‘కశ్మీర్‌’పై ట్వీట్లు, స్వీట్లకే పరిమితమా!? | Amit Shah Just Snuffed Out Kashmir Statehood | Sakshi
Sakshi News home page

‘కశ్మీర్‌’పై ట్వీట్లు, స్వీట్లకే పరిమితమా!?

Published Thu, Aug 8 2019 3:03 PM | Last Updated on Thu, Aug 8 2019 3:03 PM

Amit Shah Just Snuffed Out Kashmir Statehood - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ డిమాండ్‌ చేయడం వల్ల దేశంలోని పలు కేంద్ర పాలిత ప్రాంతాలు రాష్ట్రాలుగా ఆవిర్భవిస్తూ వస్తాయి. కానీ ఓ ప్రత్యేక రాష్ట్రం కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోవడం 70 ఏళ్ల స్వతంత్య్ర భారత దేశంలో మొదటి సారిగా జరిగింది. ‘ఒకప్పటి కశ్మీర్‌ రాజ్యాంగ పరిషత్తే నేటి కశ్మీర్‌ అసెంబ్లీ. అక్కడి అసెంబ్లీ రద్దయి రాష్ట్రపతి పాలన కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర అసెంబ్లీ హక్కులన్నీ పార్లమెంట్‌కు సంక్రమిస్తాయి. కనుక కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న 370వ అధికరణను రద్దు చేసే బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశ పెడుతున్నాం’ అన్న వాదనతో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆ బిల్లును విజయవంతంగా గెలిపించుకున్నారు. అనూహ్యంగా పాలకపక్షాలతోపాటు కొంత మంది ప్రతిపక్ష సభ్యులు కూడా బిల్లుకు సానుకూలంగా ఓటేశారు.

ఇక ‘శాంతి, అభివృద్ధి, సంపద’లు కశ్మీర్‌కు ఒనగూడుతాయంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు. కష్టాలను అధిగమించడంతోపాటు కశ్మీర్‌ ప్రజలు చూపిన ధీరత్వానికి జోహార్లంటూ ప్రశంసించారు. కశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడాన్ని సోషల్‌ మీడియా వేనోళ్ల పొగిడింది. అదే సమయంలో కశ్మీర్‌లో భారతీయులెవరైనా ఇక చవగ్గా భూములు కొనుగోలు చేయవచ్చని, అందమైన దాల్‌ లేక్‌ ముందు అద్దాల మేడలు కట్టుకోవచ్చని, ఆపిల్‌ పండులాంటి కశ్మీర్‌ అమ్మాయిలను పెళ్లి చేసుకోవచ్చంటూ ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. అంటే అక్కడి భూముల కోసం, అమ్మాయిల కోసం కశ్మీర్‌ ప్రత్యేక ప్రత్తిని రద్దు చేశారా ? ‘ఇండియన్‌ యూనియన్‌ ఆఫ్‌ టెరిటరీస్‌’లో కశ్మీర్‌ ఇప్పుడు నిజంగా కలిసిందంటూ మరికొంత మంది నెటిజన్లు వ్యాఖ్యానించారు.

‘ఇండియన్‌ యూనియన్‌ ఆఫ్‌ టెరిటరీస్‌’ అంటే ఏమిటీ? ఒకప్పుడు స్వయం పాలిత ప్రాంతాల సమాహారంగా దీన్ని పేర్కొనేవారు. ఆ తర్వాత స్థానిక పాలిత ప్రాంతాల సమాహారంగా వ్యవహరిస్తూ వచ్చారు. దీన్నే ‘ఇండియన్‌ ఫెడరేషన్‌ (సమాఖ్య భారత్‌)’ అని కూడా వ్యవహరించారు. ‘ఇండియన్‌ ఫెడరేషన్‌లో చేరేందుకు వివిధ రాజ్యాలు, సంస్థానాలు అంగీకరించినంత మాత్రాన ఇది ఏర్పడలేదు. అమెరికా లేదా జర్మన్‌ తరహా సమాఖ్య రాష్ట్రాలుగా తమకు పాలనాపరమైన స్వేచ్ఛ ఉంటుందన్న ఉద్దేశంతోనే అవి ఫెడరేషన్‌లో కలిశాయి’ అని భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యల సారాంశాన్ని పరిగణలోకి తీసుకుంటే కశ్మీర్‌ విషయంలో జరిగిందీ వేరనేది అర్థం అవుతోంది. బ్రిటిష్‌ వలస పాలన గురించి మనకు బాగా తెలుసు. ఆ పాలనకు వ్యతరేకంగా పోరాడి స్వీయ పాలన తెచ్చుకున్నాం. ఇప్పుడు వలస పాలన ఆనవాళ్లు మనలోను కనిపించడం శోచనీయం.

ఇదంతా తాము కశ్మీర్‌ ప్రజల అభ్యున్నతికే చేస్తుమని మోదీ ప్రభుత్వం చెబుతున్నందున కశ్మీర్‌ను ఎలా అభివృద్ధి చేస్తారో ఓ మాస్టర్‌ ప్లాన్‌తో ముందుకు రావాలి. చిత్తశుద్ధితో దాన్ని అమలు చేసేందుకు కృషి చేయాలి. అది జరగకపోతే అక్కడి సస్యశ్యామలమైన భూములను రియల్‌ ఎస్టేట్‌ బకాసురులు మింగేయడం లేదా కశ్మీర్‌ మరింత కల్లోలిత ప్రాంతంగా మారే ప్రమాదం ఉంది. కశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తి రద్దుపై ట్వీట్లు, స్వీట్లు పంచుకుంటున్న సోషల్‌ మీడియా తనవంతు కర్తవ్యంగా కశ్మీర్‌ అభివృద్ధికి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement