
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా విపక్ష పార్టీలన్నీ ఒకటవుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉమ్మడి పోరాటానికి సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు ప్రధాన పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, కాంగ్రెస్, వామపక్షలు, అవామీ నేషనల్ కాన్ఫరెన్స్‌లు ఓ ప్రకటన విడుదల చేశాయి. ఎన్నో ఏళ్లుగా కశ్మీర్‌కు కొనసాగుతున్న స్వయం ప్రతిపత్తి హోదాను కొనసాగించాలని, అలాగే కశ్మీర్ విభజనను రద్దు చేయాలని ఆయా పార్టీల అధినేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్‌ను బీజేపీ సర్కార్ ముక్కలుగా చేసిందని, ఇది స్థానిక ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా ఉందని నేతలు అభిప్రాయపడుతున్నారు.
గత ఏడాది ఆగస్ట్ 5న కేంద్ర ప్రభుత్వం తీసుకునన ఏకపక్ష నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు అన్ని పార్టీల నేతలు కలిసి కట్టుగా పోరాటం చేయాలని శ్రీనగర్‌లో శనివారం నిర్వహించిన ఓ సమావేశంలో తీర్మానించారు. అంతేకాకుండా పబ్లిక్ సేఫ్టీ చట్టం కింద అరెస్ట్ కాబడిన నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాగా ఆర్టికల్ 370 రద్దు అనంతరం కశ్మీర్ నేతలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా లాంటి నేతలు విడుదలైనా కశ్మీర్ మాజీ సీఎం మహబూబా ముఫ్తీ ఇప్పటికీ నిర్బంధంలోనే ఉన్నారు.