శ్రీనగర్: రాజ్యాంగంలో జమ్ముకశ్మీర్‌కు విశేషాధికారాలు అందజేస్తున్న ఆర్టికల్ 35 ఎ పై సోమవారం సుప్రీంకోర్టులో వాదనలు ప్రారంభం కానుండడంతో కేంద్ర ప్రభుత్వం లోయలో హై అలర్టు ప్రకటించింది. కశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు కల్పిస్తున్న ఈ అధికరణపై ఎన్నో ఏళ్లుగా చర్చ సాగుతోంది. తాజాగా సుప్రీంకోర్టు విచారణతో మరోసారి తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో ఇప్పటికే పుల్వామా ఉగ్రదాడితో ఉద్రిక్త వాతావరణం ఏర్పడగా.. సుప్రీం విచారణతో పరిస్థితులు మరింత విషమించకుండా ప్రభుత్వం వేర్పాటువాద నేతలను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. రాజ్యాంగంలోని 370 ఆర్టికల్ జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేకహోదాను కల్పిస్తోంది. కశ్మీర్ కల్లోలానికి ఓ రకంగా ఈ ఆర్టికల్ కూడా కారణమని కొంతమంది వాదన. తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ దేశానికి ఇచ్చిన మహా ప్రసాదమే ఆర్టికల్ 35ఎ అని చాలామంది జాతీయవాదలు అనేక సందర్భరాల్లో అభిప్రాయపడ్డారు.
ఏమిటీ ఆర్టికల్ 35ఎ..
జమ్ముకశ్మీర్ భారత్‌లో విలీనమయ్యే సమయంలో ఆ రాష్ట్ర ప్రజలకు మరింత విశ్వాసం కలిగించేందుకు వీలుగా 370 ఆర్టికల్‌ను భారత ప్రభుత్వం రాజ్యాంగంలో పొందుపరిచింది. దీని ప్రకారం రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, కమ్యూనికేషన్ రంగాలు తప్ప మిగతా రంగాలపై కేంద్రానికి అధికారం ఉండదు. పార్లమెంటు చట్టాలు చేసినా కశ్మీర్ అసెంబ్లీ వాటికి ఆమోదం తెలిపితేనే అవి అమల్లోకి వస్తాయి. జమ్ముకశ్మీర్ భారత్‌లో చేరిన అనంతరం ఇతరులు రాష్ట్రంలోకి ప్రవేశించకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్రప్రజలు డిమాండ్ చేశారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న కేంద్రప్రభుత్వం 1954లో ఆర్టికల్ 35 ఎ ను రాజ్యాంగంలో చేర్చింది. మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ అనుమతితో రాజ్యాంగంలో పొందుపరిచారు. (మేం భారతీయులం కామా?)
తొలి నుంచి ఆర్టికల్‌పై వివాదమే...
ఈ ఆర్టికల్ ద్వారా రాష్ట్రంలో ఎవరు శాశ్వతపౌరులన్నది జమ్ముకశ్మీర్ అసెంబ్లీ నిర్ణయిస్తుంది. వాస్తవానికి రాజ్యాంగంలో ఆర్టికల్స్‌కు అనుబంధాన్ని చేర్చే సమయంలో పార్లమెంటు రాజ్యాంగ సవరణ చేయాల్సివుంటుంది. అయితే దీనికి భిన్నంగా మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పదవీకాలంలో రాష్ట్రపతి ఆదేశాలకు అనుగుణంగా రాజ్యాంగంలో చేర్చారు. దీంతో అప్పటి నుంచి ఈ ఆర్టికల్‌పై వివాదం రగులుతూనే ఉంది. రాష్ట్ర పరిధిలో అంశాల్లో ప్రభుత్వానికి అన్ని అధికారాలు ఉంటాయి. ప్రభుత్వ నిర్ణయాలను సవాల్ చేసే అవకాశం ఎవ్వరికీ లేదు. అయితే పార్లమెంటు ఆమోదం లేకుండా ఆర్టికల్‌ను చేర్చడంపై కొన్నిఎన్జీవోలు సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశాయి. వీటి వాదన ప్రకారం ఆర్టికల్ 370 కేవలం తాత్కాలికమేనని దీని ద్వారా మరిన్ని ఆర్టికల్స్‌ను ప్రవేశపెట్టడంపై అభ్యంతరం వ్యక్తంచేశాయి. కశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు ఇవ్వడం రాజ్యాంగంలోని 14, 19, 21 ఆర్టికల్స్ ప్రకారం వ్యతిరేకమేనని ఎన్జీవోల వాదన. (ఆర్టికల్ 370 జమ్మూకశ్మీర్‌కు అవసరమా?)
ఈ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రానికి చెందిన మహిళ ఇతర రాష్ట్రాలకు చెందినవారిని వివాహం చేసుకుంటే వారికి రాష్ట్రంలో ఆస్తిహక్కు ఉండదు. రాష్ట్రంలో శాశ్వత నివాస హక్కును వారి పిల్లలకు జారీచేయరు. రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలకు, ప్రాథమిక హక్కులకు ఆర్టికల్ 35ఎ విరుద్ధంగా ఉండటంపై మానవహక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుండగా ఆర్టికల్ 35ఎ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్లను సోమవారం నుంచి సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఆర్టికల్ 370, 35ఎ చట్టబద్ధతపై విచారణ అనంతరం రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించనుంది. మరోవైపు ఆర్టికల్ 35ఎను తొలగిస్తారన్న చర్చ లోయలో జరుగుతోంది. ఉన్నపళంగా భారీగా బలగాలను కేంద్ర ప్రభుత్వం మోహరించడంతో తెర వెనుక ఏదో జరుగుతోందన్న అనుమానం కశ్మీరీ పౌరుల్లో వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment