ఆర్టికల్ 370 ఎత్తివేతను సుప్రింకోర్ట్ సమర్థించింది. జమ్ము–కశ్మీర్‌లకు రాష్ట్రహోదా ఇచ్చి ఎన్నికలు నిర్వహించమంది. మరోవైపు అక్కడ యువగళాలు మారుతున్న కశ్మీర్‌ను గానం చేస్తున్నాయి. 14 ఏళ్ల ర్యాపర్ హుమైరా జా విడుదల చేసిన పాట ‘బదల్తా కశ్మీర్’ మార్పును ఆహ్వానిస్తూ కొత్త ఆశను రేపుతోంది. హుమైరా జా పాటను భారత ప్రభుత్వం ఇన్‌స్టాలో షేర్ చేసింది.‘నేను ఇలాగే ముందుకెళ్తాను’ అంటున్న హుమైరా పరిచయం.
‘బద్‌లా జొ కశ్మీర్... బద్‌లా హై సారా దౌర్’ అని పాడుతోంది హుమైరా జా. ‘కశ్మీర్ మారుతోంది... కశ్మీర్ ధోరణి మారుతోంది... అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది’ అంటూ ఆమె పాడిన పాట ఇప్పుడు కశ్మీర్‌వాసులనే కాదు, దేశాభిమానులను కూడా ఆకర్షిస్తోంది. హుమైరా ఈ పాటను ఎం.సి.రా అనే మరో ర్యాపర్ కలిసి పాడింది. కశ్మీర్‌లో తాజా అభివృద్ధి పరిణామాలను పాటలో మిళితం చేస్తూ వీరు విడుదల చేసిన ‘బదల్తా కశ్మీర్’ పాట కశ్మీర్ భవిష్యత్తు మీద ఆశను కలిగిస్తోంది.
‘మా నానమ్మ, తాతయ్యల కాలంలో కశ్మీర్ ఎలా ఉండేది... (ఆర్టికల్ 370 ఎత్తేశాక) ఇప్పుడు ఎలా ఉందనేది నేను వారి మాటల్లో విన్నాను. నా కళ్లారా చూశాను. ఇక్కడ జరిగిన జి 20 సమ్మిట్, శ్రీనగర్‌ను స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్దడం, కొత్త టన్నెల్స్ ఏర్పాటు... ఇంతకుముందు చూడలేదు. మా ఊరు కంగన్ నుంచి శ్రీనగర్‌కు వెళ్లాలంటే గతంలో గంటన్నర పట్టేది. ఇప్పుడు గండర్‌బల్ దగ్గర బ్రిడ్జి కట్టాక ముప్పై నిమిషాల్లో వెళ్లిపొంతున్నాము. ఇదంతా మారుతున్న కశ్మీరే’ అంటుంది హుమైరా జా.తొమ్మిదో తరగతి చదువుతున్న హుమైరా అలవోకగా ర్యాప్ సాంగ్స్ రాసి పాడుతుంది. హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్ పదాలను టక్కున పట్టేట్టుగా వాడుతూ పాటలు రాసి పాడటం వల్ల గతంలోనే గుర్తింపు పొందినా ‘బదల్తా కశ్మీర్’ పాటతో ప్రపంచానికి తెలిసింది.
‘నేను రెండో క్లాస్‌లో ఉండగా యోయో హనీసింగ్ రాప్ ఆల్బమ్ విన్నాను. అది నాకు చాలా నచ్చింది. ఆ వయసులోనే అలా ర్యాప్ పాటలు ట్రై చేసేదాన్ని. అప్పుడే బజ్‌రంగి భాయ్‌జాన్ (2015) సినిమా షూటింగ్ మా ఏరియాలో జరిగితే అందులోని బాల నటి హర్షాలికి నేను బాడీ డబుల్ (డూప్)గా నటించాను. అలా నేను కూడా సినిమాల్లో నటించాలనుకున్నానుగానీ మా కశ్మీర్‌లో సినిమా పరిశ్రమ లేదు. అందుకని ర్యాపర్‌గా రాణించాలని నిశ్చయించుకున్నాను’ అంటుంది హుమైరా.
కశ్మీర్‌లో ప్రతి ఏటా జరిగే ‘ర్యాప్ బ్యాటిల్’ పొంటీల్లో పాల్గొని 2022, 2023 సంవత్సరాల్లో టైటిల్ గెలిచింది హుమైరా. ‘2022లో 15 మంది అబ్బాయిలు నాకు పొంటీగా వచ్చారు. నేను ఒక్కదాన్నే ఆడపిల్లను. నేనే గెలిచాను’ అంటుంది హుమైరా. ‘కశ్మీర్‌లో అమ్మాయిలు స్పోర్ట్స్‌లో, కళల్లో, చదువులో, ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. ఆ విషయాన్ని నా పాటలో చెప్పాను’ అందామె.
ఈ పాటలోనే మేల్ వాయిస్ ఇచ్చిన ఎం.సి.రా ‘ఇక్కడ ఇప్పుడు జీన్స్ ప్యాంట్ అమ్మాయిలు తొడుక్కుంటున్నారు. బట్టల్ని బట్టి వారిని జడ్జ్ చేసే రోజులు పొంయాయి’ అనే లైన్‌లు పాడాడు. హుమైరా, ఎం.సి.రా కలిసి ‘మై కశ్మీరి... మేరా దేశ్ హై హిందూస్తాన్’ అని పాటను ముగిస్తారు.
ఈ పాటలో హుమైరా ‘టెర్రరిస్టులకు ఇక్కడ చోటు లేదు. అనవసరంగా ఎవరి రక్తం పారడానికి వీల్లేదు’ అనే లైన్లు పాడింది. ‘నువ్వు చూపుతున్న అభివృద్ధి ఉత్తుత్తదే. అసలు వాస్తవం వేరే ఉంది అని కొందరంటున్నారుగా’ అని విలేకరులు ప్రశ్నిస్తే ‘అది వారి దృష్టికోణం. ఇది నా దృష్టికోణం’ అంటుంది హుమైరా.‘కొంతమంది నన్ను ట్రోల్ చేస్తున్నారు. నేను పట్టించుకోను. నేను ఇలాగే ముందుకెళతాను. నా వెనుక ఒక్కరు నిలబడినా చాలు’ అందామె.కశ్మీర్ వెనుక హుమైరా వెనుక ఇప్పుడు చాలామంది ఉన్నారు. కశ్మీర్ అభివృద్ధికి అందరూ ప్రయత్నిస్తే ‘నయా కశ్మీర్’ దగ్గరిలోనే సాధ్యమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment