జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్టికల్ 370, 35ఏ రద్దు చేస్తూ నరేంద్రమోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా జమ్మూ కశ్మీర్‌ను విభజించి జమ్మూ కశ్మీర్, లడఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించింది. లడఖ్ చట్టసభ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం రాజ్యసభలో స్పష్టం చేశారు. దీనికి ప్రకారం కశ్మీర్‌లో చోటు చేసుకోనున్న ప్రధాన పరిణామాలు ఇలా ఉండబోతున్నాయి.
- పార్లమెంటు సంబంధిత చట్టాన్ని ఆమోదించిన తర్వాత, జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటుంది. ఢిల్లీ, పుదుచ్చేరి మాదిరిగా అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా కొనసాగుతుంది.
- జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆధ్వర‍్వంలో పాలన ఉంటుంది. ఆయన హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సన్నిహితంగా ఉంటారు. పాలనా పరంగా లెఫ్టినెంట్ గవర్నర్‌దే అంతిమ అధికారం.
- జమ్మూ కశ్మీర్‌కి శాసనసభ ఉంటుంది. దీని ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. అలాగే ఢిల్లీ ప్రభుత్వం మాదిరిగా ఈ ప్రభుత్వానికి భూమిపైనా, పోలీసులపైనా అధికారం ఉండదు.
- జమ్మూ కశ్మీర్‌లో హోం శాఖ కీలక అధికారాలను కలిగి ఉంటుంది. ప్రతి అంశంపైనా, ఎక్కువ అధాకారాన్ని, నియంత్రణను కలిగి ఉంటుంది.
- ఇప్పటి వరకు, జమ్మూ కశ్మీర్‌లోని శాశ్వత నివాసితులకు మాత్రమే రాష్ట్రంలో ఆస్తి సొంతం చేసుకునే హక్కు ఉంది. శాశ్వత నివాసిగా ఎవరు అర్హత సాధిస్తారో నిర్ణయించే అధికారం జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం చేతిలో ఉంది. ఆర్టికల్ 35 ఎ ద్వారా ఈ అధికారాన్ని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వానికి కల్పించింది. దీనిని సోమవారం రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా రద్దు అయి సంగతి తెలిసిందే. దీంతో దేశ ప్రజలు ఎవరైనా జమ్మూ కశ్మీర్, లడఖ్‌లో ఆస్తి కొనుగోలు చేసే హక్కును కలిగి ఉంటారు. అక‍్కడ ఎవరైనా శాశ‍్వత నివాసాన్ని కూడా ఏర్పర్చుకోవచ్చు.
- కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్మూ కశ్మీర్ అవతరణకు హోం మంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ హక్కు అమల్లోకి రానుంది.
- లడఖ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉండవు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు ఓటు వేస్తారు.
- జమ్మూ కశ్మీర్‌కు నుంచి పూర్తిగా లడఖ్ వేరు కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు లడఖ్‌పై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించనుంది
- లడఖ్ డివిజన్‌లోని రెండు జిల్లాలు - లే , కార్గిల్ - ఇప్పటికే కొంత స్థాయి స్వయంప్రతిపత్తిని అనుభవిస్తున్నాయి. పాక్షికంగా అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్స్ పాలనలో ఉన్నాయి. ఈ పరిస్థితి ఇకముందు కూడా కొనసాగే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment