సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగంలో పొందుపర్చిన ప్రాథమిక హక్కులే మానవ హక్కులని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దూరదృష్టితో రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లోనే ప్రాథమిక హక్కుల రూపంలో మానవ హక్కులను పొందుపర్చారని ఆయన చెప్పారు. చాలామందికి మానవ హక్కులంటే ఏమిటో అవగాహన తక్కువగా ఉందని, వ్యక్తిగత తగాదాలు, అధికారులు పనులు చేయకపోవడం, ఇతరత్రా సమస్యలతో కమిషన్‌కు పలువురు అర్జీలతో రావడం సబబుకాదని చెప్పారు. మానవ హక్కులపై అన్ని స్థాయిల్లోనూ అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తామన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్, ఎస్పీ ఆధ్వర్యంలో అధికారులతో సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు.
రాష్ట్ర మానవహక్కుల కమిషన్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణమూర్తి అధ్యక్షతన శనివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఆదిలాబాద్ జిల్లాలోని కుగ్రామంలో జన్మించిన తాను గ్రామపెద్దకు భయపడేవాడినని, అయితే తాను పదోతరగతి ఉత్తీర్ణుడైనప్పుడు ఆ గ్రామపెద్ద వచ్చి భుజం తట్టి తనను ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు. అందరూ ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకోవాలని జస్టిస్ చంద్రయ్య హితవు చెప్పారు. రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్, లోకాయుక్త 2 పదవులూ బీసీలకు ఇవ్వడంపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య సీఎం కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు.
జనాభా నిష్పత్తి ప్రకారం న్యాయమూర్తుల పోస్టులు భర్తీ చేసేలా స్వతంత్ర జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హక్కుల ఉల్లంఘనల కేసుల్లో కమిషన్ సత్వర న్యాయం అందించాలని తెలంగాణ జనస మితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కోరారు. మానవహక్కుల రక్షణకు కమిషన్ సుమో టోగా కేసుల్ని స్వీకరించి న్యాయం చేయాలని సభాధ్యక్షు డు సత్యనారాయణమూర్తి కోరారు. హక్కుల రక్ష ణకు కృషి చేస్తానని రాష్ట్ర మానవహక్కుల కమిషన్ నాన్ జ్యుడీషియల్ మెంబర్ మహ్మద్ ఇర్ఫాన్ మెయినుద్దీన్ చెప్పారు. అనంతరం జస్టిస్ చంద్రయ్యను కృష్ణయ్య, కోదండరాం సన్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment