అభిప్రాయం
ఊహించినట్లుగానే, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ)–ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్‌సీ) కూటమి చక్కటి మెజారిటీతో నూతన జమ్మూ కశ్మీర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సమ స్యాత్మకమైన పూర్వ రాష్ట్రం కోసం మనం ఏమి ఆశించగలం? మొదటి ప్రశ్న ఏమిటంటే, కొత్త ప్రభుత్వాన్ని సజావుగా పనిచేయడానికి అనుమతి స్తారా అనేది. లెఫ్టినెంట్ గవర్నర్ నిరంతరం ఎన్నికైన ప్రభుత్వానికి ఆటంకం కలిగించే విధంగా ఢిల్లీ తరహా పరిస్థితిని సృష్టిస్తారా అనే అనుమానం ఉంది.
అయితే భారతీయ జనతా పార్టీ, ఢిల్లీ ప్రభుత్వ విషయంలో బహిరంగంగా చేసినట్లు కాకుండా, 2015–2018 మధ్య పీడీపీతో పొత్తులో ఉన్నప్పుడు చేసినట్లుగా రహస్యంగానే వ్యవహరించే అవకాశం ఉందని నమ్ముతున్నాను. ఆ మూడేళ్ళలో వారు ముఫ్తీ మొహమ్మద్ సయీద్ తలపెట్టిన ప్రజల మధ్య వారధిని నిర్మించే ప్రయత్నాలను అడ్డుకున్నారు.
పైగా విడిపోయిన వర్గాలను ప్రేరేపించడానికి పీడీపీ మంత్రులు, శాసనసభ్యులతో తమ కొత్త సంబంధాలను ఉపయోగించారు. వారు ఆ విధానాన్ని పునరావృతం చేయడానికి ప్రయత్నిస్తే, ఎన్‌సీ–ఐఎన్‌సీ కూటమి భాగస్వాములకు రెట్టింపు భారం ఉంటుంది. అదేమిటంటే ఎన్నికైన ప్రభుత్వంలా కొంత అధికారాన్ని నిలుపుకోవడం, వారి ఎమ్మెల్యేలను కలిపి ఉంచడం.
కూటమికి ఈ రెండు పనులు సమాన ప్రాధాన్యం కలిగినవే. అయితే ఓటర్లు మొదటి కర్తవ్యం వైపే ఎక్కువగా చూస్తారు. ఇది నిజ సమయంలో ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థలో విధాన రూపకల్పననూ, దాని అమలును చేపట్టడంతోనూ ముడిపడి ఉంటుంది. దాంతోపాటు అలా చేయడానికి అధికా రాన్ని పొందే పోరాటం కూడా ఉంటుంది.
అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిసేపటి ముందు ప్రకటించిన కొత్త పాలనా నియమాల ప్రకారం... భద్రత, ఆర్థిక వ్యవహారాలు, పోలీసు శాఖతోపాటు బ్యూరోక్రసీపై అన్ని కీలక అధికారాలు ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్‌కి దఖలుపడ్డాయి. కొత్త ప్రభుత్వ యంత్రాంగం మునిసిపాలిటీ స్థాయికి తగ్గింది. కొత్త ప్రభుత్వం... చిన్నదా పెద్దదా అనే అంశంతో నిమిత్తం లేకుండా ప్రతి అంశంపై లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంతో ఘర్షించవలసి ఉంటుంది.
స్వతంత్ర మీడియా, భిన్నాభిప్రాయాలు లేదా నిరసన తెలిపే హక్కు వంటి ప్రాథమిక పౌర హక్కులను కాపాడాలని ఎన్నుకోబడిన ప్రభుత్వం కోరుకుంటుంది. ప్రస్తుతం వాటికి అనుమతి లేదు. భద్రత అనేది ఘర్షణకు ప్రధాన మూలంగా ఉంటుంది.
చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం కింద వందలాది ఏకపక్ష కేసులు ఉన్నాయి. వాటికి తక్షణ పరిష్కారం అవసరం. నేషనల్ కాన్ఫరెన్స్ మేనిఫెస్టో ప్రజా భద్రతా చట్టాన్ని రద్దు చేస్తామని వాగ్దానం చేసింది. అయితే అలా చేయడానికి వారికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమోదం అవసరం.
సుప్రీం కోర్ట్ 2023 డిసెంబర్‌లో ఇచ్చిన తీర్పులో సిఫార్సు చేసిన విధంగా పూర్తి రాష్ట్ర హోదాను త్వరగా పున రుద్ధరించడం ఒక పెద్ద సవాలుగా ఉంటుంది. ఆర్టికల్ 370 పిటిషన్లపై 2023 నాటి సుప్రీంకోర్టు విచారణలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేసిన ప్రకటన ప్రకారం... మోదీ పరిపాలన పూర్తి పునరుద్ధరణ కంటే దశలవారీగా పునరుద్ధ రణ దిశగా ఆలోచిస్తోంది. దశల వారీ విధానానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోని పక్షంలో, పూర్తి రాష్ట్ర హోదా కోసం ఉద్యమం అనేది ప్రతి చిన్న అధికారానికి సుదీర్ఘకాలంపాటు సాగే దశల వారీ పోరాటం కావచ్చు.
చట్టపరంగా, దశలవారీగా రాష్ట్ర హోదా పునరుద్ధరణకు వ్యతిరేకంగా చేస్తున్న వాదన బలంగా ఉంది. రాష్ట్ర హోదా పునరుద్ధరింపబడుతుందని చెప్పినందున రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతం స్థాయికి తగ్గించవచ్చా అనే దానిపై కోర్టు తీర్పు ఇవ్వలేదు. సొలిసిటర్ జనరల్ ప్రకటించిన దశల వారీగా పునరుద్ధరణను ఎందుకు సవాలు చేయలేదు అనేది ఎవరికి వారు అంచనా వేసుకోవలసిందే.
కానీ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతం స్థాయికి తగ్గించలేకపోతే, రాష్ట్ర హోదాను దశలవారీగా పునరుద్ధరించడం సాధ్యం కాదని అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర హోదా కోసం ఇటీవల ఇద్దరు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్‌లో ఇది ఇప్పటికే లేవనెత్తక పోయి ఉంటే... ఇది రాజ్యాంగపరమైన సమస్య అవుతుంది.
నిరుద్యోగం దేశంలోని మిగిలిన ప్రాంతాల కంటే జమ్మూ కశ్మీర్‌లో చాలా ఎక్కువగా ఉంది. కొత్త భూసేకరణ నిబంధనల నుంచి స్థానిక కంపెనీలకు కాకుండా జాతీయ సంస్థ లకు మైనింగ్, వినియోగ వస్తువులు, పర్యాటక లైసెన్సుల మంజూరు వరకు గత ఐదేళ్లలో చేపట్టిన చాలా విధానాలను సమీక్షించి, అవసరమైన చోట వాటిని వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వ పెద్దలు, లెఫ్టినెంట్ గవర్నర్ తెలివైన వారైతే, కొత్త ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఉండి, అది నాయకత్వం వహించడానికి అనుమతిస్తారు. అయితే, ఈ ప్రభుత్వం తాను నిర్వహించాల్సిన విధులను నెరవేర్చడంలో విఫలమైతే, తదుపరి అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఓటర్లు బీజేపీనీ లేదా మరింత అనుకూలమైన ప్రాంతీయ వర్గాలనూ ఆశ్రయించవచ్చనే భావనతో ఇటువంటి కార్యక్రమాలను అడ్డుకునే ప్రలోభం కూడా ఉండవచ్చు.
మొత్తం మీద కొత్త ప్రభుత్వానికీ, రాష్ట్ర ప్రజలకూ రాబోయే రోజులు కీలకం కానున్నాయి. మహారాష్ట్ర, జార్ఖండ్ లేదా ఢిల్లీలో తన తోటి గవర్నర్‌లు ఆడిన గేమ్‌లు... ఈ అస్థిరమైన సరిహద్దు రాష్ట్రంలో పునరావృతం కాకూడదని లెఫ్టినెంట్ గవర్నర్ అర్థం చేసుకుంటారని మనం ఆశించాలి. ఇక్కడ పాకిస్తాన్ ఆధారిత సాయుధ సమూహాలు ఏ చిన్న తప్పునుంచైనా ప్రయోజనం పొందడానికి ప్రయత్నిస్తాయి. అది నిజంగానే జాతీయ ప్రయోజనాలకు భంగకరం.
రాధా కుమార్
వ్యాసకర్త ‘ప్యారడైజ్ ఎట్ వార్: ఎ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ జమ్మూ అండ్ కశ్మీర్’ రచయిత
(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో...)
Comments
Please login to add a commentAdd a comment