సివిల్స్ ప్రిలిమినరీ పాలిటీకి పదిలమైన వ్యూహాలు
దేశంలో జరిగే ప్రతి పోటీ పరీక్షలో ‘ఇండియన్ పాలిటీ (భారత రాజకీయ వ్యవస్థ) పై తప్పనిసరిగా అధిక సంఖ్యలో ప్రశ్నలు ఉంటాయి. అత్యున్నత పరీక్ష అయిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీలోని జనరల్ స్టడీస్ పేపర్-1లో పాలిటీ విభాగం ఎంతో ముఖ్యమైంది. దీనిలో సుమారు 16 నుంచి 18 ప్రశ్నలను అడుగుతారు. అందుకే పాలిటీపై సునిశిత దృష్టి సారించడం చాలా అవసరం. విస్తృత పఠనం, తార్కిక విశ్లేషణ, వర్తమాన రాజకీయ అంశాలను, సంఘటనలను రాజ్యాంగపరంగా అన్వయించుకుంటూ అధ్యయనం చేస్తే పాలిటీ విభాగంలో మంచి మార్కులు సాధించవచ్చు.
సిలబస్ విస్తృతం-సమకాలీన సమన్వయం:
పాలిటీ విభాగం మిగతా వాటి కంటే భిన్నంగా ఉంటుంది. సిలబస్‌లోని ప్రతి అంశం సమకాలీన సంఘటనలతో ముడిపడి గతిశీలతను సంతరించుకొంటుంది. భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, పరిపాలన, పంచాయతీరాజ్ వ్యవస్థ, పబ్లిక్ పాలసీ, హక్కుల సమస్యలు మొదలైన అంశాలను సిలబస్‌లో ప్రస్తావించారు. వీటిని సమకాలీన అంశాలకు అన్వయించుకొన్నప్పుడు సిలబస్ పరిధి చాలా విస్తృతం అవుతుంది.
ప్రశ్నల సరళి, స్వభావం, ప్రమాణాలు:
ప్రిలిమినరీ పరీక్షలో ప్రశ్నలు పూర్తిగా ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి. గత ప్రశ్న పత్రాలను విశ్లేషిస్తే ప్రశ్నల స్థాయిని మూడు రకాలుగా విభజించవచ్చు.
1. విషయ పరిజ్ఞానానికి సంబంధించినవి
(Knowledge based)
2. విషయ అవగాహన
(Understanding - Comprehension)
3. విషయ అనువర్తన (Application)
మొదటిరకం ప్రశ్నలకు జవాబులు Facts, Figures ఆధారంగా గుర్తించాల్సి ఉంటుంది. చదివి గుర్తుంచుకుంటే సరిపోతుంది.
మాదిరి ప్రశ్న: ఏకగ్రీవంగా ఎన్నికైన రాష్ర్టపతి ఎవరు?
a) నీలం సంజీవరెడ్డి b) డా. రాజేంద్రప్రసాద్
c) ఆర్. వెంకట్రామన్ d) ఎవరూ కాదు
సమాధానం: a
రెండో తరహా ప్రశ్నల్లో సమాచారాన్ని అభ్యర్థి ఎంతవరకు అవగాహన చేసుకున్నాడు అనేది పరిశీలిస్తారు.
మాదిరి ప్రశ్న: రాష్ర్టపతిగా పోటీ చేయాలంటే?
a) పార్లమెంటులో సభ్యత్వం ఉండాలి
b) లోక్‌సభలో సభ్యత్వం ఉండాలి
c) రాజ్యసభలో సభ్యత్వం ఉండాలి
d) ఏ సభలోనూ సభ్యత్వం ఉండాల్సిన అవసరం లేదు
సమాధానం: d
వివిధ పదవులకు పోటీ చేయాలంటే ఉండాల్సిన అర్హతలపై అవగాహన ఉన్నప్పుడు ఇలాంటి ప్రశ్నలకు సులభంగా సమాధానం గుర్తించగలుగుతారు.
మూడో తరహా ప్రశ్నలు అభ్యర్థి తెలివి, సందర్భానుసార అనువర్తనకు సంబంధించి ఉంటాయి. తన విచక్షణా జ్ఞానంతో సరైన సమాధానాన్ని గుర్తించాల్సి ఉంటుంది.
మాదిరి ప్రశ్న: రాష్ర్టపతికి ఉన్న ఆర్డినెన్‌స జారీ చేసే అధికారం?
a) పార్లమెంట్ శాసనాధికారాలకు సమాంతరం
b) పార్లమెంట్ శాసనాధికారాలకు అనుబంధం
c) పార్లమెంట్ శాసనాధికారాలకు ప్రతిక్షేపం
d) పైవేవీ కాదు
సమాధానం: b
రాష్ర్టపతి ఆర్డినెన్‌స అధికారాలకు సంబంధించి సంపూర్ణ అవగాహన,తార్కిక విశ్లేషణ సామర్థ్యాలు ఉన్నప్పుడే ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలను గుర్తించడం సాధ్యమవుతుంది. ఈ తరహా ప్రశ్నలనే సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో ఎక్కవగా అడుగుతున్నారు.
సిలబస్-అధ్యయనం చేయాల్సిన ముఖ్యాంశాలు
రాజ్యాంగ చరిత్ర - రాజ్యాంగ పరిషత్:
రాజ్యాంగ చారిత్రక పరిణామం, బ్రిటిషర్లు ప్రవేశపెట్టిన ముఖ్య సంస్కరణలు, చార్టర్, కౌన్సిల్ చట్టాలు, రాజ్యాంగ పరిషత్ నిర్మాణం ముఖ్య కమిటీలు, ప్రముఖ సభ్యులు, తీర్మానాలు, రాజ్యాంగ ఆధారాలు వంటి అంశాలపై దృష్టి సారించాలి.
మాదిరి ప్రశ్న: భారత రాజ్యాంగ పరిషత్‌కు సంబంధించి సరైన అంశం?
a) పూర్తిగా పరోక్ష ఎన్నికలు జరిగాయి
b) ప్రొవిజనల్ పార్లమెంట్‌గా పనిచేసింది
c) ఏకాభిప్రాయ పద్ధతిలో అంశాలను నిర్ణయించారు
d) పైవన్నీ
సమాధానం: d
ప్రవేశిక, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు:
రాజ్యాంగ పునాదులు, తత్వం, లక్ష్యాలు, ప్రాథమిక హక్కులు - రకాలు, ప్రాముఖ్యత, వాటి సవరణలు, విస్తరణ, సుప్రీంకోర్టు తీర్పులు, సమకాలీన వివాదాలు, ఆదేశిక నియమాలతో ప్రతిష్టంభన, తాజా పరిణామాలపై విస్తృత అధ్యయనం చేయాల్సి ఉంటుంది.
మాదిరి ప్రశ్న: రాజ్యాంగంలో అంతర్భాగమైన ఆర్థిక న్యాయాన్ని ఏ భాగంలో ప్రస్తావించారు?
a) ప్రవేశిక, ప్రాథమిక హక్కులు
b) ప్రవేశిక, ఆదేశిక నియమాలు
c) ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు
d) పైవేవీకాదు
సమాధానం:b
కేంద్ర ప్రభుత్వం:
కార్యనిర్వాహక స్వభావం, రాష్ర్టపతి, ఉప రాష్ర్టపతి ఎన్నిక, తొలగింపు అధికారాలు, ప్రధానమంత్రి, మంత్రి మండలి, సంకీర్ణ రాజకీయాలు, బలహీనపడుతున్న ప్రధానమంత్రి పదవి, పార్లమెంట్ నిర్మాణం, లోక్‌సభ, రాజ్యసభ ప్రత్యేక అధికారాలు, పార్లమెంట్ ప్రాముఖ్యత- క్షీణత, జవాబుదారీతనం లోపించడం, విప్‌ల జారీ, పార్టీ ఫిరాయింపుల చట్టం, నేరమయ రాజకీయాలు.
సుప్రీంకోర్టు అధికార విధులు, క్రియాశీలత, జాతీయ న్యాయ నియామకాల కమిషన్ బిల్లు మొదలైన సమకాలీన పరిణామాలపై అవగాహన కలిగి ఉండాలి.
మాదిరి ప్రశ్న: ముఖ్యమంత్రిగా, స్పీకర్‌గా, రాష్ర్టపతిగా పనిచేసిన వారు?
a) నీలం సంజీవరెడ్డి
b) జ్ఞానీ జైల్‌సింగ్
c) సర్వేపల్లి రాధాకృష్ణన్
d) a, b
సమాధానం: a
మాదిరి ప్రశ్న: కింది వాటిలో 16వ లోక్‌సభకు సంబంధించి సరైంది?
a) అత్యధిక మహిళా ప్రాతినిధ్యం ఉంది
b) మెజారిటీ సభ్యులు మొదటిసారి ఎన్నికైనవారు
c) రెండో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే
d) పైవన్నీ
సమాధానం: d
రాష్ర్ట ప్రభుత్వం:
గవర్నర్ నియామకం, అధికార విధులు విచక్షణాధికారాలు - వివాదాలు, ముఖ్యమంత్రి - మంత్రి మండలి, విధానసభ, విధాన పరిషత్, హైకోర్టు, సబార్డినేట్ కోర్టులు మొదలైన అంశాలను అధ్యయనం చేయాలి.
మాదిరి ప్రశ్న: కింది వారిలో ఎవరికి ప్రత్యక్షంగా విచక్షణాధికారాలు ఉన్నట్లుగా రాజ్యాంగంలో పేర్కొనలేదు?
a) గవర్నర్ b) రాష్ర్టపతి
c) ముఖ్యమంత్రి d) ప్రధానమంత్రి
సమాధానం: b
కేంద్ర రాష్ర్ట సంబంధాలు:
సమాఖ్య స్వభావం, అధికార విభజన, శాసన, పాలన, ఆర్థిక సంబంధాలు, అంతర్రాష్ర్ట మండలి, ప్రణాళికా సంఘం, జాతీయ అభివృద్ధి మండలి, కేంద్ర - రాష్ర్ట సంబంధాల సమీక్షా కమిషన్లు వాటి సిఫారసులను లోతుగా అధ్యయనం చేయాలి.
మాదిరి ప్రశ్న: భారత సమాఖ్యలోని ఏకకేంద్ర లక్షణం?
a) గవర్నర్ల నియామకం
b) అఖిల భారత సర్వీసులు
c) అవశిష్ట అధికారాలను కేంద్రానికి ఇవ్వడం
d) పైవన్నీ
సమాధానం: d
స్థానికస్వపరిపాలన-73, 74వ రాజ్యాంగ సవరణలు:
ప్రజాస్వామ్య వికేంద్రీకరణ, చారిత్రక పరిణామం - మేయో, రిప్పన్ తీర్మానాలు, సమాజ వికాస ప్రయోగం - బల్వంత్ రాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ, జీవీకే రావు కమిటీ, ఎల్.ఎం. సింఘ్వి కమిటీలు, వాటి సిఫార్సులు; 73, 74వ రాజ్యాంగ సవరణ చట్టాలు, నూతన పంచాయతీ వ్యవస్థ, పెసా (PESA) చట్టం మొదలైన అంశాలపై పరిపూర్ణ అవగాహన ఉండాలి.
మాదిరి ప్రశ్న: షెడ్యూల్డ్ ఏరియాకు వర్తించేందుకు చేసిన పంచాయతీ విస్తరణ చట్టం (PESA) 1996 ముఖ్య ఉద్దేశం?
a) గ్రామ పంచాయతీలకు కీలక అధికారాలు
b) స్వయంపాలన అందించడం
c) సంప్రదాయ హక్కులను గుర్తించడం
d) పైవన్నీ
సమాధానం: d
రాజ్యాంగపరమైన సంస్థలు:
ఎన్నికల సంఘం, ఆర్థిక సంఘం, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, జాతీయ ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్లు, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్ ఇతర చట్టపర కమిషన్ల గురించి సాధికారిక సమాచారాన్ని కలిగి ఉండాలి.
మాదిరి ప్రశ్న: కేంద్ర-రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న రాజ్యాంగపర సంస్థ, సంస్థలు?
a) కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
b) ఆర్థిక సంఘం c) ఎన్నికల సంఘం
d) పైవన్నీ
సమాధానం: d
రాజ్యాంగ సవరణలు:
ముఖ్యమైన రాజ్యాంగ సవరణలపై అవగాహన పెంచుకోవాలి. ప్రధానంగా 1, 7, 15, 24, 25, 42, 44, 52, 61, 73, 74, 86, 91, 97, 98వ రాజ్యాంగ సవరణలతోపాటు తాజాగా ప్రతిపాదించిన బిల్లులను గుర్తుంచుకోవాలి.
ప్రభుత్వ విధానాలు హక్కుల సమస్యలు:
విధాన నిర్ణయాలు, వాటిని ప్రభావితం చేసే గతిశీలక అంశాలు, అభివృద్ధి, నిర్వాసితులు, పర్యావరణం, ఉద్యమాలు, పౌర సమాజం, మీడియా పాత్ర మొదలైన అంశాలను కూడా చదవాల్సి ఉంటుంది.
రీడింగ్ అండ్ రిఫరెన్‌స బుక్స్
విస్తృత పఠనం/అధ్యయనం తప్పనిసరి. ప్రామాణిక పుస్తకాలను చదవాలి. మార్కెట్లో వ్యాపార ధోరణితో ముద్రించిన పుస్తకాలు, గైడ్లను చదవకూడదు! పునరుక్తి (రిపిటిషన్) అవుతాయి కాబట్టి సమయం వృథా అవుతుంది. ‘రీడింగ్’కు ‘రిఫరెన్‌సకు’ తేడా గుర్తించాలి. ఒకటి లేదా రెండు ప్రామాణిక పుస్తకాలు చదివితే చాలు. అంశాలను, అవసరాన్ని బట్టి ముఖ్యమైన పుస్తకాలను సంప్రదించాలి.
(రిఫరెన్‌స): విషయ పరిధిని విస్తరించుకోవాలి.
- NCERT 10th, 11th, 12th స్థాయి
సివిక్స్ పుస్తకాలు
- Our parliament, our constitutions our judicialy
- National Book Trust Publication
- భారత రాజ్యాంగం - రాజకీయ వ్యవస్థ -
బి. కృష్ణారెడ్డి, జి.బి.కే. పబ్లికేషన్‌స
- The constitution of India (Bare act) P.M. Bakshi
- Introduction to the constitution of India - D.D. Basu
- Note: ప్రీవియస్ క్వశ్చన్‌స సాధన చేయాలి. చాప్టర్ వారీగా టెస్ట్ పేపర్‌స కూడా సాధన చేయాలి.
వీటిని గుర్తుంచుకోండి
- జాతీయ స్థాయిలో నిర్వహించే అత్యున్నత పరీక్ష. సుదీర్ఘ ప్రయత్నం, పట్టుదల అనివార్యం. కొన్ని త్యాగాలకు సిద్ధంగా ఉండే మనస్తత్వం ఉండాలి.
- చదివే అంశంపై స్పష్టత తప్పనిసరి. తార్కికంగా ప్రశ్నించుకుంటేనే ఇది సాధ్యమవుతుంది.
- ప్రకరణలు, భాగాలు, షెడ్యూళ్లను పీరియాడికల్‌గా రివిజన్ చేస్తూ వాటిని గుర్తుంచుకోవాలి. కొన్ని మెమొరీ టెక్నిక్స్‌ను కూడా సృష్టించుకోవాలి.
- చదవడం ఎంత ముఖ్యమో, చదివిన అంశంపై ఆలోచించడం అంతే ముఖ్యం.
- గత ప్రశ్న పత్రాలను విస్తృతంగా సాధన చేయాలి. తద్వారా పరీక్ష ట్రెండ్, ప్రశ్నలస్థాయి తెలుస్తుంది.
- నిర్ణీత ప్రణాళిక తయారు చేసుకొని దానికి కట్టుబడి ఉండాలి.
- పాలిటీలో సమకాలీన అంశాలకు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి.
- సొంత నోట్స్ తయారు చేసుకోవడం ఉత్తమం
- ఆత్రుతతో సిలబస్ పూర్తి చేయొద్దు. ఆకళింపు చేసుకొని, ఎక్కువ పర్యాయాలు పునశ్చరణ చేయాలి.