సివిల్స్ బాటలో తొలి అడుగులో తళుకులకు... | Experts prelims victory Success Principles | Sakshi
Sakshi News home page

సివిల్స్ బాటలో తొలి అడుగులో తళుకులకు...

Published Thu, Jun 12 2014 4:17 AM | Last Updated on Sat, Sep 2 2017 8:38 AM

సివిల్స్ బాటలో తొలి అడుగులో తళుకులకు...

సివిల్స్ బాటలో తొలి అడుగులో తళుకులకు...

ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్, ఐపీఎస్ తదితర ఉన్నత సర్వీసుల్లో అడుగుపెట్టి, ఒకవైపు కెరీర్‌ను సువర్ణశోభితం చేసుకుంటూ, మరోవైపు ప్రజాసేవలో భాగమయ్యే సదవకాశాన్ని కల్పించే వేదిక సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్! ఔత్సాహికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సివిల్స్ నోటిఫికేషన్‌ను యూపీఎస్సీ మే 31న విడుదల చేసింది. ఈ ఏడాది నుంచి అభ్యర్థులు అదనంగా రెండుసార్లు పరీక్ష రాసే వెసులుబాటును కల్పించింది. దీంతో పోటీ కూడా పెరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో సివిల్స్ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో వేసే తొలి అడుగు అయిన ప్రిలిమ్స్‌లో విజయానికి నిపుణుల సక్సెస్ సూత్రాలు..
 
 సివిల్ సర్వీసెస్ పరీక్షలో ప్రిలిమ్స్ (ఆబ్జెక్టివ్ విధానం), మెయిన్స్ (రాత పరీక్ష), పర్సనాలిటీ టెస్ట్ (మౌఖిక పరీక్ష) ఉంటాయి. ప్రిలిమ్స్‌లో రెండు పేపర్లుంటాయి. జనరల్ స్టడీస్ పేపర్ 1లో వంద ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున మొత్తం పేపర్‌కు 200 మార్కులు కేటాయించారు. జనరల్ స్టడీస్ రెండో పేపర్ (ఆప్టిట్యూడ్ టెస్ట్)లో 80 ప్రశ్నలుంటాయి. దీనికి 200 మార్కులు కేటాయించారు. ఒక్కో పేపర్‌కు రెండు గంటల సమయమిచ్చారు. ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్, హిందీలో ఉంటాయి.
 
 పేపర్ 1 - జీఎస్
 కరెంట్ అఫైర్స్: కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు ఏ విభాగం, ఏ మూల నుంచైనా రావచ్చు. ఈ విభాగంపై పట్టు సాధించాలంటే ప్రతి రోజూ కనీసం రెండు వార్తా పత్రికలను పరీక్షను దృష్టిలో ఉంచుకొని చదవాలి. పరీక్ష తేదీకి కనీసం 8 నెలల ముందు వరకు ఉన్న జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్య అంశాలను చదవాలి.
 
 హిస్టరీ
 సివిల్స్ ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్ హిస్టరీ సిలబస్‌లో ‘భారత దేశ చరిత్ర, భారతదేశ స్వాతంత్య్రోద్యమం’ అని పేర్కొన్నారు. చరిత్రలో ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక భారతదేశ చరిత్ర విభాగాలుంటాయి. హిస్టరీ నుంచి 15-20 ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. అభ్యర్థులు భారత స్వాతంత్య్ర ఉద్యమం గురించి పూర్తిస్థాయిలో తెలుసుకోవాలి. ప్రాచీన భారతదేశ చరిత్ర నుంచి అడుగుతున్న కొన్ని ప్రశ్నలు పూర్తిగా ఫిలాసఫీకి సంబంధించినవి ఉంటున్నాయి. ఉదాహరణకు మతాలు, మత సిద్ధాంతాలపై అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు మత గ్రంథాల్లో మాత్రమే ఉంటున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇండియన్ హిస్టరీ నుంచి రాజకీయ కోణం నుంచి కాక సామాజిక, సాంస్కృతిక అంశాలపై ప్రశ్నలు వస్తున్నాయి. ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించి సంఘసంస్కరణ ఉద్యమాలు,
 
 జాతీయ ఉద్యమం- ముఖ్య ఘట్టాలు, చట్టాలు- ఫలితాలు వంటి వాటిపై దృష్టిసారించాలి. రీజనల్ హిస్టరీ నుంచి కూడా ప్రశ్నలు వస్తున్నాయి. అవి కూడా చాలా లోతుగా ఉంటున్నాయి. ఇవి ముఖ్యమైనవి అనుకున్న అంశాల నుంచి కాకుండా, మారుమూల అంశాల నుంచి కూడా ప్రశ్నలు వస్తున్నాయి. అందువల్ల అభ్యర్థులు పూర్తిస్థాయిలో విశ్లేషణాత్మక ప్రిపరేషన్ సాగించాలి. ప్రిపరేషన్‌కు ప్రాథమికంగా ఎన్‌సీఈఆర్‌టీ పాత పుస్తకాలు అక్కరకొస్తాయి. ప్రాచీన చరిత్రకు ఆర్.శర్మ, రొమిల్లా థాపర్; మధ్యయుగ చరిత్రకు సతీష్ చంద్ర; ఆధునిక చరిత్రకు బిపిన్ చంద్ర పుస్తకాలు ఉపయోగపడతాయి.
 
 జాగ్రఫీ
 జాగ్రఫీ, ఎన్విరాన్‌మెంటల్ ఎకాలజీ నుంచి 24-30 ప్రశ్న లు వస్తున్నాయి. ఈ ఏడాది కూడా ఇదే తరహాలో ప్రశ్నలు వచ్చే అవకాశముంది. ప్రిలిమ్స్‌లో జాగ్రఫీ, ఎకాలజీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు కాబట్టి అభ్యర్థులు ప్రిపరేషన్ ప్రణాళికలో వీటికి అధిక సమయం కేటాయించాలి. సిలబస్‌లో ‘భారతదేశం, ప్రపంచ భౌతిక, సామాజిక, ఆర్థిక భూగోళశాస్త్రం’ అని పేర్కొన్నారు. అభ్యర్థులు భారత్-భౌగోళిక అంశాలపై ఎక్కువగా దృష్టిసారించాలి. మన దేశానికి సంబంధించి వ్యవసాయం- వ్యవసాయ సంక్షోభం, రుతువులు, నదులు, అడవులు- అటవీ భూముల ఆక్రమణ, అంతరిస్తున్న జీవజాతులు, శక్తి వనరులు తదితరాలపై అవగాహన పెంపొందించుకోవాలి. రవాణా, పట్టణీకరణ ప్రక్రియ, సరిహద్దుల వివాదాలు వంటివీ ముఖ్యమే. కోర్ ఎకాలజీ నుంచి ప్రధానంగా రెండు అంశాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. అవి.. ఎకాలజీ బేసిక్ కాన్సెప్టులు (ఉదా: ఎకలాజికల్ రిచ్‌నెస్..); అప్లైడ్ ఎకాలజీ (ఉదా: గ్లోబల్ వార్మింగ్ పర్యావరణాన్ని ఎలా నాశనం చేస్తుంది?). విపత్తులకు సంబంధించి భూకంపాలు, సునామీలు, తుపానులు, అగ్నిపర్వత పేలుళ్లు, వరదలు వంటి వాటికి సంబంధించిన శాస్త్రీయ పరిజ్ఞానంపై ప్రశ్నలు వస్తున్నాయి.
 
 ఇప్పుడు స్టేట్‌మెంట్ ఆధారిత ప్రశ్నలు వస్తున్నాయి. ఒకే ప్రశ్న ద్వారా వివిధ అంశాల్లో అభ్యర్థికున్న పరిజ్ఞానాన్ని పరీక్షించేలా ఉంటున్నాయి. అందువల్ల అభ్యర్థులు విశ్లేషణాత్మక ప్రిపరేషన్‌ను కొనసాగించాలి. ఎన్‌సీఈఆర్‌టీ 10, 11, 12 తరగతుల పుస్తకాలు; సర్టిఫికెట్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ- గో చెంగ్ లియాంగ్; ఇండియన్ ఇయర్‌బుక్‌లోని అగ్రికల్చర్, ట్రాన్స్‌పోర్ట్, ఎన్విరాన్‌మెంట్ అంశాలు; ఎకనమిక్ సర్వే ప్రిపరేషన్‌కు తోడ్పడతాయి.
 
 పాలిటీ
 సివిల్స్ ప్రిలిమినరీలోని జనరల్ స్టడీస్ పేపర్‌లో పాలిటీ నుంచి దాదాపు 16-18 ప్రశ్నలు వస్తాయి. విస్తృత పఠనం, తార్కిక విశ్లేషణ, వర్తమాన రాజకీయ అంశాలను, సంఘటనలను రాజ్యాంగ పరంగా అన్వయించుకుంటూ చదివితే పాలిటీలో అధిక మార్కులు పొందొచ్చు. భారత రాజ్యాం గం, రాజకీయ వ్యవస్థ, పరిపాలన, పంచాయతీరాజ్ వ్యవస్థ, పబ్లిక్ పాలసీ, హక్కుల సమస్యలను సిలబస్‌లో పేర్కొన్నారు. వీటిని సమకాలీన అంశాలకు అన్వయించుకుంటూ ప్రిపరేషన్ కొనసాగించాలి. సాధారణంగా పరీక్షలో వస్తున్న ప్రశ్నలు విషయ పరిజ్ఞానానికి, విషయంపై అవగాహనకు, విషయ అనువర్తనకు సంబంధించినవై ఉంటున్నాయి. అభ్యర్థులు రాజ్యాంగ చరిత్ర- రాజ్యాంగ పరిషత్; కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు; స్థానిక స్వపరిపాలన; రాజ్యాంగ సంస్థలు; ప్రభుత్వ విధానాలు; హక్కుల సమస్యలు తదితర అంశాలను చదవాలి. ప్రిపరేషన్‌కు ఎన్‌సీఈఆర్‌టీ 10-12 తరగతి సివిక్స్ పుస్తకాలు; అవర్ పార్లమెంట్, అవర్ కాన్‌స్టిట్యూషన్, అవర్ జ్యుడీషియరీ- నేషనల్ బుక్ ట్రస్ట్; ఇంట్రడక్షన్ టు ది కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా- డి.డి.బసు పుస్తకాలు ఉపయోగపడతాయి.
 
 ఎకానమీ
 గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ఎకానమీ నుంచి 15-20 ప్రశ్నలు వస్తున్నాయి. ప్రిలిమ్స్‌కు ప్రిపరేషన్ కొనసాగిస్తున్న అభ్యర్థులు మెయిన్స్ జీఎస్ పేపర్లలోని ఎకానమీ సిలబస్ ను పరిశీలించి ఉమ్మడిగా అధ్యయనం సాగించాలి. ఉపాధి; ప్రణాళికలు, అభివృద్ధి; ద్రవ్యం-బ్యాంకింగ్; విదేశీ వాణి జ్యం; వ్యవసాయం; అవస్థాపనా సౌకర్యాలు; ప్రభుత్వ విత్తం; జనాభా, పేదరికం వంటి అంశాల నుంచి ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయి. 2013 పరీక్షలో ఎకానమీకి సంబంధించి అధిక ప్రశ్నలు కాన్సెప్టుల ఆధారంగా వచ్చాయి. అం దువల్ల కాన్సెప్టులపై శ్రద్ధ వహించాలి. దీనికోసం ఎన్‌సీఈఆర్‌టీ 6-12 తరగతుల సిలబస్‌ను అధ్యయనం చేయాలి. చదవాల్సిన అంశాలు: కమిటీలు- నివేదికలు; వ్యవసాయ రంగం; పారిశ్రామిక రంగం; సేవా రంగం; బ్యాంకింగ్; పన్నుల వ్యవస్థ; జాతీయాదాయం; యూఎన్‌డీపీ మానవాభివృద్ధి నివేదిక; 12వ ప్రణాళిక; విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు; ప్రపంచ వాణిజ్య సంస్థ; ఐఎంఎఫ్; ప్రపంచ బ్యాంకు; ద్రవ్యం- బ్యాంకింగ్; పేదరికం; సాంఘిక భద్రత; సుస్థిర అభివృద్ధి; ద్రవ్యోల్బణం వంటి అంశాలను చదవాలి.ఫరెన్స్: ఎన్‌సీఈఆర్‌టీ 6-12 తరగతి పుస్తకాలు; ఇండియా ఇయర్‌బుక్; ఇండియా ఎకనమిక్ సర్వే; ఇండియన్ ఎకానమీ- ఎస్‌కే మిశ్రా, పూరి.
 
 జనరల్ సైన్స్, టెక్నాలజీ
 జనరల్ సైన్‌‌స విభాగంలోని జీవశాస్త్రంపై పట్టు ఉంటేనే.. ఆవరణ శాస్త్రం (ఉఛిౌౌజడ) లోని అంశాలపై సమగ్ర అవగాహన పొందడం సాధ్యమవుతుంది. జనరల్ సైన్‌‌సలో జీవశాస్త్రం, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంశాలు ఉంటాయి. అదే సమయం లో టెక్నాలజీకి సంబంధించిన ప్రశ్నలను కూడా ఇస్తారు. అయితే వీటిని సమకాలీన దృక్పథంలో అడుగుతారనే విషయాన్ని గమనించాలి. జీవశాస్త్రంలో అభ్యర్థులు వృక్ష-జం తు వర్గీకరణ, వాటి లక్షణాలు, ప్రత్యేకతలపై దృష్టి సారించాలి. మానవ శరీర ధర్మశాస్త్రం, వ్యాధులు వంటి అంశాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. శరీర అవయవాల పనితీరు, వాటికి సంక్రమించే వ్యాధులపై ప్రశ్నలు వస్తాయి.
 
 భౌతికశాస్త్రంలో అన్వయంతో కూడిన (అప్లైడ్) అంశాలు ఎక్కువగా అడుగుతున్నారు. వివిధ భౌతిక ప్రక్రియల సూత్రాల ఆధారంగా పని చేస్తున్న యంత్రాలపై ప్రశ్నలు వస్తాయి. రసాయన శాస్త్రంలో అడిగే ప్రశ్నల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దైనందిన జీవితంలో మానవుడు ఉపయోగించే వివిధ రసాయనాలు, అదే విధంగా ప్లాస్టిక్, పాలిమర్‌‌స కాంపొజిట్స్‌కు సంబంధించిన సమాచారాన్ని తప్పనిసరిగా సేకరించాలి. వీటికి అదనంగా లోహ సంగ్రహణ శాస్త్రం, ఆవర్తన పట్టిక, డైమండ్, బంగారం, రంగురాళ్లు, రత్నాలు మొదలైన వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి.
 
 పేపర్-2 ఆప్టిట్యూడ్ టెస్ట్
 రెండో పేపర్‌లో ఎక్కువ వెయిటేజీ లభిస్తున్న విభాగాలు కాంప్రహెన్షన్, డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఇంగ్లిష్ వొకాబ్యులరీ, స్పీడ్ రీడింగ్, సమయస్ఫూర్తి వంటి లక్షణాలు అలవర్చుకోవాలి. వొకాబ్యులరీ, స్పీడ్ రీడింగ్ కోసం నిరంతరం ప్రామాణిక ఇంగ్లిష్ దినపత్రికలు, వాటిలో వ్యాసాలు, వాక్య నిర్మాణాలు, వినియోగించిన పదాలను గుర్తించాలి. కాంప్రెహెన్షన్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రెహెన్షన్‌కు సంబంధించి అడిగే ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే ప్రశ్నలోని కీలక పదాన్ని గుర్తించే నేర్పు సొంతం చేసుకోవాలి. దీనికి మార్గం నిరంతర ప్రాక్టీసే.
 
 అనలిటికల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్:
 ఇందులో ప్రధానంగా సిల్లాయిజమ్, స్టేట్‌మెంట్స్ అండ్ కన్‌క్లూజన్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు రావొచ్చు.
 
 డెసిషన్ మేకింగ్:
 ఏదో ఒక సందర్భం ఇచ్చి.. ఆ సందర్భంలో మనం తీసుకునే నిర్ణయాలపై ప్రశ్నలు వస్తాయి. ఇటువంటి ప్రశ్నలకు సమాధానం గుర్తించే సందర్భంలో న్యాయబద్ధంగా ఉన్న వాటికి ప్రాధాన్యతనివ్వాలి.
 
 బేసిక్ న్యూమరసీ అండ్ జనరల్ మెంటల్ ఎబిలిటీలో బేసిక్ న్యూమరసీ అంటే 10వ తరగతిలోపు గణిత శాస్త్రం లో ఉన్న అంశాలను నేర్చుకుంటే సరిపోతుంది. దీనికో సం ప్రాథమిక సంఖ్యావాదం, భాజనీయత సూత్రాలు, 35 వరకు వర్గాలు, 15 వరకు ఘనాలు, కాలం-దూరం, కాలం-పని, సరాసరి, నిష్పత్తి-అనుపాతం, శాతాలు, లాభం-నష్టం, భాగస్వామ్యం, సాధారణ వడ్డీ(బారు వడ్డీ), చక్రవడ్డీ వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
 
 డేటా ఇంటర్‌ప్రిటేషన్ నుంచి కనీసం రెండు లేదా మూడు ప్రశ్నలు రావచ్చు. ఈ విభాగం కోసం బ్యాంక్ పీఓ ప్రీవియస్ పేపర్లను ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. జనరల్ మెంటల్ ఎబిలిటీ అనేది అకాడమీ పుస్తకాల్లో లేని కొత్త అంశం. ఇందులో పజిల్స్ నుంచి ఎక్కువ శాతం ప్రశ్నలు వస్తున్నాయి. వీటితోపాటు రక్త సంబంధాలు, దిక్కులు, సీటింగ్ అరేంజ్‌మెంట్స్ మొదలగు అంశాలను నేర్చుకోవాలి. ఈ విభాగం కోసం ఆర్‌ఎస్ అగర్వాల్ రాసిన A Modern Approach to Verbal Reasoning పుస్తకం చదవాలి.
 
 విజయ సోపానాలు
 సివిల్స్ ప్రిలిమ్స్‌లో విజయం సాధించాలంటే పేపర్ 1, పేపర్ 2.. రెండింటికీ సమాన ప్రాధాన్యం ఇస్తూ ప్రిపరేషన్ కొనసాగించాలి. ఏదో ఒక పేపర్‌పై మాత్రమే ఎక్కువ లేదా తక్కువగా దృష్టిసారించడం మంచిది కాదు. ఇంజనీరింగ్/ మేనేజ్‌మెంట్ అకడమిక్ నేపథ్యం ఉన్న విద్యార్థులకు పేపర్-2 (ఆప్టిట్యూడ్ టెస్ట్) తేలికైనదని, అదే విధంగా ఆర్ట్స్ నేపథ్యం ఉన్న విద్యార్థులకు పేపర్-1 (జనరల్ స్టడీస్) తేలికనే అభిప్రాయం ఉంది. ఇలాంటి వాటిని విస్మరించాలి. అకడమిక్ నేపథ్యాన్ని పట్టించుకోకుండా ఔత్సాహికులు రెండు పేపర్లకూ సమాన ప్రాధాన్యం ఇచ్చి, పటిష్ట ప్రణాళికతో ప్రిపరేషన్ కొనసాగించాలి. పేపర్ 1కు సంబంధించి సిలబస్‌లో ఉన్న అన్ని అంశాలపైనా పట్టు సాధించేందుకు ప్రయత్నించాలి. ప్రాథమిక అంశాలను అర్థం చేసుకుంటూ చదవాలి. కాన్సెప్టులపై పూర్తిస్థాయి అవగాహన సంపాదించిన వారికి విజయం ఖాయం. ఇక పేపర్ 2లో మంచి మార్కులు చేజిక్కించుకునేందుకు ప్రాక్టీస్‌కు మించిన మేలైన సాధనం లేదు. రోజువారీ ప్రాక్టీస్ ద్వారా ఇందులోని అంశాలపై పట్టు సాధించవచ్చు. తొలిసారి పరీక్షకు హాజరవుతున్న వారు తప్పనిసరిగా గత మూడేళ్ల ప్రశ్నపత్రాలను పరిశీలించాలి. దీనివల్ల ప్రశ్నల స్వరూపం అర్థమవుతుంది. ప్రిపరేషన్ సమయంలో ఆత్మస్థైర్యం తొణికిసలాడాలి. నిలకడగా, కష్టపడి చదివితే ప్రిలిమ్స్‌లో విజయం తథ్యం!
 - జె.మేఘనాథరెడ్డి,
 ఐఏఎస్ ట్రెయినీ, ముస్సోరి.
 
 ముఖ్య తేదీలు
     దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: జూన్ 30, 2014.
     సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష తేదీ: ఆగస్టు 24, 2014.
     దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వెబ్‌సైట్:                      
]     www.upsconline.nic.in
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement