కశ్మీర్‌పై కిషన్‌రెడ్డి కీలక ప్రకటన | Survey In Kashmir For Open Temples And Schools Says Kishan Reddy | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌పై కిషన్‌రెడ్డి కీలక ప్రకటన

Published Mon, Sep 23 2019 4:53 PM | Last Updated on Mon, Sep 23 2019 5:12 PM

Survey In Kashmir For Open Temples And Schools Says Kishan Reddy - Sakshi

సాక్షి, బెంగళూరు: జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌  370 రద్దు అనంతరం అక్కడి ప్రాంత పునర్‌నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిలో భాగంగా కశ్మీర్‌ అభివృద్ధి కొరకు ప్రత్యేక ప్రణాళికను రచిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి సోమవారం వెల్లడించారు. ఈ మేరకు తొలుత ఏయే అంశాలపై దృష్టిసారించాలన్న దాని కొరకు కశ్మీర్‌ వ్యాప్తంగా ఓ బృందంతో సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. అయితే దీనిలో భాగంగా దశాబ్దాల కాలంగా మూతబడిపోయిన దేవాలయాలు, పాఠశాలలను పునరుద్దరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు కిషన్‌రెడ్డి ప్రకటించారు. తొలి విడతలో భాగంగా 50వేల దేవాలయాలు వీటిలో చోటుదక్కించుకున్నాయన్నారు. బెంగళూరు సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్రమంత్రి ఈ మేరకు వివరాలను వెల్లడించారు. గత పాలకులు, ఉగ్రవాదుల చర్యల కారణంగా కశ్మీర్‌ పూర్తిగా ధ్వంసమైందని, దాన్ని తిరిగి పునరుద్దరించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుందని స్పష్టం చేశారు.

ఇరవై ఏళ్లుగా లోయలో సినిమా థియేటర్లు మూతపడి ఉన్నాయని వీలైనంత త్వరగా వాటిని కూడా తెరుస్తామని కిషన్‌ రెడ్డి తెలిపారు. ఇన్నేళ్లూ ఉపాధికి దూరంగా ఉన్న కశ్మీరీ యువకులను నేవీ, ఆర్మీ, కేంద్ర బలగాల్లోకి తీసుకునేందుకు ప్రత్యేక నియామకాలను చేపడతామని స్పష్టం చేశారు. అలాగే మూతపడ్డ యూనివర్సిటీలను త్వరలోనే తెరుస్తున్నట్లు వెల్లడించారు. కశ్మీర్‌ వవ్యాప్తంగా టూరిజంను మరింత అభివృద్ధి చేస్తామని, దాని కొరకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా కశ్మీర్‌ విభజన అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో అక్కడి జనజీవనం పూర్తిగా స్తంభించిన విషయం తెలిసిందే. దీనిపై కిషన్‌ రెడ్డి స్పందిస్తూ.. కొన్ని ప్రాంతాల్లో మినహా రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం ప్రశాతంగా ఉన్నట్లు వివరించారు. సమాచార, సాంకేతిక వ్యవస్థపై ఆంక్షాలు పూర్తిగా సడలించామని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement