జెండాతో కొత్త రాజకీయం | new politics with indian national flag | Sakshi
Sakshi News home page

జెండాతో కొత్త రాజకీయం

Published Tue, Feb 23 2016 8:09 AM | Last Updated on Fri, May 25 2018 6:35 PM

జెండాతో కొత్త రాజకీయం - Sakshi

జెండాతో కొత్త రాజకీయం

రెండో మాట
 జాతీయ పతాకాన్ని ఎప్పుడు, ఎక్కడ ఉపయోగించాలో గాంధీజీ చెప్పిన మాటలు కూడా మనకు పరగడుపైపోవడం విచారకరం: ‘నిర్మాణాత్మక కృషిలో ఉన్న సంస్థలు జాతీయ పతాకాన్ని ఎగురవేయరాదు. ముస్లింలు, హిందువుల మధ్య ఘర్షణకు ఈ పతాకావిష్కరణ కారణమయ్యే పక్షంలో ఈ జెండాను ఎగురవేయరాదు’ అన్నారాయన. అందుకే ఉభయ తారకంగా ముందు పార్టీ జెండాలో ఉన్న చరఖా స్థానంలో దేశ సమైక్యతా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అశోక చక్రాన్ని ఈ జెండా మధ్యలో ఉంచారని గ్రహించాలి.
 
 ‘ఈ దేశపౌరుడు తన ప్రాథమిక హక్కులకు ప్రమాదం ఏర్పడిందని దేశ ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు మేము అతను చెప్పేది విని తీరవలసిందే.... ఈ దేశంలో ఏవో అసాధారణమైన పరిణామాలు జరిగిపోతున్నాయి. ఇందులో సందేహం లేదు. ఈ సమస్యను మేం పరిశీలించి తీరుతాం.’ జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసినప్పుడు బెయిల్ కోసం కోర్టును అర్థిస్తూ పెట్టుకున్న పిటిషన్ వాదనకు వచ్చినప్పుడు గౌరవ న్యాయమూర్తులు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ అభయ్ మనోహర్ సప్రేల ధర్మాసనం చేసిన వ్యాఖ్య (19-2-16)

 ‘భిన్నాభిప్రాయాలని, ఆలోచనలని చర్చల ద్వారా గెలవడానికి బదులు రాజ్యాధికారాన్ని ప్రయోగిస్తున్నట్టు ప్రస్తుత సంక్షోభం స్పష్టం చేస్తోంది.’     -ప్రొఫెసర్ హర్బన్ ముఖియా

 జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) పరిణామాల నేపథ్యంలో సుప్రసిద్ధ వ్యంగ్య చిత్రకారుడు కేశవ్ ఆసక్తికరమైన చిత్రం (18-2-16) గీశాడు. అంతకు ముందు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పరిశోధక విద్యార్థి రోహిత్ ఆత్మహత్య, తరువాత కన్హయ్య కుమార్ అరెస్టు, వేధింపులకు నిరసనగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న విద్యార్థి, అధ్యాపక, ఆచార్యుల ఆందోళన సందర్భంగా జాతీయత, జాతీయవాదం ఒకరి గుత్తసొమ్మా అన్న ప్రశ్న వచ్చింది. ఆ పేరుతో కొందరిని వేధించి వారి మీద జాతి విద్రోహులనో, దేశ ద్రోహులనో ముద్ర వేయడం గురించి కూడా ప్రజా బాహుళ్యంలో చర్చ బయలుదేరింది. ఈ అంశం మీదే కేశవ్ వ్యంగ్య చిత్రాన్ని సంధించారు. ఇకపైన దేశపౌరులు దేశభక్తిని, ప్రభు విధేయతను చాటుకోవలసిన కొలబద్ద కేంద్ర హోంమంత్రి కార్యాలయం వద్ద నేషనలిజం-సెన్సార్‌బోర్డ్ అన్న మకుటంతో ఒక బోర్డును తగిలించాడు. దేశంలో కొన్ని విపరిణామాలను శ్రద్ధగా పరిశీలిస్తున్న అత్యున్నత న్యాయస్థానంలోని ధర్మాసనం ‘దేశంలో ఏదో జరుగుతున్నదంటూ’ వ్యాఖ్యానించిన ఒకరోజు ముందరే ఈ వ్యంగ్య చిత్రం వెలువడడం విశేషం.

 సరిగ్గా అదే సమయంలో దేశంలోని అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాలలోను ఇక నుంచి 207 అడుగుల ఎత్తున జాతీయ జెండా రెపరెపలాడుతూ ఉండాలని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ ఆధ్వర్యంలో సూరజ్‌కుంద్‌లో కొలువుతీరిన 42 కేంద్రీయ విశ్వ విద్యాలయాల వైస్ చాన్సలర్లు అలాగేనంటూ తీర్మానించారట. అప్పుడే అక్కడ జాతీయ జెండా ఒడ్డూపొడుగు గురించి కొంత గందరగోళం జరిగిందని వార్తలొచ్చాయి. దీని అపూర్వ లక్ష్యం ఏమై ఉంటుంది? దేశ విశ్వవిద్యాలయాలలో ప్రబలి పోతున్న జాతీయవాద వ్యతిరేక ప్రవాహానికి అడ్డుకట్ట వేయడానికి జాతీయ జెండాను రెపరెపలాడించడమే మార్గమని భావించారట.

 ఆ భాషే అప్రజాస్వామికం
 అనేక రంగాలలో (అభివృద్ధి పేరుతో, ఇండియాలోనే తయారీ పేరుతో ప్రైవేటు, ప్రభుత్వ రంగాలను కమ్ముకుంటూ వస్తున్న విదేశీ గుత్తపెట్టుబడులు మినహా) నైరాశ్య వాతావరణం నెలకొనడానికి దారితీసిన పరిణామాలను సమీక్షించుకుని అసంఖ్యాక బడుగు బలహీన వర్గాల ప్రయోజనాలను కాపాడే హేతుబద్ధమైన తిరుగులేని చర్యలను తీసుకోవడంలో యూపీఏతో పాటు ఏన్డీఏ పాలకులు కూడా వైఫల్యం చెందడానికి కారణాలను తెలుసుకుంటే రాజకీయ నిర్ణయాలు పక్కదారులు తొక్కడానికి ఆస్కారం ఉండదు. ఈ గుర్తింపు లేనందునే పాలకులు ఎవరికి వారు ‘నా ప్రభుత్వాన్ని అస్థిరం చేయడానికి’ ఎవరో కుట్ర పన్నుతున్నారని భావించి వలస పాలనావ శేషంగా సంక్రమించిన ‘రాజద్రోహ/ దేశద్రోహ’ నేర చట్టాలను ప్రజల మీద ప్రయోగించ చూడడం హాస్యాస్పదం కాదా?

‘రాజద్రోహ’ భాష ప్రజావ్యతిరేకం. లేదా దేశద్రోహ నేర భాష స్వార్థ పరిపాలనా ఫలితం. తాజాగా నరేంద్ర మోదీ ప్రభుత్వం మీద బహుముఖంగా వస్తున్న విమర్శలను ఆయన కుట్రగా భావిస్తున్నారు గానీ, ఆరెస్సెస్ ఛాయల నుంచి బయటపడనంతవరకు తనకు సుఖమూ, శాంతీ ఉండదని ఆయన ఆలస్యంగానైనా గుర్తిస్తే ఆయనకూ దేశానికీ కూడా మంచిది. నిజానికి సంఘ్‌పరివార్ అసహిష్ణుత హద్దులు దాటి ప్రొఫెసర్లు, చరిత్రకారులు,ప్రజాస్వామిక పక్షాల నాయకులను హత్య గావించే వరకు వ్యాపించడం తన పాలనకు శ్రేయస్కరం కాదని కూడా మోదీ తెలుసుకోవాలి.

 వ్యతిరేకించిన సావర్కర్
 నిజానికి విశ్వవిద్యాలయాలలో జాతీయ పతాకం ఎగురవేయడం ఎన్నాళ్ల నుంచో కొనసాగుతున్నది. ఇదేమీ కొత్తకాదు. అయినా జాతీయ జెండాను గౌరవించాలన్న స్పృహ పరివార్ వర్గానికి ఎప్పటి నుంచి కలిగింది? విశ్వవిద్యాలయాల మీద జాతీయ జెండా ఎగురవేయడం గురించి వైస్‌చాన్సలర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయంలో తప్పులేదు. ఇది ఆహ్వానించదగినది. కానీ ఇది కొత్త అంశం కాదు. ఈ జెండాను జూలై 22, 1957న భారత రాజ్యాంగ నిర్ణయ సభ ఆమోదిస్తూ, సభ్యులంతా లేచి నిలబడి ఏకగ్రీవంగా ఆ తీర్మానాన్ని గౌరవించారు. తరువాత మూడు రోజులకే హిందుత్వ సిద్ధాంతకర్త సావర్కర్ ఆ తీర్మానాన్ని వ్యతిరేకించి అవమానించడం చరిత్ర మరవదు. పైగా గాంధీజీని అవమానిస్తూ ఆయన ప్రకటన కూడా చేశారు. జాతీయ జెండాలోని తొలి చరఖాను తీసుకువెళ్లి ఏదైనా నూలు ఒడికే అసోసియేషన్‌కు ట్రేడ్‌మార్క్‌గా ఉపయోగించుకోండని సావర్కర్ హేళన చేశారు.

అనేక చర్చల తరువాత, బహుళ జాతుల, భాషల, వర్గాల, తెగల, ఆదివాసీల, సిక్కు, ముస్లిం, జొరాస్ట్రియన్, పార్సీ, బౌద్ధులు, జైనులు, క్రైస్తవులతో కూడిన భారతదేశాన్ని ఒక మహా సెక్యులర్ సమాజంగా భావించి నాడు స్థూలంగా త్రివర్ణ పతాకంగా ఆ జెండా అవతరించింది. ఆగస్టు 8, 1942న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించే ముందు గాంధీజీ ఏమన్నారో గమనించండి! ‘‘కత్తి వాదరమీద నమ్మకం ఉన్న డాక్టర్ బాలకృష్ణ శివరామ్‌మూంజే, సావర్కర్ వంటి హిందువులు, హైందవ పెత్తనం కింద ముస్లింలు అణిగి మణిగి ఉండేటట్టు చేయాలని కోరుకోవచ్చుగానీ, నేను మాత్రం ఈ వర్గానికి చెందినవాడను కాను. వారికి ప్రతినిధినీ కాను.  నేను జాతీయ కాంగ్రెస్‌కు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తాను’’ అని ప్రకటించారు. ‘‘ఎవరు ఏ మత దృక్పథానికి చెందినప్పటికీ భరతమాతకు ఉన్నది మాత్రం అవిభక్త హృదయమే. అవిభాజ్యమైన సమైక్య భావనేనని మరచిపోరాదు. నవభారత స్త్రీపురుషులంతా ఒక్కతాటి మీద నిలిచి ఈ జాతీయ జెండాకు వందనం చేయండి!’’ అన్నారు సరోజినీదేవి. కానీ హిందుత్వ ఛాంధసత్వానికి కట్టుబడిన సావర్కర్ ఈ జాతీయజెండాను ఎన్నటికీ ‘హిందుస్తాన్ జాతీయ పతాకంగా గుర్తించబోనని నేను స్పష్టం చేయదలిచాను’ (‘ది హిస్టారిక్ స్టేట్‌మెంట్’, సావర్కర్ ) అన్నారు.

మరి త్రివర్ణ పతాకం స్థానంలో ఏ జెండాను ఎంపిక చేసుకుందామని ప్రశ్నిస్తే, ‘కాషాయ పతాకం(భాగవ) మాత్రమే కావాలి’ అని అన్నారాయన. ఈ భాగవ జెండా మీద కుండలిని, కృపాణం ఉండాలి. మానవజాతి ఉనికిని చాటే పతాకంగా ఉండాలి. ఇది అఖండ హిందూధ్వజం ఈ హైందవం మరొక జెండాకు సెల్యూట్ కొట్టదు. అందులో ‘ఓం’ ఉండాలి అని కూడా అన్నారు సావర్కర్. ఆ కోరిక చిట్టా అంతటితో ఆగిపోలేదు. స్వస్తిక్ గుర్తు కూడా ఉండాలని ఆయన భావన. నాజీ హిట్లర్‌కు, అతని పార్టీకి కూడా ఇదే గుర్తు. వైదిక కాలం నుంచి మన హిందూ జాతి భావధారను ప్రతిబింబించే కుఠారం (కత్తి) కూడా ఉండాలి. ఇదీ పేగులు మెడలో వేసుకున్నట్టుగా సావర్కర్ ధోరణి.

అయితే గాంధీజీ హత్యలో నాథూరామ్ గాడ్సేతో పాటు తాను కూడా ముద్దాయిగా నమోదవుతున్న ఘడియలలోనే సావర్కర్ హిందూ మహాసభ జెండాతో పాటు ఎందుకైనా మంచిదని జాతీయ జెండాను కూడా హడావుడిగా పెట్టవలసి వచ్చిందని మరచిపోరాదు. అలా క్విట్ ఇండియా ఉద్యమాన్ని అణచడానికి బ్రిటిష్ వారికి పరోక్షంగా తోడ్పడిన వాళ్లలో కొన్ని హిందుత్వ శక్తులు కూడా ఉన్నాయనడానికి మరెవరోకాదు, హిందూ మహాసభ నాయకులలో ఒకరైన శ్యామాప్రసాద్ ముఖర్జీ రాసిన ‘లీవ్స్ ఫ్రం ఏ డైరీ’ పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. కర్ణుడి చావుకు అనేక కారణాలన్నట్టు ఏదో ఒక స్థాయిలో క్విట్ ఇండియా ఉద్యమం నీరసించడానికి తలా ఒక చేయి వేశారనడానికి నెహ్రూ అన్న మాటలే నిదర్శనం- ‘కాంగ్రెస్‌లో ఆది నుంచీ కొన్ని ఆరెస్సెస్ శక్తులు ఉంటూనే వచ్చాయి’.

 అశోక చక్రంతో సమాధానం
 జాతీయ జెండా రూపశిల్పిని అంతా కలసి వివాదంలోకి దించిన చరిత్ర కూడా ఉంది. కానీ జాతీయ పతాకాన్ని ఎప్పుడు, ఎక్కడ ఉపయోగించాలో గాంధీజీ చెప్పిన మాటలు కూడా మనకు పరగడుపైపోవడం విచారకరం: ‘నిర్మాణాత్మక కృషిలో ఉన్న సంస్థలు జాతీయ పతాకాన్ని ఎగురవేయరాదు. ముఖ్యంగా దేశంలోని ముస్లింలు, హిందువుల మధ్య ఘర్షణకు ఈ పతాకావిష్కరణ కారణమయ్యే పక్షంలో ఈ జెండాను ఎగురవేయరాదు’ అన్నారాయన. అందుకే ఉభయతారకంగా ఉండే విధంగా ముందు పార్టీ జెండాలో ఉన్న చరఖా స్థానంలో దేశ సమైక్యతా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని హిందువులు, ముస్లింలు సమంగా ప్రేమించే అశోక చక్రాన్ని ఈ జెండా మధ్యలో ఉంచారని గ్రహించాలి. అయితే కత్తిని ప్రేమించిన సావర్కర్ కూడా ధర్మచక్రాన్ని తానే ప్రతిష్టించానని అనడం విశేషమే. అలాగే ఆరెస్సెస్ తానులో ముక్క అయిన హిందూ మహాసభ తరఫున 1925-30 మధ్య ఆర్యజాతి సిద్ధాంతం ద్వారా యూదులను లక్షలుగా ఊచకోత కోయడానికి కారకులై నాజీ ఫాసిస్టు నాయకులైన ముస్సోలినీ, హిట్లర్‌తో డాక్టర్ మూంజీ మంతనాలు జరిపి ‘ఏకజాతి రక్త సంబంధాల’ను తవ్వి తీయడానికి ప్రయత్నించారు.

1925లో నాగ్‌పూర్‌లో ఆరెస్సెస్ ఒక పరిపూర్ణ శక్తిగా అవతరించిన తరువాత 1930లో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనాలన్న కారణంతో డాక్టర్ మూంజీ యూరప్ వెళ్లి ఫాసిస్టు ముస్సోలినీని కలసి వచ్చారు. ఏకరక్త/ ఏకజాతి ప్రాతిపదిక మీద సూడెటాన్‌ల్యాండ్‌ను దురాక్రమించిన హిట్లర్ చర్య సబబేనని రెండో ప్రపంచ యుద్ధానికి సంవత్సరం ముందే 1938లోనే సావర్కర్ కితాబిచ్చారు. అందుకే మౌఢ్యాన్ని, కుల ప్రాతిపదికలను ప్రతీఘాత శక్తులని చరిత్రకారులు వర్ణించి ఉంటారు.
 
 ఏబీకే ప్రసాద్
 సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in


http://img.sakshi.net/images/cms/2015-07/41437415774_Unknown.jpg

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement