మోదీ-షా ద్వయం మరోసారి ఫలిస్తుందా? | BJP Face First Election After Kashmir And NRC | Sakshi
Sakshi News home page

మోదీ-షా ద్వయం మరోసారి ఫలిస్తుందా?

Published Sat, Sep 21 2019 7:37 PM | Last Updated on Sat, Sep 21 2019 7:58 PM

BJP Face First Election After Kashmir And NRC - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మరోసారి ఎన్నికల వేడి మొదలైంది. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశ వ్యాప్తంగా 64 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల బరిలోకి దిగేందుకు రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. దేశంలో ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీనే ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీదారులు. వరుస ఓటములతో కుదేలవుతున్న కాంగ్రెస్‌ పార్టీకి ఈ ఎన్నికలు చావోరావే తేల్చుకునే పరిస్థితి. ముఖ్యంగా హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలతో పాటు కర్ణాటకలోని 15 స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లోనూ ఆ పార్టీ కఠిన పరీక్షనే ఎదుర్కొనుంది. పార్టీ నాయకత్వంతో పాటు, కార్యకర్తల భవిష్యత్తుని ఈ ఎన్నికలు నిర్ణయిస్తాయని రాజకీయ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఇక వరుస విజయాలతో దూసుకుపోతున్న బీజేపీ విషయానికొస్తే.. జరగబోయే ఎన్నికల్లో తమకు తిరుగలేదని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు.. కేంద్రంలో మద్దతు కలిగిన బలమైన ప్రభుత్వం ఉండటం, ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్నికల వ్యూహకర్తగా పేరొందిన అమిత్‌ షాలు ఉండనేఉన్నారు.

మోదీ చరిష్మాతోనే 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ.. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే వ్యూహాన్ని అమలు చేయాలని భావిస్తోంది. దానిలో భాగంగానే హర్యానా, నాసిక్‌ సభల్లో ప్రసంగించిన మోదీ.. ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. మోదీచే మరికొన్ని బహిరంగ సభలను నిర్వహించాలని బీజేపీ నాయకత్వం ప్రణాళికలు రచిస్తోంది. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో దేశ వ్యాప్తంగా మోదీ 400 ర్యాలీలు నిర్వహించగా ఆ ఎన్నికల్లో బీజేపీ 282 స్థానాలను సాధించింది. దీనికి భిన్నంగా గత ఎన్నికల్లో కేవలం 144 ర్యాలీల్లో పాల్గొన్న మోదీ ఏకంగా 303 స్థానాలను సాధించిపెట్టారు.

వ్యతిరేకత తప్పదా..?
అయితే కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం.. అనేక కీలక, వివాదాస్పద నిర్ణయాలను తీసుకున్న విషయం తెలిసిందే. వాటిలో ట్రిపుల్‌ తలాక్‌, ఆర్టికల్‌ 370 రద్దు, ఎన్‌ఆర్‌సీని అమలు చేసింది. వీటిని కొన్ని వర్గాల ప్రజలు స్వాగతించగా.. మరికొందరు తీవ్రగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో కీలకపైన అసెంబ్లీ ఎన్నికల ముందు వీటి నుంచి కమళ దళం ప్రతిఘటన ఎదుర్కొక తప్పదని రాజకీయవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన జాతీయ పౌరుల జాబితా (ఎన్‌ఆర్‌సీ) నుంచి దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తొలుత అస్సాంలో అమలు చేసిన కేంద్రం.. ఆ తరువాత దేశ వ్యాప్తంగా అమలు చేస్తామని ఇదివరకే ప్రకటించింది. మొదట్లో ఎన్‌ఆర్‌సీ సృష్టించిన ప్రకంపనలు అంతాఇంతా కాదు. ఎన్‌ఆర్‌సీ వ్యతిరేక ఉద్యమం పలుప్రాంతాల్లో తీవ్ర రూపం దాల్చింది.

మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ తాజా ఎన్నికలపై ఎంతోకొంత ప్రభావం చూపుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. వెరసి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తమకే లాభం చేకూరుస్తాయని ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి. ట్రిపుల్‌ తలాక్‌ చట్టంతో ముస్లింలు బీజేపీపై కొంత ఆగ్రహంగా ఉన్నారని భావిస్తోన్న కాంగ్రెస్‌ ఆ వర్గాన్ని తమవైపు తిప్పుకోని పూర్వవైభవం సాధించాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అలాగే ఎన్‌ఆర్‌సీపై కూడా పోరాడుతోంది. దీనిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రతిపక్షాలు చెమటోడుస్తున్నాయి. బీజేపికి పెద్ద దిక్కుగా మారిన మోదీ, అమిత్‌ షాలే అన్ని ఎన్నికల్లోనూ విజయం బాధ్యతను మోస్తున్నారు. మహారాష్ట్ర, హర్యానా అసెం‍బ్లీ ఎన్నికలతో పాటు కర్ణాటకలో ఉప ఎన్నికల్లో కూడా విజయం సాధించాలని ఆ పార్టీ భావిస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో  షా, మోదీ ద్వయం ఫలిస్తుందా అనేది వేచి చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement