
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో పరిస్థితి చాలా సున్నితమైందని, అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొనేలా కేంద్ర ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాల్సి ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆర్టికల్ 370 రద్దు అనంతరం కేంద్రం ఆ రాష్ట్రంపై విధించిన ఆంక్షలను తక్షణమే ఎత్తివేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను మంగళవారం విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఈ విషయమై కేంద్రానికి ఆదేశాలు జారీ చేసేందుకు నిరాకరించింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌పై పలు ఆంక్షలు విధించి, దూకుడుగా వ్యవహరించిందంటూ కాంగ్రెస్ నేత తెహ్‌సీన్ పూనావాలా దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా కేంద్రం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదనలు వినిపించారు.
‘రాష్ట్రంలో పరిస్థితులపై జిల్లాల మేజిస్ట్రేట్ల నుంచి ప్రభుత్వం రోజువారీ వాస్తవ నివేదికలను తీసుకుని సమీక్షిస్తోంది. తదనుగుణంగా ఆంక్షల సడలింపు చేపడుతోంది’అని తెలిపారు. ఇందుకు స్పందించిన ధర్మాసనం ‘కశ్మీర్ చాలా సున్నితమైన అంశం. అక్కడ రాత్రికి రాత్రే అద్భుతాలు జరిగిపోవు. ఆ రాష్ట్రంలో వాస్తవంగా ఏం జరుగుతోందో ఎవరికీ తెలియదు. కానీ, ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఒకవేళ ఏదైనా జరిగితే అందుకు కేంద్రానిదే బాధ్యత అవుతుంది. అందుకే సాధారణ పరిస్థితులు నెలకొన్నాక రెండు వారాల అనంతరం ఈ పిటిషన్‌ను విచారిస్తాం’అని తెలిపింది.
వాదనల సందర్భంగా పిటిషనర్‌పై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘రాష్ట్రంలో సమాచార, ప్రసార వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోయాయి. అక్కడ మోహరించిన సైనికులకు కూడా తమ కుటుంబసభ్యులతో ఫోన్ ద్వారా మాట్లాడే అవకాశం లేకుండా చేశారు’ అని పిటిషనర్ తరఫు న్యాయవాది మేనకా గురుస్వామి తెలపగా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలు కనీసం ఆస్పత్రులు, విద్యాసంస్థలు, పోలీస్‌స్టేషన్‌లకు కూడా వెళ్లేందుకు అవకాశం లేకుండాపోతోందని, వారి హక్కులకు భంగం కలుగు తోందంటూ న్యాయవాది గురుస్వామి పేర్కొనగా ఆధారాలుంటే చూపించాలని బెంచ్ కోరింది. ‘తీవ్రతను అర్థం చేసుకోకుండా, వాస ్తవాలు తెలియకుండా చాలా నిర్లక్ష్యంగా, ఆషామాషీగా ఈ పిటిషన్ వేసినట్లు కనిపిస్తోంది’ అని అంది.
Comments
Please login to add a commentAdd a comment