జమ్మూ–కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తినిచ్చే రాజ్యాంగంలోని 370వ అధికరణను రద్దు చేస్తూ రాష్ట్రపతి జారీచేసిన నోటిఫికేషన్ రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం సోమవారం వెలువరించిన తీర్పుపై సహజంగానే అటు హర్షామోదాలతోపాటు ఇటు అసంతృప్తి, అసమ్మతి కూడా వ్యక్తమయ్యాయి. సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ చరిత్రాత్మకమైనదిగా అభివర్ణించగా, కశ్మీర్‌కు చెందిన వివిధ పార్టీలు నిరాశ వ్యక్తంచేశాయి.
దశాబ్దాలుగా ఈ అధికరణ చుట్టూ సాగుతున్న వివాదానికి తాజా తీర్పు ముగింపు పలికింది. 370వ అధికరణ రద్దు సహా అన్ని విషయాల్లోనూ ధర్మాసనంలోని న్యాయమూర్తులందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌లు కలిసి ఒక తీర్పు వెలువరించగా దానితో ఏకీభవిస్తూనే జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలు రెండు వేర్వేరు తీర్పులిచ్చారు.
ప్రభుత్వాల విధాన నిర్ణయాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావటం సహజమే. కశ్మీర్ వంటి భావోద్వేగాలతో ముడిపడివుండే అంశంలో వీటి తీవ్రత కాస్త అధికంగానే ఉంటుంది. అందువల్లే సుప్రీంకోర్టు నిర్ణయం ఎలా ఉంటుందన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. కశ్మీర్‌లో ఉగ్రవాదం వేళ్లూన డానికీ, భద్రతాబలగాలపై దాడులకూ మూలం 370వ అధికరణలో ఉందన్నది జనసంఘ్‌గా ఉన్నప్పటి నుంచీ బీజేపీ నిశ్చితాభిప్రాయం.
దానికితోడు పాకిస్తాన్, చైనా సరిహద్దుల సమీపంలో ఉండటంవల్ల కశ్మీర్ ఘటనలు దేశ పౌరులందరినీ కలవరపరుస్తుంటాయి. అయితే అధికరణ రద్దుపై స్థాని కులు ఏమనుకుంటున్నారన్నది స్పష్టంగా తెలియదు. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగి పదేళ్లవుతోంది. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కశ్మీర్ ప్రాంతంలోని మూడు స్థానాలనూ నేషనల్ కాన్ఫరెన్స్ గెలుచుకోగా, జమ్మూ ప్రాంతంలోని మూడు స్థానాలు బీజేపీకి లభించాయి.
2019 ఆగస్టు 5న రాష్ట్ర పతి నోటిఫికేషన్ జారీకి నాలుగు రోజుల ముందు నుంచీ కశ్మీర్‌కు భద్రతా బలగాల తరలింపు, విద్యా సంస్థలకు సెలవులు, శ్రీనగర్‌లో నిరవధిక కర్ఫ్యూ, అమర్‌నాథ్ యాత్ర నిలుపుదల వంటి నిర్ణయాలు తీసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడే ముందు సైతం కశ్మీర్‌లో ప్రధాన పార్టీల నేతలంతా తమను గృహనిర్బంధం చేశారని ఆరోపించారు. ఇదంతా గమనిస్తే కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి అత్యంత సున్నితమైన సమస్య అని అర్థమవుతుంది.
జమ్మూ–కశ్మీర్ పాలకుడు హరిసింగ్ ఆ ప్రాంతాన్ని 1947లో భారత్‌లో విలీనం చేసినప్పుడి చ్చిన హామీకి అనుగుణంగా 1949లో రాజ్యాంగ నిర్ణాయక సభ 370వ అధికరణాన్ని రాజ్యాంగంలో చేర్చింది. ఆ అధికరణ ప్రకారం విదేశీ వ్యవహారాలు, ఆర్థికం, కమ్యూనికేషన్లు, రక్షణ మినహా ఇతర అంశాలు జమ్మూ–కశ్మీర్ అసెంబ్లీ ఆమోదిస్తే తప్ప ఆ రాష్ట్రంలో అమలు కావు. అయితే ఒకసారంటూ దేశంలో విలీనమయ్యాక ఇక ‘అంతర్గత సార్వభౌమత్వం’ అనేదే ఉండదని తాజా తీర్పుల్లో సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
370వ అధికరణ తాత్కాలిక స్వభావంతో కూడుకున్నదని... తాత్కాలిక, మధ్యంతర అధికరణలున్న రాజ్యాంగంలోని 21వ భాగంలో చేర్చటమే ఇందుకు నిదర్శమని జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం భాష్యం చెప్పగా... నెమ్మదిగా జమ్మూ– కశ్మీర్‌ను కూడా ఇతర రాష్ట్రాలతో సమానం చేయటమే దాని ఉద్దేశమని విడిగా ఇచ్చిన తీర్పులో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ అభిప్రాయపడ్డారు.
ఈ రెండు అభిప్రాయాలతోనూ విడిగా తీర్పునిచ్చిన మరో న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఏకీభవించారు. ఈ అధికరణ స్వభావం ఏమిటన్న అంశాన్ని 2016లో సుప్రీంకోర్టు పరిశీలించింది. అది తాత్కాలికమైనదన్న వాదనను అప్పట్లో తోసి పుచ్చింది. అందుకు అదే అధికరణలోని సబ్ క్లాజ్ 3ని ఉదాహరించింది. రాష్ట్ర రాజ్యాంగసభ సిఫా ర్సుతో రాష్ట్రపతి నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడే 370 రద్దవుతుందని ఆ క్లాజ్ సారాంశం. 1957 తర్వాత రాజ్యాంగసభ ఉనికిలో లేదు గనుక ఇక దాని రద్దు అసాధ్యమని అప్పట్లో సుప్రీంకోర్టు భావించింది.
అయితే రాజ్యాంగసభ రద్దుతో సబ్ క్లాజ్ 3 నిరర్థకమైపోయిందని, ఆ అధికారం రాష్ట్ర అసెంబ్లీకి దఖలు పడిందని తాజా తీర్పుల్లో న్యాయమూర్తులు భావించారు. రాష్ట్ర అసెంబ్లీ రద్దయింది గనుక గవర్నర్ సిఫార్సు సరిపోతుందని వారు అభిప్రాయపడ్డారు. కశ్మీర్‌లో ఎన్నికలు జరిపించాలని పిటిషనర్లు ఎవరూ కోరకపోయినా ఆ విషయాన్ని న్యాయమూర్తులు పరిగణనలోకి తీసు కున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 30లోగా ఆ ప్రక్రియ పూర్తి కావాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించారు. అంటే లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యాకే అక్కడ అసెంబ్లీ ఎన్నికలుంటాయి.
రాజ్యాంగ నిర్ణాయక సభలో కూలంకషంగా చర్చించిన తర్వాతే వివిధ అధికరణలు రాజ్యాంగంలో చేరాయి. ఆ అధికరణలు చేర్చటంలోని అంతర్గత ఉద్దేశాలను అర్థం చేసుకోవటానికి ఆ చర్చలు దోహదపడతాయి. అయితే దేశ కాలమాన పరిస్థితుల్లో వచ్చే మార్పులు న్యాయమూర్తుల దృక్పథా లను నిర్దేశిస్తాయి. ఆ అధికరణలకు కొత్త చేర్పులు తీసుకొస్తాయి. వాటి పరిధి విశాలమవుతుంది. లేదా వాటి రద్దు సబబే అనిపించవచ్చు.
ఏదేమైనా కేంద్రం ఈ నిర్ణయానికి ముందు అక్కడి ప్రజానీ కాన్ని, మాజీ సీఎంలు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ తదితరులను కూడా సంప్రదిస్తే బాగుండేది. వీరంతా భారత్‌లో కశ్మీర్ విడదీయరాని భాగమని దృఢంగా విశ్వసిస్తున్న వారు. వర్తమాన పరిస్థితుల్లో సత్వర నిర్ణయం అవసరమని కేంద్రం భావించివుండొచ్చు. ఇప్పటికైనా ఆ ప్రాంతప్రజల అపోహలు తొలగించే కృషి మొదలుకావాలి. కశ్మీర్ అభివృద్ధి సాకారం కావాలి.
సుదీర్ఘ వివాదానికి తెర
Published Tue, Dec 12 2023 12:34 AM | Last Updated on Tue, Dec 12 2023 8:45 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment