ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారతావని చరిత్రలో ఏ ప్రభుత్వం చెయ్యలేని పనిని, మోదీ–అమిత్ షాల ద్వయం చేసి చూపించింది. ఆర్టికల్ 370, 35ఏ లను రద్దు చేసి అక్కడ ప్రజలకి స్వేచ్ఛనిచ్చి ఆ కేంద్రపాలిత ప్రాంతాలు రెండూ ముందుకు దూసుకుపోయేందుకు అవకాశాలు కల్పిస్తోంది. మాజీ ప్రధాని వాజ్‌పేయి చెప్పినట్టు ‘ఇన్సానియాత్ (మానవతావాదం), ఝామూరియాత్ (ప్రజాస్వామ్యం), కశ్మీరియాత్ (శాంతి)’ అనే మూడు సూత్రాల ద్వారా జమ్మూ కశ్మీర్, లదాఖ్‌ల సర్వతోముఖాభివృద్ధికి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఒకే దేశం ఒకే రాజ్యాంగం అమలుతో డాక్టర్ అంబేడ్కర్ రూపకల్పన చేసిన భారత రాజ్యాంగానికి సంపూర్ణ గౌరవం లభించినట్లయింది.
‘‘ఒక దేశంలో రెండు రాజ్యాం గాలు, ఇద్దరు ప్రధానమంత్రులు, రెండు జెండాలు ఉండకూడదు’ – శ్యామా ప్రసాద్ ముఖర్జీ
ఏడాది క్రితం, 5 ఆగస్టు, 2019న ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నో ఏళ్ళుగా జమ్మూ కశ్మీర్ ప్రజలను వేధిస్తూ, వారి ప్రాథమిక హక్కులను కాలరాస్తూ, కేవలం నాలుగు కుటుంబాలకు, వారి అనుచరులకు ప్రయోజనం చేకూరుస్తున్న ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ రద్దుకు హోం మంత్రి అమిత్ షా రాజ్యసభలో బిల్లును ప్రవేశ పెట్టారు. దేశ ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ జమ్మూ కశ్మీర్లో వంచనకు ముగింపు పలికిన ఈ బిల్లుకు పార్లమెంట్ ఉభయసభలు ఆమోదం తెలిపాయి. ఈ తీర్మానంతో పాకిస్తాన్ నిర్ఘాంతపోయింది. ఈ నిర్ణయంతో సుమారు 2 కోట్ల మంది కశ్మీరీలు లబ్ధి పొందారు. దేశ వ్యాప్తంగా ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ, కుల, మత, ప్రాంత, భాషలకు అతీతంగా, సంతోషంతో ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగా సంబరాలు జరుపుకున్నారు.
నూతన శకానికి ఆరంభం
బాలల విద్యా హక్కు చట్టం, ఆస్తిలో మహిళలకు సమాన హోదా, బాల్య వివాహ నిషేధం, దళితులపై అత్యాచార నిషేధం వంటివి ఆ రాష్ట్రంలో ఎప్పుడూ అమలుకు నోచుకోలేదు. జమ్మూ కశ్మీర్‌కి చెందిన మహిళలు వేరే రాష్ట్రానికి చెందిన వారిని పెళ్లి చేసుకుంటే వారు తమ ఆస్తిపై ఉన్న హక్కును కోల్పోయేవారు. కానీ ఆర్టికల్ 370, 35ఏ రద్దుతో ఇటువంటి వాటికి కాలం చెల్లింది. ఇప్పుడు, అక్కడ ప్రజలు దేశంలో ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తినైనా వివాహం చేసుకోవచ్చు, ఎక్కడవారైనా జమ్మూ కశ్మీర్‌లో ఆస్తులు కొనుగోలు చెయ్యవచ్చు, పిల్లలు ఇతర రాష్ట్రాల విద్యార్థులతో సమానంగా బడికి వెళ్లి విద్యనభ్యసించవచ్చు, కొన్ని షరతులకు లోబడి ఇతర ప్రాంతాల వారు సైతం స్థానికులుగా గుర్తింపు తీసుకోవచ్చు. దేశంలో అర్హులైనవారెవరైనా జమ్మూ కశ్మీర్‌లో ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకొనే అవకాశం కూడా కలిగింది. జమ్మూ కశ్మీర్, లదాఖ్‌లలో ఒక కొత్త శకం ఆరంభమైంది.
ఆర్టికల్ 370, 35ఏ రద్దు తర్వాత, 24 అక్టోబర్, 2019లో మొట్టమొదటి బ్లాక్ అభివృద్ధి సమాఖ్యల ఎన్నికలను నిర్వహించారు. పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగిన ఈ ఎన్నికలలో సుమారు 98% మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఆదేశాల మేరకు 18 జనవరి, 2020 నుండి 24 జనవరి, 2020 వరకు, నేను, కేంద్ర మంత్రివర్గంలో నా సహచర సీనియర్ మంత్రులు 35 మంది జమ్మూ కశ్మీర్‌లో పర్యటించాము. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాము. ఆ పర్యటనలో మంత్రులందరం ఆయా గ్రామాల్లో రాత్రి బస కూడా చేశాము.
గతేడాది జనవరి 1 నుంచి జూలై 15 వరకు 105 మంది యువత కొత్తగా ఉగ్రవాదంలో చేరితే, ఈ ఏడాది అదే వ్యవధిలో 67 మంది మాత్రమే చేరారు. ఇదే వ్యవధిలో ఉగ్రవాద ఘటనలు 188 నుంచి 122కి తగ్గాయి. ఇప్పుడు యువత ప్రేరేపిత ఉగ్రవాదం నుంచి తమ దృష్టిని చదువులు, ఉద్యోగాల వైపు మళ్లించారు. విద్యార్థులను ప్రోత్సహిస్తూ కేంద్రం జమ్మూలో కొత్తగా ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థల అభివృద్ధికి 80,000 కోట్ల రూపాయలు కేటాయించింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా, జమ్మూ కశ్మీర్‌లో 2 ఎయిమ్స్ సంస్థల్ని సాంబ, అవంతిపొరలో నెలకొల్పుతోంది. లదాఖ్‌లో నూతనంగా 5 వైద్య కళాశాలలను నెలకొల్పింది. ‘లదాఖ్ విశ్వవిద్యాల యం’ను ప్రధాని మోదీ ప్రారంభించారు.
కశ్మీర్ యువత నైపుణ్య వికాసం
జమ్మూ కశ్మీర్, లడఖ్‌లోని 18 –35 ఏళ్ళ మధ్య యువతీ యువకుల నైపుణ్య అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ‘హిమాయత్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. కార్గిల్ గ్రామానికి చెందిన పర్వీన్ ఫాతిమా అనే యువతి ఈ పథకం ద్వారా శిక్షణ పొంది ప్రస్తుతం తమిళనాడులోని తిరుపూర్‌లో ఒక వస్త్ర పరిశ్రమలో సూపర్ వైజర్‌గా పనిచేస్తోంది. లదాఖ్‌లోని దోడకు చెందిన ఫయాజ్ అహ్మద్ కూడా ఈ పథకం కింద శిక్షణ తీసుకొని, పంజాబ్‌లో ఐటీ కంపెనీలో స్థిరపడ్డాడు. వీరిద్దరూ అక్కడ ఉన్న ఎంతో మంది ప్రతిభావంతమైన యువతీ యువకులకు ఆదర్శంగా నిలిచారని ‘మన్ కి బాత్’ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రశంసించారు.
2019, సెప్టెంబర్ నుంచి కేంద్ర ప్రభుత్వం ఉజ్జ్వల, కిసాన్ యోజన, స్టాండ్–అప్ ఇండియా వంటి 85 పథకాలు లదాఖ్, కశ్మీర్‌లలో ప్రారంభించింది. ఇటీవల ప్రవేశపెట్టిన 2020 బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జమ్మూ కశ్మీర్ కి 30,757 కోట్లు, లదాఖ్ ప్రాంతానికి 5,958 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. ఈ నిధులతో రెండు కేంద్రపాలిత ప్రాంతాలలో మౌలికవసతుల కల్పన, వ్యవసాయాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, విమానాశ్రయాల నిర్మాణం, విపత్తు నిర్వహణ వేగవంతమైనది. అమరనాథ్, వైష్ణోదేవి వంటి పుణ్యక్షేత్రాలు, శ్రీనగర్, జమ్మూ, అనంతనాగ్ వంటి పర్యాటక ప్రదేశాలతో కశ్మీర్, పాంగోంగ్ సరస్సు, హేమిస్ జాతీయ ఉద్యానవనాలతో లదాఖ్‌లు దేశవిదేశ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఇక్కడ అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల సహకారంతో నిరుద్యోగ యువత హోటల్, రవాణా, సేవా రంగాలలో స్వయం ఉపాధి పొందుతూ మిగిలినవారికి కూడా ఉపాధి కల్పిస్తున్నారు. ప్రస్తుతం కోవిడ్ ప్రభావంతో నెమ్మదించిన ఈ రంగాలు, మహమ్మారి తగ్గగానే తిరిగి పుంజుకోనున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు స్థానికుల భూములకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ‘భూమి బ్యాంకు’లను ఏర్పాటు చేసింది. సరుకు, ప్రజా రవాణా కోసం అధునాతన రోడ్లను నిర్మిస్తోంది. జమ్మూ– శ్రీనగర్ రహదారిపై 8.5 కిలోమీటర్ల బనిహాల్–ఖాజిగుండ్ సొరంగం త్వరలో వినియోగంలోకి రానుంది. దీనివల్ల రెండు నగరాల మధ్య 50 కిలోమీటర్లు పైగా దూరం, సగానికి పైగా ప్రయాణ సమయం తగ్గనుంది. 1,313 కోట్ల రూపాయలతో కశ్మీర్‌లో నూతనంగా రోడ్లు బ్రిడ్జిలను నిర్మించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. లదాఖ్‌లో 11,800 కోట్ల రూపాయలతో సరిహద్దు రహదారుల సంస్థ వ్యూహాత్మక రహదారులను అభివృద్ధి చేస్తూ మారుమూల ఊర్లను అనుసంధానిస్తోంది.
వెల్లువెత్తుతున్న ప్రాజెక్టులు
భారత రైల్వే కశ్మీర్ లోని ముఖ్య ప్రాంతాలని కలుపుతూ కొత్త మార్గాలను అభివృద్ధి చేస్తోంది. ప్రఖ్యాత వైష్ణోమాత ఆలయానికి చేరుకోవడానికి ఢిల్లీ నుండి కాట్రా వరకు అత్యాధునిక వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుని హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా ప్రారంభించింది. శ్రీనగర్–బారాముల్లా మార్గంలో ఈఫిల్ టవర్ కంటే ఎల్తైన బ్రిడ్జిని రైల్వేశాఖ నిర్మిస్తోంది. 2021కల్లా ఈ మార్గాన్ని పూర్తి చెయ్యాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. హోంశాఖ కొన్ని ప్రాంతాలను భద్రత దళాలకు వ్యూహాత్మక ప్రదేశాలుగా గుర్తించి ఇక్కడ సైనిక అవసరాలకు కావాల్సిన నిర్మాణాలను చేపట్టింది. 900 కిలోమీటర్ల మేర రూ. 11,000 కోట్లతో కేంద్ర విద్యుత్ శాఖ కొత్త ప్రాజెక్ట్ చేపట్టింది. లదాఖ్ గ్రిడ్‌ని జాతీయ గ్రిడ్‌కి అనుసంధానించి అక్కడ ఉత్పత్తి చేసిన విద్యుత్తును దేశమంతటా సరఫరా చేసేం దుకు ప్రణాళికలు రూపొందించింది. కఠినమైన శీతాకాలంలో రక్షణ సంస్థలతో పాటు, లే, కార్గిల్ జిల్లాల ప్రజలకు విద్యుత్ సరఫరా చేయడంలో ఇది సహాయపడుతుంది.
భారత రాజ్యాంగానికి సంపూర్ణ గౌరవం
ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారతావని చరిత్రలో ఏ ప్రభుత్వం చెయ్యలేని పనిని, మోదీ–అమిత్ షాల ద్వయం చేసి చూపించింది. ఆర్టికల్ 370, 35ఏ లను రద్దు చేసి అక్కడ ప్రజలకి స్వేచ్ఛనిచ్చి ఆ కేంద్రపాలిత ప్రాంతాలు రెండూ ముందుకు దూసుకుపోయేందుకు అవకాశాలు కల్పిస్తోంది. మాజీ ప్రధాని వాజ్‌పేయి చెప్పినట్టు ‘ఇన్సానియాత్ (మానవతావాదం), ఝామూరియాత్ (ప్రజాస్వామ్యం), కశ్మీరియాత్ (శాంతి)’ అనే మూడు సూత్రాల ద్వారా జమ్మూ కశ్మీర్, లదాఖ్‌ల సర్వతోముఖాభివృద్ధికి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఒకే దేశం ఒకే రాజ్యాంగం అమలుతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రూపకల్పన చేసిన భారత రాజ్యాం గానికి సంపూర్ణ గౌరవం లభించినట్లయింది.
వ్యాసకర్త కేంద్ర హోంశాఖ సహాయమంత్రి
ఈ–మెయిల్: gkishanreddy@yahoo.com
Comments
Please login to add a commentAdd a comment