మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికకు ఆదివారం జరిగిన రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
⇒ రీపోలింగ్‌లో 6.18 శాతం తగ్గిన ఓటింగ్..
⇒ 22న ఓట్ల లెక్కింపు
సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికకు ఆదివారం జరిగిన రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 82.49 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. బ్యాలెట్ పేపర్‌లో అభ్యర్థుల ఫొటోలు తారుమారవడంతో ఈ నెల 9న జరిగిన పోలింగ్ రద్దైన విషయం తెలిసిందే. ఆ పోలింగ్‌లో 88.67 శాతం ఓటింగ్ నమోదవగా, రీపోలింగ్‌లో 6.18 శాతం తగ్గింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు ప్రశాంతంగా సాగిందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి అద్వైత్‌కుమార్ సింగ్ తెలిపారు.
అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లతోపాటు ఇద్దరు వీడియోగ్రాఫర్లతో వీడియో తీయించామన్నారు. పోలింగ్ సరళిని అంబర్‌పేట ఇండోర్ స్టేడియం నుంచి పర్యవేక్షించామని, ఎక్కడా సమస్యలు దృష్టికి రాలేదని పేర్కొన్నారు. ఎన్నికల ప్రత్యేక పరిశీలకుడు రజత్‌కుమార్ హైదరాబాద్ నగరంలోని పలు కేంద్రాల్లో తనిఖీలు చేశారు. ఆయా జిల్లాల నుంచి బ్యాలెట్ బాక్సులు అంబర్‌పేట స్టేడియంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌లకు గట్టి బందోబస్తు మధ్య తరలించారు. అంబర్‌పేట స్టేడియంలో 22న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని అద్వైత్‌కుమార్ తెలిపారు.