సాక్షి, ఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా త్వరలో జమ్మూకశ్మీర్‌లో పర్యటించనున్నారు. కాశ్మీర్ లోయలో తాజా పరిస్థితుల నేపథ్యంలో హోంమంత్రి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ఉగ్రవాద ముప్పు నేపథ్యంలో ఇప్పటికే అమర్‌నాథ్ యాత్రికులు, పర్యాటకులను కశ్మీర్ నుంచి ప్రభుత్వం వెనక్కి పంపించింది. కాగా ఓవైపు భారీగా బలగాల మోహరింపు.. మరోవైపు కేంద్రం మౌనంతో జమ్మూకశ్మీర్‌లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా తయారైంది. జమ్మూకశ్మీర్‌లో శాశ్వతనివాసం, స్వయంప్రతిపత్తికి సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 35ఏ, ఆర్టికల్ 370లను కేంద్రం రద్దుచేయబోతోందన్న వదంతుల జోరందుకున్నాయి. దీంతో కశ్మీర్‌లో ఏం జరుగుతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఆర్మీ అధికారుల సెలవులను జమ్మూకశ్మీర్ ప్రభుత్వం రద్దు చేసింది. అలాగే అనుమతి లేకుండా సెలవులు తీసుకోరాదని ఆదేశించింది.
చదవండి: నివురుగప్పిన నిప్పులా జమ్మూకశ్మీర్!
భద్రతకు ఢోకా లేదు: కిషన్ రెడ్డి
మరోవైపు జమ్మూకశ్మీర్‌లో భద్రతకు ఎలాంటి ఢోకా లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆయన ఆదివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ అమర్‌నాథ్ యాత్రకు తీవ్రవాదుల నుంచి ముప్పు ఉందన్న ఇంటెలిజెన్స్ సూచన మేరకే జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. తాజా పరిణామాలపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. గత రాత్రి జమ్మూ నుంచి బయల్దేరిన 20మంది ఎన్‌ఐటీ తెలుగు విద్యార్థులు ఆదివారం మధ్యాహ్నానికి ఢిల్లీ చేరుకుంటారని, మిగిలిన 90మంది విద్యార్థులు ఇవాళ ఉదయం ప్రత్యేక రైలులో జమ్ము నుంచి ఢిల్లీకి బయల్దేరినట్లు తెలిపారు. జమ్మూ నుంచి విద్యార్థులు, పర్యాటకలు సురక్షితంగా స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్ర హోంశాఖ, స్థానిక ప్రభుత్వం రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
విజయవాడకు ఎన్‌ఐటీ విద్యార్థులు
23మంది ఎన్‌ఐటీ విద్యార్థులు జమ్మూ అండమాన్ ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడ బయల్దేరినట్లు ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. మరో 86మంది విద్యార్థులు జమ్మూ నుంచి ఢిల్లీ వస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీ నుంచి వారి స్వస్థలాలకు పంపేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ప్రవీణ్ ప్రకాష్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment