అజిత్ దోవల్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌కు, రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టిన ఆర్టికల్ 35(ఏ)పై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కశ్మీర్ ప్రత్యేక రాజ్యాంగం కారణంగా దేశ సార్వభౌమత్వాన్ని నీరుగార్చలేమని దోవల్ వ్యాఖ్యానించడంపై ఆ రాష్ట్ర పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీతోపాటు కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రభుత్వం దోవల్ వ్యాఖ్యలను ఖండించని పక్షంలో.. కేంద్రమే కావాలని ఈ వ్యాఖ్యలు చేయించినట్లుగా భావించాల్సి వస్తుందన్నాయి.
మంగళవారం సర్దార్ వల్లభాయ్ పటేల్‌పై రాసిన ఓ పుస్తకం విడుదల సందర్భంగా దోవల్ మాట్లాడుతూ.. ‘వల్లభాయ్ పటేల్ సంస్థానాలన్నింటినీ దేశంలో విలీనం చేయడంపై మాత్రమే దృష్టిపెట్టలేదు. సంస్థానాలతోపాటు దేశమంతా ఒకటిగా ఉండాలనే ఆలోచనతోనే ముందుకెళ్లారు. దేశంలో రాజ్యాంగం ప్రకారం ప్రజల సార్వభౌమత్వం దేశమంతటికీ వర్తిస్తుంది. కానీ జమ్మూకశ్మీర్ ప్రత్యేక రాజ్యాంగం కలిగి ఉండడం.. భారత రాజ్యాంగ స్ఫూర్తికి విభిన్నంగా ఉంది. స్వతంత్ర భారతమంతా ఒకే రాజ్యాంగం, ఒకే జెండా కింద ఉండాలని పటేల్ భావించారు. కానీ అప్పటి కశ్మీర్ రాజు మహారాజా హరిసింగ్ ఇందుకు విభేదించారు’ అని పేర్కొన్నారు. భారత స్వాతంత్య్ర పోరాటం చాలామటుకు అహింసాయుతంగా కొనసాగడం వల్ల సరైన వేడి రాజుకోలేదని.. అందుకే దేశ ప్రజలకు స్వాతంత్య్రం విలువ అర్థం కావడం లేదని దోవల్ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment