
లక్డీకాపూల్ : నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు అందుతున్న వైద్యసేవలపై తెలంగాణ రాష్ట్ర మానవహక్కుల కమిషన్ చైర్‌పర్సన్ జస్టిస్ చంద్రయ్య ఆరా తీశారు. బుధవారం ఆయన ఆకస్మికంగా నిమ్స్ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా నిమ్స్ ఎమర్జెన్సీ బ్లాక్‌లో చికిత్స పొందుతున్న పలువురు రోగులను పరామర్శించారు. ఆయా రోగుల సహయకులను సైతం విచారించి ఆస్పత్రిలో ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిని కూడా కలిశారు. అనంతరం నిమ్స్ సంచాలకులు ప్రొఫెసర్ కె. మనోహర్‌తో సమావేశమై ఆస్పత్రికి సంబంధించి పరిపాలనా వ్యవహారాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.