మాటల్లేవ్!
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి నేటితో తెర
పోటాపోటీగా అభ్యర్థుల ప్రచారం
22న ఉదయం 8 నుంచి పోలింగ్
25న ఓట్ల లెక్కింపు
సిటీబ్యూరో: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారంతో తెరపడనుంది. సాయంత్రం 5 గంటలతో ప్రచార గడువు ముగుస్తోంది. ఈ ఎన్నికలను సవాల్‌గా తీసుకొని టీఆర్‌ఎస్, బీజేపీ-టీడీపీ, కాంగ్రెస్ పార్టీల వారు ఎవరికి వారుగా అన్ని మార్గాల్లో ప్రచారం చేస్తున్నారు. లోపాయికారీ ‘వ్యూహాలూ’ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికలకు 33 మంది నామినేషన్లు వేయగా...ఇద్దరు ఉపసంహరించుకున్నారు. 31 మంది బరిలో మిగిలారు. అధికార పార్టీకి చెందినజి.దేవీప్రసాద్‌రావు, టీడీపీ పొత్తుతో బీజేపీ అభ్యర్థి ఎన్.రామచంద్రరావు, కాంగ్రెస్ అభ్యర్థిగా ఆగిరు రవికుమార్ గుప్తా హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ప్రతిష్ట కోసం టీఆర్‌ఎస్, సవాల్‌గా తీసుకొని కాంగ్రెస్, బీజేపీల అగ్రనాయకులు తమ అభ్యర్థుల కోసం ముమ్మర ప్రచారం చేశారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి కోసం డిప్యూటీ
ముఖ్యమంత్రులు మహమూద్‌అలీ, నాయిని నరసింహారెడ్డిలతో సహా పలువురు మంత్రులు ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థి తరఫున కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి, టీడీపీ రాష్ట్రనేతలు దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డి, పెద్దిరెడ్డి, జిల్లా నాయకులు కృష్ణయాదవ్, కూన వెంకటేశ్ గౌడ్ తదితరులు ప్రచారం సాగించారు. కాంగ్రెస్ నుంచి పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితర నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారానికి ఎస్‌ఎంఎస్‌లు, వాట్సప్‌ను కూడా విస్తృతంగా వినియోగించుకున్నారు.
2.86 లక్షల ఓటర్లు
ఈ ఎన్నికల్లో 2,86,311 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో రంగారెడ్డి జిల్లా నుంచి అత్యధికంగా 1,33,003 మంది ఉన్నారు. హైదరాబాద్ జిల్లా నుంచి 87, 208 మంది, మహబూబ్‌నగర్ జిల్లా నుంచి 66,100 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. మొత్తం ఓటర్లలో 1,92,110 మంది పురుషులు కాగా, 94,188 మంది మహిళలు, 13 మంది ఇతరులు ఉన్నారు.
413 పోలింగ్ కేంద్రాలు
ఎన్నికలకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 97 పోలింగ్ కేంద్రాలు, రంగారెడ్డి జిల్లాలో 165, హైదరాబాద్ జిల్లాలో 151... వెరసి మొత్తం 413 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా చర్యలు తీసుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ జిల్లాలో 894 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. వీరిలో 182 మంది ప్రిసైడింగ్ అధికారులు, 182 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు ఉన్నారు. ఇంకా 364 మంది పోలింగ్ సిబ్బందితో పాటు 166 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. మిగతా జిల్లాల్లోనూ ఇదే స్థాయిలో సిబ్బందిని నియమించారు. 22న (ఆదివారం) ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. 25న ఉదయం 8 గంటల నుంచి చాదర్‌ఘాట్ విక్టరీ ప్లేగ్రౌండ్‌లో ఓట్లు లెక్కిస్తారు. కౌంటింగ్‌కు 28 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి, జీహెచ్‌ఎంసీ స్పెషల్ కమిషనర్ నవీన్‌మిట్టల్ పేర్కొన్నారు. అభ్యర్థులెవరూ నచ్చని పక్షంలో ‘నోటా’ను వినియోగించుకునే వీలుంది.
బల్క్ ఎస్సెమ్మెస్‌లు వద్దు
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా 20వ తేదీ సాయంత్రం 4 నుంచి 22వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు ఎలాంటి బల్క్ ఎస్‌ఎంఎస్‌లు పంపించరాదని, వాటిని ఎన్నికల ప్రయోజనాలకు వినియోగించరాదని ఎన్నికల సంఘం ఆదేశించినట్లు జీహెచ్‌ఎంసీ వర్గాలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి ఏజెంట్లు, రాజకీయ పార్టీలు దీన్ని పాటించాలని స్పష్టం చేశాయి.