చట్టంపై అవగాహన ఉన్నవారిని ఎన్నుకోవాలి
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీ చంద్రకుమార్
ఉయ్యూరు/విజయవాడ, న్యూస్‌లైన్: స్వాతంత్య్ర ఫలాలు అందించిన మహనీయుల స్ఫూర్తితో రాజ్యాంగంపై అవగాహన కలిగిన నాయకత్వాన్ని కోరుకుంటే చట్టాలు సమర్ధంగా అమలై వనరులన్నీ సమానంగా అందుతాయని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. చంద్రకుమార్ సూచించారు. రాజ్యాంగాన్ని ప్రతిఒక్కరూ తెలుసుకోవాలని చెప్పారు. జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కృష్ణాజిల్లా ఉయ్యూరులోని ఏజీ అండ్ ఎస్‌జీ సిద్ధార్థ కళాశాల ఆవరణలో ‘రాజ్యాంగం ఆదేశిక సూత్రాలు-ప్రభుత్వాలు’ అంశంపై గురువారం నిర్వహించిన సదస్సులో జస్టిస్ చంద్రకుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ‘‘మహానీయుల త్యాగాల ఫలితంగానే స్వాతంత్య్రం సిద్ధించింది. వారి ప్రతి రక్తపు బొట్టు, స్ఫూర్తితోనే రాజ్యాంగాన్ని రూపొందించారు. ప్రపంచ దేశాల్లో ఎన్నో రాజ్యాంగాలను, చట్టాలను అధ్యయనం చేసి భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. దేశవనరులను ప్రజలందరికీ సమానంగా పంపిణీ లక్ష్యంతో ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు పొందుపరిచారు. వీటన్నింటిపై ప్రతిఒక్కరికీ అవగాహన ఉండాలి.
రాజ్యాంగం, చట్టంపై అవగాహన కలిగిన వ్యక్తులనే ఎన్నుకుంటే చట్టాలు పూర్తిస్థాయిలో అమలై ప్రజలకు మేలు జరుగుతుంది. యువత ఆ దిశగా సంకల్పబలంతో ముందుకు సాగాలి’’ అని జస్టిస్ చంద్రకుమార్ ఉద్బోధిం చారు. సదస్సుకు ప్రముఖ కంటివైద్యులు పి.చంద్రశేఖర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జరిగిన ముఖాముఖిలో విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు న్యాయమూర్తి బదులిచ్చారు. విజయవాడ నలందా విద్యానికేతన్‌ను సందర్శించిన ఆయన అక్కడ కూడా విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. నిర్భ య చట్టం గురించి, రాజకీయాల్లో డబ్బు ప్రాధాన్యత, రిజర్వేషన్లు తదితర అంశాలపై సంధిం చిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.