న్యూఢిల్లీ: బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించకపోతే ఇతరుల ప్రాథమిక హక్కులైన జీవించేహక్కు, ఆరోగ్య హక్కులను కాలరాసినట్టేనని సుప్రీంకోర్టు పేర్కొంది. కరోనా కట్టడికి కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలైన భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం తప్పనిసరిగా అందరూ పాటించాలని స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వారిని కోవిడ్ కేర్ సెంటర్లలో సేవలు చేయాలంటూ గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది.
జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ ఎస్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన బెంచ్ గుజరాత్ హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను విచారించింది. గుజరాత్ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గుజరాత్ హైకోర్టు ఉద్దేశం మంచిదే అయినప్పటికీ కోవిడ్ సెంటర్లలో సామాన్యులు సేవలు చేస్తే మరిన్ని కరోనా కేసులు పెరిగిపోతాయన్నారు. ఇందుకు ఏకీభవించిన సుప్రీం గుజరాత్ హైకోర్టు ఆదేశాలను నిలిపివేసింది.
దోషులుగా తేలిన వారిపై జీవితకాల నిషేధం వద్దు
దోషులుగా రుజువైన రాజకీయ నేతలు ఎన్నికల్లో పాల్గొనకుండా జీవిత కాలంపాటు నిషేధం విధించాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిల్‌ను కేంద్రం తిరస్కరించింది. ఎన్నికైన ప్రతినిధులు కూడా చట్టానికి లోబడే ఉంటారని తెలిపింది. ‘పిటిషనర్ కోరినట్లుగా ప్రజాప్రతినిధ్య చట్ట సవరణ సహేతుకంగా లేదు. అంతేకాదు, రాజ్యాంగ విరుద్ధం, తన వాదనను సమర్థనగా ఎటువంటి వాస్తవ అంశాలను చూపలేదు’ అని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment