అఖండ భారతదేశ స్వప్నం నేడు సాకారమయ్యింది. 133 కోట్ల భారతీయులు సగర్వంగా తలెత్తుకు తిరిగేలా చేసింది భారత ప్రభుత్వం. స్వాతంత్య్రం సిద్ధించి ఏడు దశాబ్దాలైనా... నెరవేరని స్వప్నం నేడు సాకారమయ్యింది. కశ్మీర్‌ను భారత్ నుంచి వేరుచేసేందుకు జరుగుతున్న కుట్రలు, కుతంత్రాలకు చరమగీతం పాడుతూ మోదీ సర్కారు తీసుకున్న సాహసోపేత నిర్ణయం ఇప్పుడు దేశ ప్రజల గుండెల్లో మార్మోగుతోంది. మిగతా రాష్ట్రాల మాదిరిగా భారతదేశంలో జమ్మూ, కశ్మీర్ మారింది. ‘ఇద్దరు ప్రధానులు, రెండు రాజ్యాం గాలు... రెండు జెండాలు వద్దు’ అంటూ ప్రాణార్పణ చేసిన భారతదేశ ముద్దుబిడ్డ శ్యాం ప్రసాద్ ముఖర్జీ నినాదాన్ని నేడు మోదీ సర్కారు సుసాధ్యం చేసింది. భారత్ నుంచి కశ్మీర్‌ను విడదీస్తున్న ఆర్టికల్ 370, 35 అను రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం భారత ఖ్యాతిని హిమాలయాల ఎత్తుకు చేర్చింది.
పార్లమెంట్ సాక్షిగా కేంద్రం తీసుకొచ్చిన ఆర్టికల్ 370, 35 అ నిబంధనల రద్దు నిర్ణయాలపై దేశ మంతటా పౌరులు సంబరాలు జరుపుకుంటున్నారు. భారతదేశంలో కశ్మీర్ అంతర్భాగమన్న సందేశాన్ని నేడు కేంద్రం రుజువు చేసి చూపించిందన్న సంతో షం కోట్లాది ప్రజల్లో నెలకొంది. ఇలా దేశమంతా పండుగ జరుపుకుం టుంటే... కొన్ని పక్షాలు మాత్రం కుట్రపూరితంగా వేర్పాటువాదుల వాదనకు మద్దతు పలుకుతున్నాయి. దేశంలో కశ్మీర్ అంతర్భాగమని... ఒకటే దేశం... ఒకటే రాజ్యాంగమంటూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిపై నాడు శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఎలుగెత్తారు. పార్లమెంట్ సాక్షిగా నెహ్రూ కళ్లు తెరిపించే పనిచేశారు. తన అభ్యంతరాలను, సూచనలను పట్టించుకోకుండా నెహ్రూ ప్రభుత్వం నడుస్తున్న తీరుపై ఆందోళనను శ్యాంజీ ఉధృతం చేశారు.
26 జూన్ 1952న ఆర్టికల్ 370ను రద్దు చేయాలంటూ పార్లమెంట్ సాక్షిగా నిరసన తెలిపారు. దేశాన్ని ఇలా వేరుచేయడం సమంజసం కాదంటూ నినదించారు. కశ్మీర్ విషయంలో తీసుకున్న నిర్ణయాలను నిర్ద్వంద్వంగా ఖండిం చారు. కొందరు స్వార్థపరుల కోసం తీసుకొచ్చిన విధా నం చెల్లదంటూ కశ్మీర్‌లో పోరుబాట సాగించి అసువులు బాశారు. నాటి నుంచి నేటి వరకు మూడు తరాలు కశ్మీర్ కోసం దేశ ప్రజలు పన్నుల రూపంలో కట్టిన లక్షల కోట్ల రూపాయలను దిగమింగారు. పైపెచ్చు మత ప్రాతిపదికన జమ్మూ, కశ్మీర్‌లో మిగతా ప్రజలకు హక్కులు లేకుండా కాలరాశారు. రెండో తరగతి పౌరుల్లా చూసి వంచించారు.
అంబేడ్కర్ కలలుగన్న భారతావనిలో నిరుపేదలకు అందాల్సిన ఫలాలు దేశమంతా లభించినా... జమ్మూ, కశ్మీర్‌లో మాత్రం లభించలేదు. దేశవ్యాప్తంగా ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు రిజర్వేషన్ ఫలాలు అందినా... జమ్మూ, కశ్మీర్‌లో నివశిస్తున్న బడుగు బలహీన వర్గాలకు మాత్రం ఆ ఫలాలు దక్కలేదు.
రిజర్వేషన్లంటే ఏంటో కూడా తెలియని పరిస్థితి అక్కడి ప్రజలది. కేవలం కొందరికి మాత్రమే లబ్ధి చేకూరేలా తీసుకొచ్చిన ఆర్టికల్ 370తో కొన్ని వర్గాలు మాత్రమే ఆ ఫలాలను దక్కించుకున్నాయి. కేంద్రం తీసుకొచ్చిన తాజా నిర్ణయంతో ఇక ఒక దేశం ఒకటే రాజ్యాంగం పరిఢవిల్లుతుంది. ఏడు దశాబ్దాలుగా వేల మంది భారతీయులు దేశ రక్షణ కోసం అసువులుబాశారు. భరతమాత రక్షణలో సమిధలయ్యారు. భూలోక స్వర్గంగా ఉన్న కాశ్మీర్ తీవ్రవాదులకు స్వర్గధామంగా నిలిచింది. సాధారణ కశ్మీరీలు ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా మారి తీవ్రవాదానికి ఆకర్షితులవుతున్నారంటే అందుకు కారణం అక్కడ స్థానిక ప్రభుత్వాలు, కాంగ్రెస్ పార్టీ విధానాలే. కశ్మీర్ అనంతనాగ్ గుహల్లో కొలువైన పరమశివుడ్ని దర్శించుకోవాలన్నా ఇబ్బందే.
దేశంలోని ఆలయాన్ని దర్శించుకోవాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరి స్థితి. కశ్మీర్ పండితుల కులదైవమైన శారదా మాత... సరస్వతి దేవి ఆలయంలోకి వెళ్లాలంటే సాధ్యం కాదు. ఇందుకు కారణం అక్కడి పాలకులు. వారితోపాటు ఆర్టికల్ 370 మాత్రమే. తాజా నిర్ణయంతో భారతదేశం సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిందని చెప్పాల్సి ఉంటుంది. దేశం గురించి నిర్ణయం తీసుకోవాలంటే ధైర్యం కావాలి. అది మోదీకి సంపూర్ణంగా ఉందన్నారు హోం మంత్రి అమిత్ షా. కశ్మీర్ ఎప్పుడూ భూతల స్వర్గంగా ఉంటుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అక్షరసత్యాలవుతాయి. అధికారం కోసమో... మరెందుకో మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోలేదు. బీజేపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగానే తాజా నిర్ణయం తీసుకొంది. కశ్మీర్‌లో ఇకపై మూడు కుటుం బాల ఆధిపత్యం చెల్లదు. సామాన్యులే కశ్మీర్‌లో ఏలికలవుతారు. అధికారం చెలాయిస్తారు.
కశ్మీర్‌లో ఇక దేశమంతటా వర్తిస్తున్న విధానాలే అమలవుతాయ్. దేశంలో ఏ పారిశ్రామికవేత్త అయినా కశ్మీర్ వెళ్లి ఇక పరిశ్రమలు ప్రారంభించవచ్చు. తీవ్రవాదంతో కల్లోలంలా మారిన కశ్మీర్‌ను అభివృద్ధి పట్టాలెక్కించవచ్చు. అందుకు ప్రధాని మోదీ– అమిత్ షా జోడీ నవ శకాన్ని ఆవిష్కరించింది. భారతదేశ ఔన్యత్యాన్ని హిమాలయాల ఎత్తు ఎగిరేలా చేసిన ధీరుడిగా ప్రధాని మోదీ నిలిచి పోతారు. కులాలకు మతాలకు అతీతంగా భారతీయులందరూ ఉప్పొంగే సందర్భమిది.
వ్యాసకర్త : పురిఘళ్ల రఘురామ్, బీజేపీ సమన్వయకర్త
ఈ–మెయిల్ : raghuram.bjp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment