![Conference leader Sajad Lone released from house detention - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2020/07/31/lone.jpg.webp?itok=pF3wWlhG)
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలువురు నేతలపై గృహ నిర్బంధం విధించిన విషయం తెలిసిందే. రానున్న ఆగస్ట్ 5తో ఆర్టికల్ 370ను రద్దు చేసి తొలి ఏడా పూర్తి చేసుకుంటున్న సందర్భంగా పలువురు నేతలను విడుదల చేస్తున్నారు. దీనిలో భాగంగానే పీపుల్స్ కాన్ఫరెన్స్ నేత, మాజీమంత్రి సజ్జద్ లోనేను శుక్రవారం గృహ నిర్బంధం నుంచి విముక్తి కల్పించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించారు. తన రాజకీయ జీవితంలో నిర్బంధం (జైలు) అనేది కొత్తేమీ కాదని, ఎన్నో కొత్త విషయాలను తెలుసున్నాని తెలిపారు. (ఒమర్ అబ్దుల్లా కీలక నిర్ణయం)
గత ఏడాది ఆగస్ట్‌లో సజ్జద్‌ను పోలీసుల కస్టడీలోకి తీసుకుగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసి గృహ నిర్బంధంలో ఉంచారు. కాగా కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లాలను ఇదివరకే విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే పీడీపీ అధ్యక్షురాలు సయ్యద్ ముఫ్తీ మహ్మద్‌ను మాత్రం ఇంకా నిర్బంధంలోనే ఉంచారు. ఆమెతో పాటు మరికొంతమంది కశ్మీర్ నేతలపై నిర్బంధం ఇంకా కొనసాగుతోంది. మరోవైపు కశ్మీర్ విభజనకు తొలి ఏడాది పూర్తి కావస్తున్న తరుణంలో ఈ ఏడాది కాలంలో చోటుచుకున్న అభివృద్ధిపై నివేదికను వెలువరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే దీనిపై ఏర్పాట్లును పూర్తి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment