ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త కార్యాలయాన్ని తెలంగాణ నుంచి కర్నూలు నగరానికి మార్చారు. ఏడాది క్రితం ఏపీ మానవహక్కుల కమిషన్, లోకాయుక్తలను ఏర్పాటు చేశారు. మానవహక్కుల కమిషన్ ప్రారంభం నుంచీ కర్నూలులో కార్యకలాపాలు చేపట్టింది. అయితే లోకాయుక్తను మాత్రం భవనం, ఇతర సౌకర్యాల కొరత వల్ల... ఏడాదిపాటు తెలంగాణ లోకాయుక్త కార్యాలయంలోనే కొనసాగించి... చివరికి మార్చి 18న కర్నూలుకు మార్చారు.
లోకాయుక్త చట్టం ప్రకారం... ప్రభుత్వంలోని కిందిస్థాయి అటెండర్ నుంచి అత్యున్నత స్థాయి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకూ అన్ని స్థాయిల్లో జరిగే అవినీతిని ప్రశ్నిస్తూ పిటిషన్ వేయడానికి అవకాశం ఉంది. ఇలాగే... గ్రామస్థాయి ఎంపీటీసీలు, సర్పంచ్‌ల నుంచి ఇతర మండలస్థాయి ప్రజాప్రతినిధులు, జిల్లాస్థాయి ప్రజాప్రతి నిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అక్రమాల వరకూ ఆధారాలతో లోకాయుక్తలో పిటిషన్లు వేయ వచ్చు.
అయితే ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేస్తూ పిటిషన్లు వేయడానికి లోకాయుక్త చట్టం ఒప్పుకోదు. ఇది రాష్ట్ర స్థాయి చట్టం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1985–1986ల మధ్య మొదటి సారి లోకాయుక్తను ఏర్పాటు చేశారు. ఆనాటి లోకాయుక్త చట్టమే నేటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి.
లోకాయుక్త కార్యాలయంలో లభించే సంబంధిత ఫార్మాట్‌లో వివరాలు భర్తీ చేసి, ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు జతచేసి, విజ్ఞాపన పత్రాన్ని కూడా చేర్చి కేవలం రూ. 150 ఫీజు చెల్లించి అప్లికేషన్ సమర్పించాలి. ఈ అప్లికేషన్‌ను ఒక అడ్వకేట్‌తో సర్టిఫై చేయించాలి. లోకాయుక్తకు ఛైర్మన్‌గా పదవీ విరమణ పొందిన హైకోర్ట్ జడ్జీలను నియమిస్తున్నారు. రిజిస్ట్రార్లుగా జిల్లా జడ్జీలు పనిచేస్తు న్నారు. సివిల్, క్రిమినల్ కోర్టులకున్న అధికారాలన్నీ లోకాయుక్తకు ఉన్నాయి. లోకాయుక్తకు పిటీషన్లు పోస్టు ద్వారా కూడా పంపవచ్చు.
ప్రస్తుత లోకాయుక్త చిరునామా: ఏపీ లోకాయుక్త, 96/3/721241, సంతోష్ నగర్, మెయిన్‌రోడ్, మహేంద్ర షోరూమ్ పక్కన, కర్నూలు–518006.
– కె. ధనలక్ష్మి, సెక్రెటరీ, లీగల్ సర్వీసెస్ రైట్స్ ప్రొటెక్షన్
Comments
Please login to add a commentAdd a comment