అసహనానికి చోటు లేదు
విశ్వవిద్యాలయాల్లో హింస కాదు చర్చ జరగాలి: ప్రణబ్
కొచ్చి: అసహనపరులకు భారత్‌లో చోటు ఉండకూడదని ప్రణబ్ ముఖర్జీ అన్నారు. పురాతన కాలం నుంచి మనదేశం స్వేచ్ఛాయుత ఆలోచనలు, భావప్రకటనకు నిలయమని పేర్కొన్నారు. ఆయన గురువారం ఇక్కడ కేఎస్ రాజమోని ఆరో స్మారక ప్రసంగం చేశారు. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు, అధ్యాపకులు అర్థవంత చర్చల్లో పాల్గొనాలి కానీ అశాంతిని రాజేసే వాతావరణాన్ని సృష్టించరాదని పిలుపునిచ్చారు. హింస, అశాంతి అనే సుడిగుండంలో విద్యార్థులు చిక్కుకోవడం విచారకరమని అన్నారు.
వర్సిటీల్లో స్వేచ్ఛాయుత ఆలోచన విధానాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఏబీవీపీ, ఏఐఎస్‌ఏ మద్దతుదారుల మధ్య ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఈ మధ్య జరిగిన గొడవలు, విద్యార్థిని గుర్మెహర్ కౌర్ ట్వీట్ల తరువాత భావ స్వేచ్ఛ, జాతీయవాదంపై వెల్లువెత్తిన చర్చల నేపథ్యంలో ప్రణబ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. మన విశ్వవిద్యాలయాలు భారత్‌ను జ్ఞాన సమాజం వైపు నడిపే వాహనాల లాంటివి అని అన్నారు.
దేవాలయాల్లాం టి వర్సిటీల్లో సృజన, స్వేచ్ఛాయుత ఆలోచనలు మార్మోగాలని అభిలషించారు. అసహనం, మహిళలపై దాడుల వంటివాటి పట్ల జాగ్రత్త వహించాలని హెచ్చరించారు. విరుద్ధ భావాలు ప్రకటించడం, చర్చలు జరగడం మన సమాజం విశిష్ట లక్షణమని చెప్పారు. ‘వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ అనేవి రాజ్యాంగం పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కులు’ అని ప్రణబ్ అన్నారు.