సాటిమనిషిని మనిషిగా చూడని సందర్భాలెన్నో చూస్తూనే ఉన్నాం. మనల్ని కాపాడిన మానవ హక్కుల పరిరక్షణను మనమే కాలరాస్తున్నాం, హరించివేస్తున్నాం. 1948 డిసెంబర్‌లో ఐక్యరాజ్యసమితి విశ్వమానవ హక్కులను ప్రకటన చేసింది. దాని లక్ష్యం ప్రతి ఒక్కరూ ఏ విధమైన వివక్షకు గురవ్వకుండా ప్రశాంతంగా జీవించాలి. కానీ అలాంటి పరిస్థితులు ఇప్పుడున్నాయా అన్న సందేహం రాక తప్పదు. ఐక్యరాజ్యసమితి ప్రతిపాదించిన సుమారు 30 ప్రాథమిక హక్కులు ఉన్నప్పటికీ మనల్ని మనం కాపాడుకోలేకపోవడం బాధాకరం.
మానవ హక్కులు గురించి మాట్లాడుకోవడమే తప్ప ఉల్లంఘన జరిగే తీరు మాత్రం మారడం లేదు. నిరంతరం ఏదో ఒక వార్తతో ప్రతి ఒక్కరు ఉలికిపడుతున్నారు. కోర్టులు మాత్రం హెచ్చరిస్తూనే ఉన్నాయి. కానీ నివారణ మాత్రం కష్టతరమవుతోంది. మానవ హక్కులు, స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. భారతదేశంలో మానవ హక్కుల పరిరక్షణ చట్టాన్ని 1993 అక్టోబర్ 12న నాటి ప్రధాని పి.వి. నరసింహరావు మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసారు. నేటికి 18 రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లను మన దేశంలో ఏర్పాటు చేసాయి. (చదవండి: కనురెప్పే కాటేస్తే... కన్నుకేది రక్ష?)
1948 డిసెంబర్ 10న ఐక్యరాజ్య సమితి అన్ని దేశాల ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన, ఆదర్శవంతమైన ఒక ఉమ్మడి ప్రమాణంగా సార్వత్రిక మానవ హక్కుల ప్రకటనను రూపొందించింది. దీన్ని చారిత్రక అంశంగా పరిగణిస్తారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవంగా ప్రతి పౌరుడికి అవగాహన కల్పించడానికి ఆమోదించిన దినాన్ని వేడుకగా జరుపుకుంటున్నారు. ప్రతి ఏటా డిసెంబర్ 10న ఒక అంశాన్ని ప్రాతిపదికంగా తీసుకొని మానవ హక్కుల దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తుంది. గత సంవత్సరం కరోనా వైరస్ నేపథ్యంలో ‘బాగా కోలుకోండి... మానవ హక్కుల కోసం నిలబడండి’ అనే నినాదంతో జరుపుకున్నారు. (చదవండి: మహిళలు... కొంచెం ఎక్కువ సమానం)
– డాక్టర్ నెమలిపురి సత్యనారాయణ, అసిస్టెంట్ ప్రొఫెసర్
Comments
Please login to add a commentAdd a comment