మానవ హక్కుల కమిషన్ చైర్మన్, సభ్యుల పోస్టులు ఖాళీ
2023, 2024 సంవత్సరాల్లో పరిష్కారానికి నోచుకోని ఫిర్యాదులు
హైకోర్టులో పిల్ వేసినా భర్తీ కాని పోస్టులు
తాజాగా రెండు నెలల సమయం కోరిన రాష్ట్ర ప్రభుత్వం
మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్‌సీ) చైర్మన్, సభ్యులు పదవీ విరమణ పొందిన 3 నెలల్లోగా మళ్లీ కొత్త కమిషన్ నియామకం చేపట్టాలని సుప్రీంకోర్టు చెబుతోంది. కానీ రాష్ట్రంలో రెండేళ్లుగా ఆ ఊసే లేదు. కొత్త కమిషన్‌ను నియమించాలని రెండేళ్లుగా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరుగుతున్నా, ఇంతవరకు నియామకం చేపట్టలేదు.
రేపు, ఎల్లుండి అంటూ కాలయాపనతోనే ప్రభుత్వం నెట్టుకొస్తోంది. రాజ్యాంగ హక్కులు, ప్రాథమిక హక్కులు కాపాడే కమిషన్ నియామకంలో అలసత్వం సరికాదని ప్రజాస్వామ్యవాదులు అంటున్నారు. కొత్త కమిషన్ నియామక ప్రక్రియ కొనసాగుతోందని, రెండు నెలల్లో పూర్తి చేస్తామని హైకోర్టుకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. –సాక్షి, హైదరాబాద్
చైర్మన్, సభ్యుల ఎంపిక కమిటీలో ఎవరు ఉంటారంటే..
చైర్‌పర్సన్: ముఖ్యమంత్రి
సభ్యులు: శాసనసభ స్పీకర్,
శాసనమండలి చైర్మన్, హోంమంత్రి, రెండు సభల ప్రతిపక్ష నేతలు
అర్హతలు
చైర్మన్: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా జడ్జిగా పనిచేసినవారు అర్హులు.
జ్యుడీషియల్ సభ్యుడు: హైకోర్టులో జడ్జిగా లేదా జిల్లాజడ్జిగా ఏడేళ్లు పనిచేసి ఉండాలి.
నాన్–జ్యుడీషియల్ సభ్యుడు: మానవ హక్కులపై విశేష అనుభవం, పరిజ్ఞానం ఉండాలి.
కాలపరిమితి: చైర్మన్, సభ్యుల కాలపరిమితి మూడేళ్లు లేదా 70 ఏళ్ల వయసు వచ్చే వరకు ఏది ముందైతే అదే వర్తిస్తుంది. ఒకవేళ ఎవరైనా రాజీనామా చేస్తే గవర్నర్‌కు అందజేయాలి. వీరిని తొలగించే అధికారం కూడా గవర్నర్‌కే ఉంటుంది. చైర్మన్, సభ్యుల నియామకానికి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.
ప్రజల హక్కులను గౌరవించాలి
1993 మానవహక్కుల చట్టం ద్వారా ప్రతి రాష్ట్రానికి ఒక రాష్ట్ర కమిషన్ ఉండాలనేది రాష్ట్ర ప్రజల చట్టబద్ధ, రాజ్యాంగబద్ధ హక్కు. దీనిని గౌరవించి ప్రజల హక్కులకు కొంతైనా గ్యారంటీ ఇవ్వగలిగే కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకం వెంటనే పూర్తి చేయాలి. – చిక్కుడు ప్రభాకర్, హైకోర్టు న్యాయవాది
హెచ్‌ఆర్‌సీ ఏర్పాటు ఇలా...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మానవ హక్కుల కమిషన్ 1993లో ఏర్పాటైంది. చైర్మన్, జ్యుడీషియల్, నాన్–జ్యుడిషీయల్ సభ్యులిద్దరూ ఉంటారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ కమిషన్ ఏర్పాటు చేస్తూ 2019, నవంబర్‌లో ప్రభుత్వం జీఓ జారీ చేసింది. తెలంగాణ కమిషన్ తొలి చైర్మన్‌గా జస్టిస్ చంద్రయ్య, సభ్యులుగా ఆనందరావు నడిపల్లి(జ్యుడీషియల్), ఇర్ఫాన్ మొహినుద్దీన్(నాన్ జ్యుడీషియల్)ను ప్రభుత్వం నియమించింది. 2022తో వీరు పదవీ విరమణ పొందారు. అప్పటి నుంచి మానవ హక్కుల కమిషన్‌కు చైర్మన్, సభ్యుల నియామకం జరగలేదు. దీంతో గత రెండేళ్లలో ఒక్క కేసు కూడా విచారణకు నోచుకోలేదు.
విధులు
» మానవ హక్కులతోపాటు రాజ్యాంగ, ప్రాథమిక హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రధానవిధి.
» పేదలు, దళితులు, గిరిజనులు, మహిళలపై దాడులు లేదా వారి హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు ఫిర్యాదు ఆధారంగా లేదా సుమోటోగా విచారణ చేపట్టొచ్చు.
» రాష్ట్రంలోని ఏ అంశంలోనైనా హక్కులపై సమీక్ష జరిపి ప్రభుత్వానికి సూచనలు చేయవచ్చు.
» కమిషన్ విచారణ జరిపాక, ఆ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. నష్టపరిహారం, ఇతర చర్యలపై సూచనలు కూడా చేయవచ్చు. కమిషన్‌కు సివిల్ కోర్టుకు ఉండే అధికారాలుంటాయి.
ముఖ్యమైన వివరాలు..
» కోర్టులతో పోలిస్తే కేసుల పరిష్కారం వేగవంతంగా ఉంటుంది. బాధితులకయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ.
» చాలా దేశాల్లో హక్కుల కమిషన్లు అత్యంత కీలకంగా పనిచేస్తున్నాయి.
» రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి స్థాయి కంటే తక్కువ లేని అధికారిని రాష్ట్ర కమిషన్ కార్యదర్శిగా
నియమిస్తారు.
» ఫిర్యాదుదారు, బాధితులు, ఘటన వివరాలు, పరిహారం తదితర వివరాలతో తెలంగాణ మానవ హక్కుల కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయవచ్చు. బాధితులే కాదు.. వారి తరఫున ఇతరులు కూడా ఫిర్యాదు చేయవచ్చు.
» సెక్షన్ 30 ప్రకారం జిల్లా కోర్టులోని రెండవ అదనపు జిల్లాజడ్జి హెచ్‌ఆర్‌సీ కేసులు విచారించాలి. ప్రత్యేకంగా పీపీ కూడా ఉండాలి. అయితే, ఈ కేసులను ఏ చట్టం ప్రకారం విచారణ చేయాలనేదానిపై స్పష్టత లేదు.
ఇలా సంప్రదించవచ్చు
ఫోన్ నంబర్: 040–24601572
అడ్రస్: బ్లాక్–7, గృహకల్ప కాంప్లెక్స్, ఎంజే రోడ్, గాం«దీభవన్, నాంపల్లి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment