
కరాచీ: జమ్మూ కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయంపై పాకిస్తాన్ క్రికెట్ కెప్టెన్ సర్పరాజ్ అహ్మద్ స్పందించాడు. ఇది కశ్మీరీ సోదరులకు కష్ట కాలంగా సర్పరాజ్ అభివర్ణించాడు. ఈ ఆపద నుంచి గట్టెక్కించేందుకు కశ్మీరీలకు అల్లా సాయం చేయాలని తాను ప్రార్థించినట్లు తెలిపాడు. ‘ కశ్మీరీ సోదరులారా.. బాధను, కష్టాలను సమానంగా పంచుకుందాం. యావత్ పాకిస్తాన్ మీకు అండగా ఉంటుంది’ అని సర్పరాజ్ అహ్మద్ పేర్కొన్నాడు. కరాచీలో ఈద్ ప్రార్థనలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడిన సర్పరాజ్ ఆర్టికల్ 370 రద్దుపై పైవిధంగా స్పందించాడు.
అంతకుముందు పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది సైతం ఆర్టికల్ 370 రద్దుపై విమర్శలు గుప్పించాడు. ఐక్యరాజ్య సమితి తీర్మానానికి అనుగుణంగా కశ్మీరీ పౌరులకు కనీస హక్కులు దక్కడం లేదు. అసలు ఐరాసను ఎందుకు ఏర్పాటు చేశారు? ఇంత జరుగుతున్నా ఎందుకలా నిద్రపోతోంది. కశ్మీరీల హక్కుల ఉల్లంఘనపై ఐరాస ఎందుకు స్పందించట్లేదు. కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనను పరిగణలోకి తీసుకోవాలి’ అంటూ అఫ్రిది మండిపడ్డాడు.