కశ్మీరీలు చనిపోతున్నా.. పట్టించుకోరా! | Kashmir Man Went To Delhi For Medicine | Sakshi
Sakshi News home page

కశ్మీరీలు చనిపోతున్నా.. పట్టించుకోరా!

Published Sun, Aug 25 2019 9:10 AM | Last Updated on Sun, Aug 25 2019 1:46 PM

Kashmir Man Went To Delhi For Medicine - Sakshi

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం అక్కడి పరిస్థితులను తెలుసుకునేందుకు సగటు మానవుడు ఎంతో ఆసక్తి చూపుతున్నాడు. కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని కాంగ్రెస్‌తోపాటు పాటు విపక్ష పార్టీలు నెత్తీనోరు మొత్తుకుంటున్నాయి. దీనికి భిన్నంగా కశ్మీర్‌లో పరిస్థితులు అంతా సవ్యంగా ఉన్నాయని భారత ప్రభుత్వం, ఆర్మీ అధికారులు ఢంకా భజాయించి మరీ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితులను సమీక్షించేందుకు విపక్షాల బృందం శనివారం కశ్మీర్‌కు బయలుదేరింది. కానీ వారిని మాత్రం కశ్మీర్‌లో అడుగుకూడా పెట్టనీయలేదు. దీంతో కశ్మీర్‌లో ప్రస్తుతం ఏం జరుగుతోందో తెలుసుకోవాలనే ఉత్కంఠ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తన తల్లికి మెడిసిన్‌ కొనేందుకు కశ్మీర్‌ నుంచి ఢిల్లీకి వచ్చిన ఓ వ్యక్తి మీడియా ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేశారు. దీనిని బట్టి అక్కడి పరిస్థితులు ఏవిధంగా ఉన్నాయో అర్థంచేసుకోవచ్చు.

కశ్మీర్‌ టూ ఢిల్లీ..
‘‘బతుకుకు భరోసా కల్పిస్తామన్న భారత ప్రభుత్వమే మా బతుకులను చిదిమేస్తోంది. నా తల్లి డయాబెటిక్‌ బాధితురాలు. ప్రతి రోజు మందులు వాడటం తప్పనిసరి. కశ్మీర్‌లో ఆంక్షలు విధించినప్పటి నుంచి (ఆగస్ట్‌ 4) ఇక్కడ ముందులు లభించడంలేదు. ఓ రోజు మందులు పూర్తిగా అయిపోవడంతో కశ్మీర్‌ మొత్తం తిరిగాను. కానీ ఎక్కడా మందుల షాపులు లేవు. కొన్ని ఉన్నా.. వాటిలో సరైన మెడిసిన్‌ లభించడంలేదు. దీంతో ప్రభుత్వ అంబులెన్స్‌లో లిఫ్ట్‌ ద్వారా శ్రీనగర్‌ వెళ్లాను. అక్కడా ఇదే పరిస్థితి ఎదురైంది. నా తల్లి ఆరోగ్యం విషమించే స్థాయికి చేరింది. దీంతో శ్రీనగర్‌ నుంచి ఢిల్లీ వచ్చి మందులు తీసుకుని వెళ్లాను. దేవుడి దయ వల్ల నా తల్లికి అప్పటికీ బతికే ఉంది. నా వద్ద సరిపడ డబ్బులు ఉన్నాయి కనుక నేను ఢిల్లీ వరకు వెళ్లగలిగాను. మరి పేదవాడి పరిస్థితి ఏంటి?. లోయలో సరైన వసతులు, ఆసుపత్రులు లేక చాలా మంది చనిపోతున్నారు. కనీసం వైద్యులు కూడాలేరు. అత్యవసర పరిస్థితి ఎదరురైతే ప్రభుత్వ రవాణ వ్యవస్థ కూడా లేదు. వైద్య వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. దీంతో ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా ఆంక్షలను పూర్తిగా సండలించాలి’అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

కశ్మీర్‌లోని తాజా పరిస్థితులపై ఓ మెడికల్‌ షాప్‌ వ్యాపారి మాట్లాడుతూ.. ‘‘గత 20 రోజులుగా స్టాక్‌ రావట్లేదు. చాలామంది మందుల కోసం వచ్చి నిరాశగా వెనుదిరిగి వెళ్లిపోతున్నారు’’ అని అన్నారు. మరికొంత మంది మాత్రం ఇక్కడి పరిస్థితుల కారణంగా తమ కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారని, దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇదిలావుండగా.. కశ్మీర్‌లో పలుప్రాంతాల్లో రవాణా, టెలివ్యవస్థ అందుబాటులోకి వచ్చినప్పటికీ లోయలో మాత్రం పరిస్థితి మారనట్లు తెలుస్తోంది. తాజాగా కశ్మీర్‌కు వెళ్లిన విపక్షాల బృందాన్ని తిరిగి వెనక్కి పంపడంతో పరిస్థితులు దారుణంగా ఉన్నాయంటూ ఆ పార్టీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాతావరణం అంతా బాగుంటే ముఖ్య నేతలను  ఇంకా నిర్భందంలో ఎందుకు ఉంచుతున్నారని కశ్మీర్‌ మాజీ సీఎం గులాబ్‌నబీ అజాద్‌ ప్రశ్నిస్తున్నారు.

సుప్రీంకోర్టులో పీసీఐ పిటిషన్‌..
జమ్మూకశ్మీర్‌లో సమాచార వ్యవస్థపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని కశ్మీర్‌ టైమ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ అనురాధ భాసిన్‌ వేసిన పిటిషన్‌ను పరిశీలించాల్సిందిగా ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా  సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. జర్నలిస్టులు తమ వృత్తిని నిర్వహించేందుకుగాను ఆంక్షలను ఎత్తివేయాల్సిందిగా ఆ పిటిషన్‌లో కోరారు. మీడి యా, దేశ సమగ్రత, సార్వభౌమాధికారం వాటిని దృష్టిలో ఉంచుకొనే ఆంక్షలు తొలగించేందుకు సహాయం చేయాలని పీసీఐ కోరింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement