న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దు చేసిన అనంతరం జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ యంత్రాంగం విధించిన ఆంక్షల విషయంలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. ఈ విషయంలో ఇప్పుడే జోక్యం చేసుకోవడం తొందరపాటే అవుతుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. అంతేకాకుండా కశ్మీర్ విషయంలో రోజువారీ అడ్మినిస్ట్రేటర్ పాత్రను పోషించడానికి తాను వ్యతిరేకమంటూ.. ఈ కేసులో తదుపరి వాదనలను రెండువారాలకు వాయిదా వేసింది.
ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూకశ్మీర్‌లో ప్రజల రాకపోకలు, కమ్యూనికేషన్స్‌పై ప్రభుత్వం విధించిన ఆంక్షలు, నిషేధాజ్ఞలను సవాల్ చేస్తూ తహసీన్ పూనావాల దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. జమ్మూకశ్మీర్ కర్ఫ్యూ, నిషేధాజ్ఞలు విధించారని, ఫోన్, ఇంటర్నెట్ సేవలు, న్యూస్ చానెళ్ల ప్రసారాలను నిలిపివేశారని పేర్కొంటూ తహసీన్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసులో ప్రభుత్వం, పిటిషనర్ తరఫు న్యాయవాదుల వాదనలు విన్న న్యాయస్థానం ఇది తీవ్రమైన అంశమని, కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు పునరుద్ధరించడం ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత అని పేర్కొంది. దీనికి అటార్నీ జనరల్ స్పందిస్తూ.. కశ్మీర్‌లోని పలు జిల్లాల్లో సాధారణ పరిస్థితులు ఏర్పడే పరిస్థితి ఉందని వివరించారు. న్యాయస్థానం స్పందిస్తూ.. ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి ముందు కొంత వేచిచూడాలని భావిస్తున్నట్టు తెలిపింది. కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు పునరుద్ధరించడానికి ప్రభుత్వం కొంత సహేతుకమైన సమయం ఇవ్వాల్సిన అవసరముందని, పరిస్థితుల్లో మార్పురాకపోతే అప్పుడు తాము నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. జమ్మూకశ్మీర్ విషయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కేంద్రానికి ఊరటనిచ్చేవి. ఆర్టికల్ 370 రద్దు, కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్మూకశ్మీర్ విభజన నేపథ్యంలో కశ్మీర్‌లో సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు కేంద్రం నిశితంగా చర్యలు తీసుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment