అప్పట్లో మా నాన్నను అందరూ ‘ఏంటి అలా పెంచుతున్నావు, మగరాయుడిలా ఉంటోంది’ అనేవాళ్లు. మా నాన్న ధైర్యవంతుడు కాబట్టి ఈ రోజు నేను సమాజం ముందు తలెత్తుకుని నిలబడగలిగాను. అలాంటి నాన్నలు లేని అమ్మాయిలు చాలామంది అందరిలో ఒకరిలా జీవించేస్తున్నారు.
ఇప్పటి వరకు నేను ఎవరి ముందూ తలదించలేదు. ఆ తత్వాన్ని తలబిరుసుగా ముద్ర వేస్తుంటారు. నా జీవితంలో పాతికేళ్లు బ్యాడ్మింటన్ ప్రాక్టీసే ఉంది. నన్ను నేను ప్రూవ్ చేసుకుంటూనే ఈ స్థాయికి వచ్చాను. అయినప్పటికీ నా ముఖాన్నే ‘ఈమె ఆడలేదులే’ అన్నారు. నేను దేశం కోసం ఆడాను, దేశానికి విజయాలు తెచ్చాను. పరాయి దేశంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడంలో ఎంత సంతోషపడ్డానో దేశానికి పతకాలు తెచ్చినప్పుడూ అంతే సంతోషపడ్డాను. అవేవీ కనిపించలేదు ఈ మేల్ డామినేషన్ సిస్టమ్‌కి. నా కళ్లెదురుగా జరిగే తప్పుల్ని ‘అలా ఎందుకు’ అని ప్రశ్నించడమే వాళ్లకు గుర్తొచ్చేది. దేశంలో నంబర్‌వన్ పొజిషన్‌లో ఉన్నప్పుడు కూడా నన్ను అకారణంగా తప్పించారు.
కారణం ఒక్కటే!
నేను 2006లో కామన్‌వెల్త్ గేమ్స్‌లో మెడల్ సాధించిన తర్వాత నా గ్రాఫ్ పెరిగింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో ఆడకుండా తప్పించారు. మనసులో మరేవో కారణాలు పెట్టుకుని, ఫిట్‌నెస్ వంకతో తప్పించారు. మగ బ్యాడ్మింటన్ ప్లేయర్ 30 ఏళ్ల వయసులో కూడా ఆడుతూ మెడల్ సాధించినప్పుడు నేను 24 ఏళ్లకే ఫిట్‌నెస్ కోల్పోతానా? ఆ తర్వాత 2010లో ఢిల్లీలో జరిగిన కామన్‌వెల్త్‌లో గోల్డ్ సాధించాను, 2011 వరల్డ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం వచ్చింది. నిజానికి ఫిట్‌నెస్ కోల్పోయి ఉంటే ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి?
ఆ మాటలోనే ఉంది ఆధిపత్యం!
ఎన్ని కబుర్లు చెప్పుకున్నా సరే మనది మేల్ డామినేషన్ సొసైటీ. ‘మహిళలకు ఎన్నో అవకాశాలనిస్తున్నాం’ అనే మాటలోనే ఆధిపత్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అంటే ఇచ్చే స్థాయిలో వాళ్లు తీసుకోవాల్సిన స్థితిలో మహిళలు ఉన్నారనేగా ఈ మాటలు చెప్పే మగవాళ్ల ఉద్దేశం. మా ఆటలో కూడా మెన్స్ డబుల్స్ ఉన్నట్లు విమెన్స్ డబుల్స్ ఉండవు. ఆ బారికేడ్‌ను దాటడానికి ఎంతో శ్రమించాల్సి వచ్చింది. విమెన్స్ డబుల్స్ గురించి మాట్లాడితే ‘విమెన్ సింగిల్స్ ఉన్నాయి చాలు కదా’ అంటారు. ఇంకా గట్టిగా అడిగితే మిక్స్‌డ్ డబుల్స్ పెట్టేవారు.
సాధికారత సాధించాలనే తపన ఉన్న మహిళలకు కొదవ లేదు. తమ చేతిలో ఉన్న అధికారాన్ని కాస్తంత వదులుకోవడానికి సిద్ధంగా లేని మగవాళ్లే ఎక్కువగా ఉన్నారు, అడ్డంకులను ఎదుర్కొని తమను తాము నిరూపించుకోవాలని ప్రయత్నించే వాళ్లంతా తీవ్రమైన వివక్షను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఏదైనా అసమానతను ప్రశ్నిస్తే వారికి ఒక ముద్ర వేసేస్తారు. అందుకు ఉదాహరణ నేనే. సోషల్ మీడియా విస్తరించడం వల్ల సమాజం నిజస్వరూపం బయటపడుతోంది. ఎంత ఇరుకుగా ఆలోచిస్తారో తెలుస్తోంది. ముఖ్యంగా యూత్ ఆలోచనలు ఇలా ఉంటే రాబోయే తరం మహిళ పరిస్థితి ఎలా ఉంటుంది? కమింగ్ జనరేషన్‌కి తండ్రులు ఈ యువతే కదా! సొసైటీ ఈ లేబిలింగ్ హ్యాబిట్ పోనంత వరకు మహిళకు సమానత్వం అనేది సాధ్యం కాదు. సమానత్వం కోసం, సాధికారత కోసం పోరాటమే ఉంటుంది. 21వ శతాబ్దంలో కూడా ఇంకా ఫెమినిజం, సమానవేతనం, వివక్ష, వేధింపులు, సాధికారత సాధన వంటి పదాలు వినిపిస్తున్నాయంటే... ఇందుకు తలదించుకోవాల్సింది మహిళలు కాదు మొత్తం సమాజం. ఈ పదాలు వినిపించని రోజు, వీటి అవసరం లేని రోజు మనం సంపూర్ణ సాధికారత సాధించినట్లు’’.
– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
మహిళలు జనాభాలో సగభాగం ఉన్నారు, అయినా అవకాశాల్లో మైనారిటీలే. అందుకే మహిళలు సాధికారత సాధించాలంటే ప్రోత్సాహకాలు ఇవ్వాలి, ప్రోత్సాహకరమైన వాతావరణం కల్పించాలి.
మహిళలకు తమ మీద తమకు సందేహం ఉండకూడదు. తానిది చేయగలనా అని మనమే సందేహపడితే ఇక ప్రోత్సాహం ఎక్కడ నుంచి లభిస్తుంది? ఎవరైనా వేలెత్తి చూపించగానే బెంబేలు పడిపోవడం మానేయాలి. అమ్మాయిలు తమకు ఇష్టమైన రంగంలో రాణించడానికి ముందడుగు వేయాలి. పరిస్థితులను ఎదుర్కోవడానికి ధైర్యాన్ని సమకూర్చుకోవాలి. ∙సినిమాలలో హీరోయిన్ పాత్రతో పోల్చుకోవడం మానేయాలి. ఎందుకంటే మన సినిమాల్లో హీరోయిన్ పాత్ర చాలా బలహీనమైనది. ఆమెకు కష్టం వస్తే హీరో వచ్చి రక్షించే సీన్లకోసం, హీరో పాత్రను ఎలివేట్ చేయడం కోసం అలా చిత్రీకరిస్తుంటారు. అది కమర్షియల్ ఎలిమెంట్ కావచ్చు. అమ్మాయిలు ఆ మైండ్‌సెట్‌లో కూరుకుపోకూడదు. కళ్ల ముందు ఏమి జరుగుతున్నా తలదించుకుని వెళ్లిపోతుంటే మంచి అమ్మాయి అనే బిరుదు వస్తుంది. ఆ బిరుదు కోసం ఎవరూ తమ ఉనికిని పణంగా పెట్టకూడదు. ∙ఈ తరం పేరెంట్స్ ప్రోగ్రెసివ్‌గా ఆలోచిస్తే... రాబోయే తరం అమ్మాయిలు, అబ్బాయిలకు అవకాశాలలో సమానత్వం వస్తుంది. మహిళలకు సాధికారత అందుబాటులోకి వస్తుంది.
పరిస్థితులను మనమే మార్చుకోవాలి
‘రాజకీయాల్లో ఉన్నప్పుడు అన్ని సెక్టార్ వాళ్లతో కలసి పనిచేయాలి. వివక్ష ఎదురైనా వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోకుండా, మన గౌరవాన్ని మనమే కాపాడుకోవాలి. సమస్యలు అన్ని చోట్లా ఉన్నట్లే రాజకీయాల్లోనూ’ అన్నారు కొత్తూరు గీతామూర్తి.
‘‘నేను 20 ఏళ్లుగా ప్రజల మధ్య ఉన్నాను. నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యేగా పోటీచేశాను. పార్టీలో ఉంటూ రకరకాల సమస్యల మీద సమాచారం ఇవ్వడం, పోలీస్ వ్యవస్థతో అవగాహన సదస్సులు నిర్వహించడంతోపాటు 23 జిల్లాలకు డైరెక్టర్‌గా, పార్టీ కోర్ కమిటీ మెంబర్‌గా చేశాను. గ్రామ కో ఆర్డినేటర్‌గా చేశాను. ఏ ఉద్యోగానికైనా ఓ టైమ్ లిమిట్ ఉంటుంది. పాలిటిక్స్‌లో ఉదయం ఆరుగంటల నుంచే డ్యూటీ మొదలైతే అర్ధరాత్రి దాటాకా ఫోన్లు వస్తుంటాయి. ఇక్కడ ఆడ–మగ తేడా లేదు. ధర్నాలు, రాస్తారోకోల్లో పాల్గొనాలి. రాజకీయాల్లో మహిళల పట్ల వివక్ష ఉంది. అలాగని దూరంగా ఉంటే ఇంకా దూరం పెట్టేస్తారు. ఇప్పటికీ చాలా పార్టీలలో మగనాయకులు ఆడవారి సేవలను మంగళహారతులకు, పూల దండలు వేయడానికే సరిపెడుతున్నారు.
కొన్ని కొన్ని విషయాల్లో నాకూ ఆత్మన్యూనత ఉండేది. అది పోవడానికి నెట్‌వర్కింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకున్నాను. రాజకీయాల్లో ఉన్న మహిళ ప్రతి రోజు తనని తాను కొత్తగా మార్చుకోవాలి. నిరంతరం ప్రజల్లో ఉండాలి, వారి కష్టసుఖాలు తెలుసుకోవాలి, వాటిని సాధ్యమైనంత పరిష్కరించాలి. యాక్టివ్‌గా ఉంటేనే అది సాధ్యమవుతుంది. బేటీ బచావో ప్రోగ్రామ్‌లో అంగన్‌వాడీ స్థాయి నుంచి అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌లు నిర్వహిస్తున్నాం. ఆడపిల్లలకు ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడ అండగా మేము నిలబడుతున్నాం. మా ఇంట్లో వాళ్లు నాకు మంచి సపోర్ట్. అలా ఉండేలా ఇంటి వాతావరణాన్ని మనమే మార్చుకోవాలి. అప్పుడే రాజకీయాల్లోనూ విజయం సాధించగలం.’’
– నిర్మలారెడ్డి
రాస్తే పుస్తకమే అవుతుంది!
ఏ స్పోర్ట్స్ పర్సన్ కూడా స్టార్‌డమ్ కోసం ఆట మొదలు పెట్టరు. ఆట మీద ప్యాషన్‌తో శ్రమిస్తాం. సక్సెస్ సాధించిన తర్వాత స్టార్‌డమ్, సెలబ్రిటీ హోదాను సమాజమే ఇస్తుంది. మేము కోరేది క్రీడాకారులుగా ఆదరించమనే. అయితే అందులోనూ మగవాళ్లకు ఆడవాళ్లకు తేడా చూపిస్తుంటే ఏంటిది అనిపిస్తుంది. నేను అనుభవించిన తేడాలను రాస్తే పుస్తకమే అవుతుంది. ఎదురీదాల్సిన పరిస్థితులు ఎన్ని వచ్చినా వెనుకడుగు వేయలేదు. నాకు తెలుసు నేనేమిటో? అందుకే ఎటువంటి వివక్షనీ ఖాతరు చేయలేదు. నేను నేనుగా నిలబడగలిగాను. నన్ను నేను నిరూపించుకోగలుగుతున్నాను.
అక్కడా పోరాటమే!
సమానమైన పనికి సమాన వేతనం అనే డిమాండ్‌ని ఇప్పుడు క్షేత్రస్థాయిలో వింటున్నాం. కానీ ఒకప్పుడు స్పోర్ట్స్‌లోనూ ఈ వివక్ష ఉండేది. బ్యాడ్మింటన్‌లో మగవాళ్లకు ఇచ్చినంత ప్రైజ్‌మనీ ఆడవాళ్లకు ఇచ్చే వారు కాదు గతంలో. మనదేశంలోనే కాదు, ప్రపంచ స్థాయిలోనే ఇంతటి వివక్ష ఉండేది. ఈ కండిషన్ నుంచి ఈక్వల్ రెమ్యూనరేషన్ కోసం ప్లేయర్‌లు పోరాడి సాధించుకోవాల్సి వచ్చింది.
ఫండమెంటల్ రైట్స్...
- మహిళలకు మగవాళ్లతో సమానమైన హక్కు
- మహిళల పట్ల లింగవివక్ష నిషేధం
- అవసరమైనప్పుడు రాజ్యం... మహిళల ప్రయోజనాల కోసం నిశ్చయాత్మకమైన చర్యలు తీసుకోవాలనే సూచన
- ఉద్యోగాల కల్పనలో ప్రతి పౌరునికీ సమాన అవకాశాలుండాలి... అని చెప్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment