వర్తమానమూ... విజయసూత్రమే
అస్పష్టత.. క్లిష్టత:కొన్ని ప్రశ్నల సమాధానాలు సులభంగానే అనిపిస్తాయి. కానీ క్లిష్టంగా, అస్పష్టంగా, తికమక పెట్టేలా ఉంటాయి. ఇలాంటివాటికి తొందరపాటు పనికిరాదు. అలా చేస్తే భారీ మూల్యం తప్పదు. ఉదాహరణ:కేంద్ర మంత్రి మండలి ఎవరికి బాధ్యత వహిస్తుంది? లోక్‌సభకా? పార్లమెంట్‌కా? దీని వివరణ కోసం ఆర్టికల్ 75లో సమగ్రంగా చదివితే స్పష్టత వస్తుంది. అదే విధంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం రాజ్యాంగ పీఠిక, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలకు సంబంధించిన విషయాలు కూడా ఇలాగే ఇబ్బందిపెడతాయి. అందువల్ల వీటిపై సమ గ్ర అధ్యయనం అవసరం. ప్రిలిమ్స్‌కు స్వల్పవ్యవధి మాత్ర మే ఉంది. ఈ కొద్ది సమయాన్ని సరైన ప్రణాళికతో సద్వినియోగపరచుకోవచ్చు. అందుకు మేలైన దారుల్లో కొన్ని...
పాత ప్రశ్నపత్రాలతో పూర్తి అవగాహన:
పాత పేపర్లను క్షుణ్నంగా చదివితే పూర్తిస్థాయి అవగాహన ఏర్పడుతుంది. పాత ప్రశ్నపత్రాలకు మించిన ఉత్తమ వనరులు వేరేవేమీ లేవనడంలో సందేహం లేదు. సివిల్స్‌కు సిద్ధమవుతున్న అభ్యర్థులు చేయాల్సిన మొదటి పని ఇదే. ఇలా చేస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఎకానమీ సబ్జెక్ట్‌కు 15 సంవత్సరాల పాత ప్రశ్నపత్రాలను, మిగతా సబ్జెక్టులకైతే 20-30 సంవత్సరాల పేపర్లను నిశితంగా పరిశీలించాలి. వీటిని అధ్యయనం చేస్తే మానసికంగా కొంత విజయం సాధించినట్లే.
గత పదేళ్లలో నిర్వహించిన ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాలను క్షుణ్నంగా పరిశీలించి ప్రశ్నల సరళిపై అవగాహన ఏర్పరచుకోవాలి.ప్రశ్నల ప్రాతిపదికకు సంబంధించి ముఖ్యాంశాలను నోట్స్‌లో రాసుకోవాలి. ఏడాదిగా సివిల్స్ కోసం సాధన సాగించిన వారు నోట్స్‌లో రాసుకున్న అంశాలను పునశ్చరణ చేయాలి. క్లిష్టమైన అంశాలను మరింత గుర్తుండి పోయేలా పాకె ట్ బుక్‌లో రాసుకుంటే మంచిది. రాజ్యాంగం, ఎకనామిక్స్, చరిత్ర.. ఇలా ప్రతి సబ్జెక్టుకు సంబంధించిన కీలక పాయింట్లను ఇందులో రాసుకోవాలి.
ప్రిలిమ్స్.. మెయిన్‌సకు ఉపయుక్తమే:
సాధారణంగా ప్రిలిమ్స్ కోసం చదివిన అంశాలు మెయిన్స్, పర్సనాలిటీ టెస్ట్‌కు అంతగా ఉపకరించవని అనుకుంటారు. కానీ ఈ భావన తప్పు. ప్రిలిమ్స్ అంశాలు పూర్తిగా కాకున్నా కొంతమేర దోహద పడతాయి. ప్రిలిమ్స్, మెయిన్స్ మధ్య చాలావరకు భిన్నత్వం ఉంటుంది. ఈ రెంటికీ సిలబస్ కూడా వేర్వేరు. అయితే అంశాలకు సంబంధించి స్పష్టత, అనుబంధ సమాచారం, మానసిక క్రమశిక్షణ, మార్గదర్శక సూత్రాల అమలులో రెండు పరీక్షలకు ఒకేలా ఉంటుంది.
వర్తమాన అంశాలపై పట్టు:
ఇటీవల 16వ లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల సరళి, ఎన్నికల కమిషన్. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ల మధ్య పోలిక మొదలైన అంశాలు చదవాలి. 14వ ఆర్థిక సంఘం తుది నివేదిక కొద్ది నెలల్లో సమర్పిస్తుంది. దీనిపై ప్రశ్న అడిగే అవకాశం ఉంది. ఇటీవల గవర్నర్ల నియామకం - తొలగింపు (ఆర్టికల్ 123) వివాదాస్పదంగా మారింది. ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కొలీజియం వ్యవస్థకు జ్యుడీషియల్ కమిషన్ మధ్య వివాదం... ఇలా వర్తమానవ్యవహారాలకు సంబంధించి ప్రశ్నలు రావచ్చు. జాతీయ అత్యయిక పరిస్థితి (ఆర్టికల్ 352), రాష్ట్రపతి పాలన మొదలైనవి. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ తరచూ రాష్ట్రపతిని కలవడానికి ప్రధాన కారణాలు, ద్రవ్యోల్బణం, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో), మానిటరీ పాలసీ, సెబీ ఆర్డినెన్స్, చెల్లింపుల్లో సమతూకం (బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్), రాయితీలు, ఎఫ్‌ఆర్‌బీఎం, పన్ను వసూలు భావనలు (ట్యాక్సేషన్ కాన్సెప్ట్స్), విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, పెట్టుబడుల పంపిణీ మొదలైన అంశాలపై ప్రిలిమ్స్‌తో పాటు మెయిన్స్‌లోనూ తరచూ ప్రశ్నలు వస్తుంటాయి. ఈ అంశాలు వర్తమాన వ్యవహారాలకు సంబంధించినవే అయినా ఏటా మారుతుంటాయి. కాబట్టి ఈ అంశాలపై ఎల్లప్పుడూ విశ్లేషణాత్మక అధ్యయనం సాగిస్తే ప్రిలిమ్స్, మెయిన్‌సకు తోడ్పడుతుంది.
సైన్స్ అంశాల నుంచి:
ప్రిలిమినరీలో కరెంట్ ఐఫైర్స్ విభాగం ప్రత్యేకమైంది. రాజ్యాంగం, ఎకానమీ, సైన్స్‌లో సాధించిన పురోగతిపై అధికంగా ప్రశ్నలు వస్తున్నాయి. జాతీయ స్థాయి పత్రికల్లో తరచూ వచ్చే అంశాలపై అంటే సైన్స్‌లో ఎబోలా వైరస్, క్రయోజెనిక్ ఇంజిన్, శుద్ధి చేసిన యురేనియం, అణు సంబంధ పదార్ధాలు తదితర విషయాలపై ప్రశ్నలు వస్తున్నాయి. ఎకానమీ, జాతీయ విధానం అంశాలు కూడా కరెంట్ అఫైర్స్‌లో అడుగుతున్నారు. అన్ని రంగాల నుంచి పలు రూపాల్లో ప్రశ్నలు రావొచ్చు. వీటితోపాటు సంప్రదాయ జీవ, భౌతిక శాస్త్రాల అంశాలు కరెంట్ అఫైర్స్‌లో క్రియాశీల పాత్ర పోషిస్తున్నాయి. ఇటీవల జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జన్యు మార్పులు, జన్యు సాంకేతికతపై పలు నివేదికలు వెలువడ్డాయి. డీఆర్‌డీవో పరిశోధ నలు, బ్రిక్స్ బ్యాంక్ ఏర్పాటు.. ఇలా పలు అంశాలపై పట్టు సాధిస్తే ప్రిలిమ్స్‌తో పాటు మెయిన్స్‌కూ ఉపయుక్తం.
దినపత్రికలతోనే దిశ-దశ:
సివిల్స్‌కు సన్నద్ధమయ్యే వారు ప్రామాణిక దినపత్రికలను చదవడం ఉత్తమం. పత్రికల్లో వచ్చే వర్తమాన వ్యవహారాలు, ఆర్థిక, సామాజిక, రక్షణ రంగాలకు చెందిన విశ్లేషణలు మనం చదివినవాటికి మరింత అదనపు సమాచారాన్ని అందిస్తాయి. ఉదాహరణకు ఆర్థిక సర్వే-2013. ఇందులో ఆర్థికపరమైన అంశాలన్నీ వివరణాత్మకంగా పత్రికల్లో వచ్చాయి. ఆర్థిక నిపుణులు తమ ఆలోచనలు, అనుభవాలను రంగరించి రూపొందించిన ఈ నివేదికలోని అంశాలను చదివితే ఎంతో ప్రయోజనం. ఇటీవల ఎక్కువగా స్మార్ట్‌సిటీల గురించి ప్రస్తావన వస్తోంది. వీటితోపాటు కేంద్రం చేపట్టిన కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు పాతపేర్లను తొలగించి వాటి స్థానంలో దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, శ్యామప్రసాద్ ముఖర్జీ, జయప్రకాశ్ నారాయణ్, మదన్‌మోహన్‌మాళవీయ పేర్లను పెడుతున్నారు. వీటిపై అభ్యర్థులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. చదవని అంశాల గురించి ఆందోళన చెందకుండా చదివిన అంశాలను ఏ మేర విశ్లేషణతో ఆకళింపు చేసుకున్నారో స్వీయ మూల్యాంకనం చేసుకోవాలి. కొత్తగా ప్రాధాన్యమనిపించిన విషయాలేవైనా గుర్తించినట్లైతే అలాంటి వాటిపై పట్టు సాధించేందుకు మరింత కృషి చేయాలి.
చర్చా కార్యక్రమాలు:
టీవీల్లో ప్రసారమయ్యే చర్చా కార్యక్రమాలను చూస్తే విశ్లేషణ శక్తి పెరుగుతుంది. కొన్ని చానెళ్లు విషయ పరిజ్ఞానం లేనివారితో చర్చలు కొనసాగిస్తుంటాయి. వాటి జోలికి వెళ్లకుండా ఆయా రంగాల్లో నిపుణులైన వారితో చేపట్టే కార్యక్రమాలను వీక్షిస్తే ఫలితం ఉంటుంది. కొందరు టీవీ చర్చా కార్యక్రమాలను చూస్తున్నాం కాబట్టి పత్రికలను చదవాల్సిన అవసరం లేదనుకుంటారు. అలాంటివారు ఈ ధోరణి విడనాడాలి. కనీసం ఒక ప్రామాణిక దినపత్రికనైనా చదవాలి. పరీక్షకు అవసరమైన వార్తలు, సమీక్షలు, సంఘటనలపై ఎప్పటికప్పుడు నోట్స్ రూపొందించుకోవాలి.
జయాపజయాలను నిర్ణయించేది
ప్రిలిమ్స్‌లో కరెంట్ అఫైర్స్ విభాగం నుంచి కనీసం 40 నుంచి 45 ప్రశ్నలు వస్తాయి. ఎవరైతే ఇందులో 40 ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తిస్తారో వారు విజయానికి చేరువవుతారు. ఓ రకంగా చెప్పాలంటే జయాపజయాలను నిర్ణయించే విభాగం ఇదే. కరెంట్ అఫైర్స్‌కు ప్రిపేరవ్వాలనుకునేవారు ప్రామాణిక దినపత్రికలు, వార్తా మ్యాగజైన్లను చదివితే మంచిది. వాటిలో కీలకమైన పాయింట్లను గుర్తించి, దాన్ని ప్రశ్న రూపంలో ఇలా అడగొచ్చు అని ఏవరికి వారు విశ్లేషించుకోవాలి. ఒక్కో అంశాన్ని నాలుగు కోణాల్లో ఆలోచించి సమాధానం గుర్తించడం సాధన చేయాలి. గత ప్రిలిమ్స్‌లో ఏ రూపంలో ప్రశ్నలు వచ్చాయో వాటికి అనుగుణంగా నోట్స్ రాసుకోవాలి. ఇలా చేయడం నాకు ఎంతో ఉపకరించింది. ప్రభుత్వ రంగ సంస్థల అధినేతలు, పభుత్వ పథకాలు, వాటి లక్ష్యాలు, అంతర్జాతీయ సంఘటనలపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి. వార్తల్లోకెక్కిన ప్రదేశాలపై పట్టుకోసం అట్లాస్ చూస్తే మరింతగా గుర్తుండి పోతుంది. ఇలా సాధన సాగిస్తే కరెంట్ అఫైర్స్ విభాగంలో 95 శాతం విజయం సాధించవచ్చు.
- శశాంక ఆల, సివిల్స్- 2013 విజేత.
రిఫరెన్స్ బుక్స్
హిస్టరీ:
ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ -
బిపన్ చంద్ర
ఫాసెట్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్ -
స్పెక్ట్రమ్ (కల్చర్)
జాగ్రఫీ:
జాగ్రఫీ ఆఫ్ ఇండియా - మాజిద్ హుస్సేన్
ఆక్స్‌ఫర్‌డ స్కూల్ అట్లాస్ - ఆక్స్‌ఫర్డ్
సర్టిఫికెట్ ఫిజికల్ అండ్ హ్యూమన్ జాగ్రఫీ-
జి చాంగ్ లియోంగ్
ఎకానమీ:
ఇండియన్ ఎకానమీ - ఎన్‌సీఈఆర్‌టీ
10, 12 తరగతుల సిలబస్-ఎకానమీ
ఆక్స్‌ఫర్డ్/పెంగ్విన్ డిక్షనరీ ఆఫ్ ఎకానమిక్స్
సోషియో ఎకనమిక్ సర్వే (2013)
సైన్‌స అండ్ టెక్నాలజీ
సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ఇండియా- కల్పనా రాజారామ్, స్పెక్ట్రమ్
ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ ఫ్రమ్ క్రైసిస్ టు క్యూర్ - రెండో ఎడిషన్-ఆర్.రాజగోపాలన్
(ఎన్విరాన్‌మెంట్)
కరెంట్ అఫైర్‌స-జీకే
ఇండియా ఇయర్ బుక్ 2014
మనోరమ ఇయర్ బుక్ 2014
పామాణిక కెరీర్ జర్నల్
న్యూస్ మ్యాగజైన్స్
సెలెక్టివ్ రీడింగ్ ఫ్రమ్ వికీపీడియా