ఒక కశ్మీర్‌... రెండు సందర్భాలు | Guest Column By Vardelli Murali On Kashmir | Sakshi
Sakshi News home page

ఒక కశ్మీర్‌... రెండు సందర్భాలు

Published Sun, Aug 11 2019 12:40 AM | Last Updated on Sun, Aug 11 2019 12:41 AM

Guest Column By Vardelli Murali On Kashmir - Sakshi

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంలో చెప్పే కథను అనేక మార్లు విని ఉన్నప్పటికీ వ్రతం చేసిన ప్రతిసారి విని తీరాలన్న నియమం ఉంది. అలాగే ఒక సందర్భాన్ని విశ్లేషించడానికి ముందు దాని పూర్వరంగాన్ని ప్రస్తా వించడం కూడా ఒక వ్రత నియమం లాంటిదే. ‘దేజావూ’ అనే ఒకరకమైన భ్రాంతికి లోనుకాకుండా ఉండేందుకు ‘కట్టె–కొట్టె–తెచ్చే’ అనే సిద్ధాంతాన్ని అను సరించి కశ్మీర్‌ భౌగోళిక, చారిత్రక అంశాలను రేఖా మాత్రంగా గుర్తు చేసుకుందాము. భారతదేశ చిత్ర పటంలో మకుటాయమానంగా కనిపించే ప్రాంతమే జమ్మూ–కశ్మీర్‌. ఇందులో దాదాపుగా సగం ప్రదేశం పాకిస్తాన్, చైనాల ఆక్రమణలో ఉంది. వారి ఆక్రమణను భారత దేశం అధికారికంగా గుర్తించదు కనుక మనం ముద్రించే పటాల్లో మొత్తం జమ్మూ–కశ్మీర్‌ మన దేశంగానే కనిపిస్తుంది. ఈ రాష్ట్రాన్ని నిలువునా తూర్పు– పడమరలుగా విభజిస్తే తూర్పు ప్రాంతమంతా లదాఖ్‌. దీనికి తూర్పున టిబెట్‌ ఉంటుంది.

లదాఖ్‌ పైభాగంలో ఉండే సియాచిన్‌ ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకుంది. పడమటి ప్రాంతంలో కొమ్ములాగా వాయువ్యం వైపు విస్తరించిన ప్రాంతమంతా గిల్గిట్‌–బాల్టిస్తాన్‌. కారా కోరం, పామిర్, హిందూకుశ్‌ పర్వత శ్రేణులు విస్తరిం చిన ప్రాంతం. గిల్గిట్‌కు దక్షిణంగా ఉన్న లోయ కశ్మీర్‌. దానికి దిగువన ఉండే ప్రాంతం జమ్మూ. గిల్గిట్‌లోనూ, కశ్మీర్‌లోనూ ఉన్నది ప్రధానంగా ముస్లిం మతస్తులే అయినా, వారి మధ్యన చాలా తేడాలున్నాయి. భాషా పరంగా, సాంస్కృతిక పరంగా ఏ మాత్రం సాపత్యం కుదరని భిన్న జాతులు అవి. గిల్గిట్‌–బాల్టిస్తాన్‌లోని తుర్కీ ఛాయలున్న గిరిజన తెగల వారు సెంట్రల్‌ ఏషియా దేశాల ఆచార వ్యవహారాలకు దగ్గరగా ఉంటారు.  బాల్టిస్తాన్‌ ఉత్తర దిక్కున ట్రాన్స్‌కారాకోరం జమీన్‌ను చైనాకు పాకిస్తాన్‌ కట్టబెట్టింది. దీనిని ‘షాక్స గమ్‌’ అని పిలుస్తారు. ఇక్కడ గమనించదగిన అత్యంత కీలక విషయం ఒకటి ఉంది. ప్రాచీన కాలం నుంచి భారతదేశానికి, సెంట్రల్‌ ఏషియా దేశాలకు మధ్య రహదారిలా ఉండిన కారాకోరం కనుమ మార్గం ఈ షాక్సగమ్‌ అధీనంలో ఉంటుంది.

వందల ఏళ్ల నాటి చైనా–యూరప్‌ సిల్క్‌రోడ్డు కూడా దీనికి చేరువలో ఉంటుంది. కశ్మీర్‌ ప్రజలు సహజంగా మర్యాదస్తులు. మతసహనం ఎక్కువగా ఉన్నవారు. శివాలయాలు ఎక్కువగా ఉన్న కశ్మీర్‌ లోయలో శైవం ప్రభావం కూడా ఎక్కువే ఉంది. బౌద్ధ ప్రబోధాలు, సూఫీ బోధనల ప్రభావం కూడా కశ్మీర్‌ ముస్లింలపై ఉంది. కశ్మీర్‌ ప్రజల సంస్కృతిని, జీవనవిధానాన్ని ‘కశ్మీరియత్‌’ అని పిలు స్తారు. కశ్మీరత్వం అనేది వారి ఆత్మ లాంటిది. పర్యాటక రంగం ఎక్కువ కనుక ఆతిథ్య స్వభావం వారి రక్తంలోనే ఉంది. కశ్మీర్‌ లోయకు దక్షిణ ప్రాంతమైన జమ్మూలో హిందువుల సంఖ్య అధికం. చైనా ఆక్రమించిన ఆక్సా యిచిన్‌ పోగా మిగిలిన లదాఖ్‌ రెండు భాగాలు.

కార్గిల్‌ డివిజన్‌లో ముస్లిం జనాభా ఎక్కువ. లేహ్‌ డివిజన్‌లో బౌద్ధులు ఎక్కువ. పలుచగా హిందువులు కూడా ఉంటారు. మొత్తంగా 40 శాతం బౌద్ధ మతస్తులున్న ఏకైక భౌగోళిక యూనిట్‌ దేశంలో లదాఖ్‌ మాత్రమే. వేరువేరు భాషలూ, సంస్కృతులూ, విభిన్నమైన భౌగో ళిక స్వరూపాలున్న ఈ ప్రాంతాలన్నీ కలిపి ఒక రాష్ట్రంగా ఎలా ఉన్నాయి? పంజాబ్‌ పాలకుడైన మహారాజా రంజిత్‌సింగ్‌ స్థాపించిన సువిశాల సిక్కు సామ్రా జ్యంలో ఒకప్పుడు ఇవన్నీ భాగంగా ఉండేవి. కశ్మీర్‌ ప్రాంతాన్ని డోగ్రా రాజవంశీకులు సామంతులుగా పాలించేవారు. తర్వాత కాలంలో ఆంగ్లేయులతో జరిగిన యుద్ధంలో సిక్కు సామ్రాజ్యం పతనమైంది. ఇంగ్లీషు వాళ్లకు అప్పటి కశ్మీర్‌ పాలకుడైన గులాబ్‌సింగ్‌ పెద్ద మొత్తంలో ముడు పులు సమర్పించుకుని, గిల్గిట్, లదాఖ్, జమ్మూ ప్రాంతా లను తన రాజ్యంలో కలిపే సుకున్నాడు. గులాబ్‌సింగ్‌ విశ్వాస పాత్రతను మెచ్చిన బ్రిటిష్‌ వాళ్లు ఒక స్వతంత్ర రాజ్యంగా జమ్మూ–కశ్మీర్‌ను కొనసాగనిచ్చారు. 

సందర్భం 1:
గులాబ్‌సింగ్‌ వారసుడే రాజాహరిసింగ్‌. దేశ విభజన నాటి జమ్మూ–కశ్మీర్‌ పాలకుడు. విభజన సమయంలో స్వతంత్ర రాజ్యంగానే జమ్మూ–కశ్మీర్‌ ఉండాలనేది రాజా హరిసింగ్‌ ఆకాంక్ష. ఏకకాలంలో అటు మహ్మదాలి జిన్నాతోను, ఇటు జవహర్‌లాల్‌ నెహ్రూతోనూ రాయ బారాలు నడిపాడు. అదే సమయంలో కశ్మీర్‌ను ఆక్ర మించుకోవడానికి పాక్‌ రంగంలోకి దిగింది. పఠాన్‌ లను, గిరిజన తెగలనూ రెచ్చగొట్టి యుద్ధంలోకి దిం చింది. ఈ క్రమంలో గిల్గిట్‌–బాల్టిస్తాన్‌ పూర్తిగా, కశ్మీర్‌ లోయ, జమ్మూలోని కొన్ని ప్రాంతాలు పాక్‌ అధీనంలోకి వచ్చాయి. ఈ సమయంలో రాజా హరి సింగ్‌ భారత సహకారాన్ని అర్థించడంతో భారతసైన్యం రంగంలోకి దిగింది. దీంతో ఇప్పుడున్న ఆధీనరేఖ (ఎల్‌వోసీ) ఆవలి వైపున పాక్‌ నిలిచిపోయింది. హరి సింగ్‌ భారత సాయాన్ని అర్థించినప్పుడే జమ్మూ– కశ్మీర్‌ను భారత్‌లో కలిపేందుకు సమ్మతించాడు. అందుకు అనుగుణంగా తన జమ్మూ–కశ్మీర్‌ రాజ్యాన్ని (గిల్గిట్‌–బాల్టిస్తాన్, లదాఖ్, జమ్మూలతో సహా) భార త్‌లో విలీనం చేస్తూ కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కొనసాగాలనే షరతును పెట్టాడు.

అప్పుడున్న పరిస్థితుల్లో ఆ షరతును అంగీ కరించడం మినహా నెహ్రూకు మరో ప్రత్యామ్నాయం కనిపించలేదు. ఎందుకంటే రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు ముస్లిం మతస్తులు. హరిసింగ్‌ నిర్ణయం పట్ల అప్పటికే నిరసనలు మొదలయ్యాయి. అవి మరింత పెరిగితే సమస్య జటిలమవుతుంది. రెండో విషయం, రాజా హరి సింగ్‌ రాష్ట్రం మొత్తాన్ని భారత్‌లో విలీనం చేసేలా సంతకం పెడుతున్నాడు. దీని ఆధారంగా ఐక్యరాజ్యస మితి జోక్యంతో పాక్‌ను దురాక్రమణదారుగా ప్రకటించి ఆక్రమిత ప్రాంతాల నుంచి తరిమివేయవచ్చని, అన్ని ప్రాంతాలూ భారత యూనియన్‌లో భాగంగా ఉంటా యని నెహ్రూ భావించాడు. ఆపై ఐక్యరాజ్యసమితిలో ఫిర్యాదు కూడా చేశాడు. కాకపోతే ఆ ఫిర్యాదు ముందుకు కదల్లేదు. మూడో అంశం, బ్రిటిష్‌ కాలం లోనూ జమ్మూ–కశ్మీర్‌ స్వతంత్ర ప్రతిపత్తిని అనుభవిం చింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టు కుని షరతులకు నెహ్రూ సమ్మతించాడు. ఫలితంగా కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతి పత్తిని కల్పిస్తూ భారత రాజ్యాంగంలో 370వ అధికరణాన్ని చేర్చారు. ఈ అధికరణం ఆధారంగా కశ్మీర్‌ ప్రజల స్థానికతను నిర్వచిస్తూ తదనంతర కాలంలో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా 35ఎ అధికరణాన్ని చేర్చారు. 

సందర్భం 2:
రాజ్యాంగబద్ధమైన గౌరవాలను కశ్మీర్‌ ఎక్కువ కాలం అనుభవించలేకపోయింది. ప్రధానమంత్రి పదవి పోయి ముఖ్యమంత్రి పదవి మిగిలింది. పార్లమెంటు అసెం బ్లీగా మారిపోయింది. 370 అధికరణ కూడా నీరుగారి పోయింది. సంకేత ప్రాయంగా ఒక ప్రత్యేక జెండా, చెప్పుకోవడానికి ఓ రాజ్యాంగం మిగిలింది. కశ్మీర్‌ స్థాని కత నిర్వచనం కారణంగా మిగతా దేశ ఆర్థిక అభివృద్ధితో సమన్వయం కాలేక వెనుకబడిపోయింది. చివరకు షేక్‌ అబ్దుల్లా లాంటి జనాదరణ కలిగిన నాయ కుడిని జైల్లో పెట్టారు. క్రమంగా కశ్మీర్‌ విద్యావంతులు కొందరిలో ఒక అసంతృప్తి ఏర్పడింది. కశ్మీర్‌ స్వతంత్ర రాష్ట్రం కోసం జేకేఎల్‌ఎఫ్‌ లాంటి సంస్థలు పనిచేయడం ప్రారంభిం చాయి.

ప్రత్యక్ష యుద్ధాల్లో గెలవడం సాధ్యం కాదని భావించిన పాక్‌ ఇదే అదనుగా ఉగ్రవాద మూక లకు శిక్షణ ఇచ్చి కశ్మీర్‌లో చిచ్చు పెట్టడం ప్రారంభిం చింది. అంతర్జాతీయంగా ఇస్లామిక్‌ టెర్రరిజం ప్రబలిన నేప థ్యం కూడా పాక్‌కు కలసి వచ్చింది. పెద్ద సంఖ్యలో యువకులను ప్రభావితం చేసి తన స్వార్థం కోసం మిషన్‌ కశ్మీర్‌ పేరుతో పంపించడంతో ఇక్కడ పరిస్థి తులు అదుపు తప్పాయి. మత సహనానికి మారుపేరైన కశ్మీర్‌ యువతరం మనసుల్లో కూడా విషబీజాలను నాటగలిగారు. ఉగ్రవాదాన్ని అణచివేసే నెపంతో భారత భద్రతా దళాలు వ్యవహరించిన తీరు కూడా కశ్మీర్‌ ముస్లిం ప్రజలకూ–భారత్‌కూ మధ్య దూరాన్ని పెంచింది. ఈ నేపథ్యంలో కశ్మీర్‌ వేరు, భారత్‌ వేరు అనే అభిప్రాయాలను తక్షణం దూరం చేయాల్సిన అవసరం ఉంది. కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమని నిర్ద్వంద్వంగా ప్రకటించి అభివృద్ధిలో వారిని భాగస్వాములను చేయా ల్సిన అవసరం ఏర్పడింది. కశ్మీర్‌ ప్రజల విశ్వాసాలను చూరగొని మళ్లీ ‘కశ్మీరియత్‌’ పునరుద్ధరించడం భార తీయ సమాజం బాధ్యత. లేకుంటే ఈ రావణ కాష్ట రగులుతూనే ఉంటుంది. 

ఈ 70 సంవత్సరాల కాలంలో ప్రపంచం రూపు రేఖలు చాలా మారిపోయాయి. అప్పటిలాగా వలస దోపిడీ నుంచి అప్పుడే విముక్తి పొందిన తరుణ స్వతంత్ర దేశం కాదు. భారత్‌ ఇప్పుడొక ప్రబల ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న దేశం. ఈ దేశంలోని 130 కోట్ల మంది జీవన ప్రమాణాలను పెంచుకోవాలన్నా, కోటా నుకోట్ల మంది నవతరం బిడ్డలకు ఉజ్వలమైన భవి ష్యత్తును నిర్మించాలన్నా ఒక గ్లోబల్‌ పవర్‌గా భారత్‌ ఎదగక తప్పదు. అలా ఎదగాలంటే ప్రపంచ వర్తక –  వాణిజ్యాలను, కనీసం దక్షిణాసియా ప్రాంతంలోనైనా శాసించగలిగే శక్తిని కూడదీసుకోవాలి. ఒకపక్క చైనా శరవేగంగా దూసుకొస్తున్నది. దక్షిణ చైనా సముద్రం నుంచి మలక్కా జలసంధి, బంగాళాఖాతం, అరేబియా సముద్రాల గుండా పర్షియన్‌ గల్ఫ్, ఎర్రసముద్రాలను దిగ్బంధం చేసే విధంగా ‘ముత్యాలదండ’ పేరుతో ఓడరేవుల సమీపంలో సైనిక స్థావరాలను ఏర్పాటు చేసే సన్నాహాల్లో చైనా ఉన్నట్టు వార్తలొస్తున్నాయి.

రాజా హరిసింగ్‌ విలీనం చేసిన ప్రకారం భారతదేశానికి చెందిన గిల్గిట్‌–బాల్టిస్తాన్‌లోని ట్రాన్స్‌కారాకోరం జమీ న్‌ను పాకిస్తాన్‌ చైనాకు అప్పగించింది. అక్కడి నుంచి గిల్గిట్‌–బాల్టిస్తాన్‌ గుండా పాకిస్తాన్‌ నైరుతి దిక్కున ఉన్న గ్వదర్‌ రేవు పట్టణం వరకు చైనా ఒక బ్రహ్మాండమైన కారాకోరం హైవేను నిర్మిస్తున్నది. గ్వదర్‌ రేవు పాక్‌ నైరుతి దిక్కున అరేబియా సముద్ర తీరంలో పర్షియన్‌ గల్ఫ్‌కు ముఖద్వారం లాగా ఉంటుంది. ఈ రేవును చైనాకు 40 ఏళ్ల కౌలుకు పాక్‌ అప్పగించింది. ఇకముందు పర్షియన్‌ గల్ఫ్‌ నుంచి చమురు మోసుకొచ్చే నౌకలకు చైనా చెక్‌పోస్టును సిద్ధం చేస్తున్న దృశ్యమిది. కశ్మీర్‌ సమస్యపై మూడో శక్తి ప్రమేయానికి భారత్‌  వ్యతిరేకం. కానీ, ఈ సమస్యతో ముడిపడి ఉన్న గిల్గిట్‌–బాల్టి స్తాన్‌లో దాదాపు 10 దేశాలు నిర్మాణ కార్యక్రమాలు సాగిస్తున్నాయి. పెట్టుబడులూ పెడుతున్నాయి. ఇందులో చైనాదే సింహభాగం. విలువైన ఖనిజ సంపదకు ఈ ప్రాంతం నిలయం.

హిమనీనదాల్లో అపారమైన జలసంపద నిక్షిప్తమై ఉంది. పర్వత ప్రాంతం కావడం వల్ల హైడల్‌ పవర్‌ ఉత్పత్తికి అను కూలం.  ఒక్కS సింధూ నది మీదనే ఈ ప్రాంతంలో 40 వేల మెగావాట్ల జల విద్యుత్‌ను ఉత్పత్తి చేయొచ్చట. భారతదేశంలో ఉన్న మొత్తం జలవిద్యుత్‌ ప్రాజెక్టుల స్థాపిత సామర్థ్యంతో ఇది దాదాపు సమానం. సింధూ ఉపనదుల మీద మరో 2 వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయొచ్చట. కారాకోరం హైవేపై ఇప్పుడు సరుకు రవాణా వాహనాలు తిరుగుతుండవచ్చు. రేపు చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ వాహనాలు కూడా ఈ రహదారిపై తిరిగే అవకాశం లేకపోలేదు. ఆక్రమిత కశ్మీర్‌లో జరుగుతున్న ఈ పరిణామాలను గట్టిగా ప్రశ్నించా లంటే, అడ్డుకోవాలంటే భారత అధీనంలోని భూభా గంపై భారత సార్వభౌమాధికారం పట్ల ఎటువంటి సందిగ్ధతకు తావుండరాదు. రెండు జెండాలు, రెండు రాజ్యాంగాలు చెల్లవు. మోదీ చర్య చారిత్రక అనివార్యం. బౌద్ధ ధర్మం ఆసియా ఖండం మొత్తంలో విస్తరించినా, పాపం... భారతదేశంలో మాత్రం ఒక్క స్థావరం కూడా మిగల్లేదు. 40 శాతం బౌద్ధ జనాభా గల ఏకైక ప్రాంతం లదాఖ్‌. కశ్మీర్‌ చరిత్రకూ, పరిణామాలకూ మౌనసాక్షిగా ఉన్న లదాఖ్‌ లిటిల్‌ బుద్ధా ఇప్పుడు నోరు విప్పి చెపుతున్నాడు. ‘అప్పుడు నెహ్రూ చేసింది తప్పేమీ కాదు. ఇప్పుడు మోదీ చేసింది కూడా తప్పేమీ కాదు.


     వర్ధెల్లి మురళి 
muralivardelli@yahoo.co.in

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement