ఆర్టికల్‌ 370 రద్దుకు వైఎస్సార్‌ సీపీ మద్దతు | YSR Congress Party Supports Centre On Revoke Article 370 | Sakshi
Sakshi News home page

జమ్మూ, కశ్మీర్ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లుకు మద్దతు

Published Mon, Aug 5 2019 2:14 PM | Last Updated on Mon, Aug 5 2019 2:45 PM

YSR Congress Party Supports Centre On Revoke Article 370 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆర్టికల్‌ 370 రద్దుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతు తెలిపింది. జమ్మూ, కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో  ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆర్టికల్‌ 370 రద్దు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతో పాటు, పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ దశాబ్దాలుగా దేశాన్ని పట్టి పీడిస్తున్న జమ్మూ, కాశ్మీర్ సమస్యకు పరిష్కారంగా ప్రవేశపెట్టిన కీలకమైన ఈ బిల్లుపై మాట్లాడే అవకాశం లభించడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు.

జమ్మూ, కాశ్మీర్‌ను ఆక్రమించేందుకు పాకిస్తాన్‌ సైన్యం ప్రయత్నించినపుడు భారత సైన్యం పాక్‌చొరబాటును తిప్పికొడుతూ దాదాపు 25 కిలోమీటర్లు పాక్‌భూభాగంలోకి చొచ్చుకుపోయిందని అన్నారు. ఆనాడు భారత సైన్యాన్ని వెనక్కి రప్పించి నెహ్రూ చారిత్రక తప్పిదం చేయలేదా అని ప్రధాన ప్రతిపక్షం  కాంగ్రెస్‌ను విజయసాయి రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఆర్టికల్‌ 370ని ప్రవేశపెట్టడం ద్వారా నెహ్రూ నాటి కాశ్మీర్‌ పాలకుల ఒత్తిడికి తలవంచబట్టే నేడు ఈ దుస్థితి దాపురించిందని అన్నారు. తాత్కాలికమైన ఈ ఆర్టికల్‌370ని కాంగ్రెస్‌ప్రభుత్వం రద్దు చేసి ఉంటే ఈరోజు దీనిపై చర్చించాల్సిన అవసరం ఉండేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

చదవండికశ్మీర్‌పై కేంద్రం సంచలన నిర్ణయం

ఒక ఒరలో రెండు కత్తులు ఏ విధంగా ఇమడనప్పుడు దేశంలో రెండు వేర్వేరు ప్రాంతాలు స్వతంత్రంగా ఎలా ఉండగలవని ప్రశ్నించారు. ఒక దేశంలో రెండు రాజ్యాంగాలు, రెండు వేర్వేరు పతాకాలు, ఇద్దరు వేర్వేరు ప్రధాన మంత్రులు  భారత దేశంలో తప్ప ప్రపంచంలో ఎక్కడా కనిపించవని అన్నారు. భారత జాతీయ పతాకాన్ని తగులబెడితే అది నేరం కాని ప్రాంతం దేశంలో అంతర్భాగం ఎలా అవుతుందని నిలదీశారు. ఇలాంటివి ఒక్క జమ్మూ, కాశ్మీర్‌లో మాత్రమే సాధ్యమవుతున్నాయని అన్నారు. కాశ్మీరీ యువతిని వివాహం చేసుకున్న పాకిస్తానీ భారతీయ పౌరుడు అవుతున్నాడు. అదే భారత దేశంలోని ఏ ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్న కాశ్మీరీ యువతిని ఆ రాష్ట్రంలో అంటరాని వ్యక్తి అవుతోందని అన్నారు. ఇది దారుణమైన లింగ వివక్ష కాదా అని ప్రశ్నించారు.

భారత దేశాన్ని ఒక దేశంగాను, ఒక సంఘటిత ప్రాంతంగాను, ఒక జాతిగాను చూడాలన్న ఆకాంక్షతో దేశ ప్రజలు 1947 నుంచి పోరాడుతూనే ఉన్నారు. దేశ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చడానికి ఈరోజు హోం మంత్రి అమిత్‌షా నడుం బిగించారు. సర్దార్‌ పటేల్‌విడిచి పెట్టిన కార్యాన్ని హోం మంత్రి  పూర్తి చేస్తున్నారు. కాంగ్రెస్‌పార్టీ, జవహర్‌లాల్‌నెహ్రూ చేసిన చారిత్రక తప్పిదాలను సరి చేసి 130 కోట్ల భారత ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చి అమిత్‌షా సబ్‌కా వికాస్‌ నినాదాన్ని ఆచరణలో పెట్టబోతున్నారని విజయసాయి రెడ్డి ప్రశంసించారు. ఈ చర్య దేశ పౌరుల మధ్య వివక్షను తొలగించి దేశ సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని మరింత పట్టిష్టం చేయగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. జమ్మూ, కాశ్మీర్‌శాంతి, సౌభాగ్యాలతో పురోగమిస్తుందని అన్నారు. ఇంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆయన అభినందనలు తెలిపారు.

కాగా ఆర్టికల్‌ 350 రద్దుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతో పాటు సమాజ్‌వాదీ, బీఎస్పీ, బీజేడీ, అన్నాడీఎంకే, ఆప్‌ మద్దతు తెలిపాయి. మరోవైపు కేంద్ర తీర్మానాన్ని కాంగ్రెస్‌, జేడీయూ, ఎండీఎంకే, డీఎంకే, పీడీపీ ఎన్సీపీ వ్యతిరేకించాయి. కాగా  జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సోమవారం రాజ్యసభలో ప్రకటన చేసిన విషయం విదితమే. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement