
న్యూఢిల్లీ: దేశాల మధ్య, దేశాల్లో అంతర్గతంగా ప్రజల మధ్య డిజిటల్ విభజనను తగ్గించడంపై మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. ప్రస్తుత తరుణంలో కనెక్టివిటీ, కమ్యూనికేషన్స్ అనేవి ప్రతి ఒక్కరికీ ప్రాథమిక హక్కులుగా మారాయని ఆయన ఆభిప్రాయపడ్డారు. ఖతర్ ఎకనమిక్ ఫోరంలో పాల్గొన్న సందర్భంగా అంబానీ ఈ విషయాలు తెలిపారు. ‘తిండి, బట్ట, నీడలాగానే కనెక్టివిటీ, కమ్యూనికేషన్స్ అనేవి ప్రతీ ఒక్కరికి ప్రాథమిక అవసరాలుగా, ప్రాథమిక హక్కులుగా మారాయి.
కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో 4జీ నెట్‌వర్క్ లేకపోతే భారత్‌లో పరిస్థితి ఎలా ఉండేదో ఊహించడం కూడా కష్టంగా ఉండేది. దేశాల మధ్య, దేశాల్లో అంతర్గతంగా ప్రజల మధ్య డిజిటల్ విభజనను తగ్గించాల్సిన అవసరం ఉంది‘ అని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత భారీ స్థాయి టీకాల కార్యక్రమం నిర్వహించేందుకు, పిల్లలు ఇంటి నుంచే విద్యాభ్యాసం చేసేందుకు, ఉద్యోగులు ఎక్కడి నుంచైనా విధులు నిర్వర్తించేందుకు డిజిటల్ మౌలిక సదుపాయాలే తోడ్పడ్డాయని అంబానీ వివరించారు. రాబోయే రోజుల్లో డిజిటల్, ఫిజికల్ (వైద్యపరంగా భౌతికమైన మౌలిక సదుపాయాలు) మేళవింపు సర్వసాధారణం కాగలదని ఆయన పేర్కొన్నారు.
వ్యాపారాలు పర్యావరణహితంగామారక తప్పదు..
పరిశుభ్రమైన ఇంధనాల వినియోగం ద్వారా వ్యాపార సంస్థలు పర్యావరణ అనుకూల విధానాలను పాటించడం మినహా ప్రస్తుతం మరో గత్యంతరం లేదని ముకేశ్ అంబానీ చెప్పారు. తమ సంస్థ కూడా ఈ దిశగా చర్యలు తీసుకుంటోందని ఆయన వివరించారు. కర్బన ఉద్గారాలను పూర్తిగా తగ్గించుకోవడంపై గ్రూప్‌లోని వివిధ విభాగాలు దృష్టి పెట్టాయని అంబానీ తెలిపారు. క్రూడాయిల్, సహజ వాయువు వినియోగం కొనసాగించినప్పటికీ.. కర్బన ఉద్గారాలను ఉపయోగకరమైన ఉత్పత్తులు, రసాయనాలుగా మార్చగలిగే కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకునేందుకు కట్టుబడి ఉన్నామని అంబానీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment