What is Article 370 in Telugu | అమిత్‌ షా ప్రకటనతో రద్దు | Jammu and Kashmir Latest News - Sakshi
Sakshi News home page

ఆర్టికల్‌ 370 పూర్తి స్వరూపం

Published Mon, Aug 5 2019 12:07 PM | Last Updated on Mon, Aug 5 2019 2:47 PM

Amit Shah Announced Dissolve Article 370 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక స్వయం ‍ప్రతిపత్తి హోదా కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ను రద్దు చేస్తున్నట్లు రాజ్యసభలో కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌ షా ప్రకటించారు. దీంతో ఇన్నేళ్లూ కశ్మీర్‌కు కల్పించిన ప్రత్యేక హోదా ఇక పూర్తిగా రద్దు కానుంది. ఈ నేపథ్యంలో ఆర్టికల్‌ 370 మరోసారి తెరపైకి వచ్చింది. దానిని వివరాలు..భారత రాజ్యాంగం ప్రకారం జమ్మూకశ్మీర్‌ రాష్ర్టానికి ఆర్టికల్‌ 370 స్వయంప్రతిపత్తి హోదా కల్పిస్తుంది. రాజ్యాంగంలోని 21వ భాగంలో దీన్ని పొందుపరిచారు. ఆర్టికల్‌ 370 కింద కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించారు. దేశంలోని మిగతా రాష్ర్టాలకు రాజ్యాంగ ప్రకారం కల్పించే సౌకర్యాలు కశ్మీర్‌కు వర్తించవు. 1947లో షేక్‌ అబ్దుల్లా ఆర్టికల్‌ 370 ముసాయిదాను తయారు చేశారు. రాజా హరిసింగ్‌, అప్పటి దేశ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆదేశాల ప్రకారమే.. అబ్దుల్లా ఆర్టికల్‌ ముసాయిదాను రూపొందించారు.
చదవండి: సంచలన నిర్ణయం ఆర్టికల్‌ 370 రద్దు

ఆర్టికల్‌ 370 ప్రకారం.. రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, సమాచార అంశాలు మినహా.. మిగతా చట్టాల అమలు కోసం కశ్మీర్‌ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తప్పనిసరి. ఆ రాష్ట్రం అనుమతి తెలిపినప్పుడు మాత్రమే పార్లమెంట్‌ రూపొందించిన చట్టాలను అమలవుతాయి. అంటే ఈ ఆర్టికల్‌ ప్రకారం.. కశ్మీర్‌ ప్రజలు ప్రత్యేక చట్టం కింద జీవిస్తున్నారన్నది అర్థమవుతోంది. పౌరసత్వం, ప్రాపర్టీ ఓనర్‌షిప్‌, ప్రాథమిక హక్కులు కూడా కశ్మీర్‌కు భిన్నంగా ఉంటాయి. దీని ప్రకారం ఇతర రాష్ర్టాల ప్రజలు కశ్మీర్‌లో స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉండదు. ఆర్టికల్‌ 370 ప్రకారం కశ్మీర్‌లో ఆర్థిక ఎమర్జెన్సీ విధించే అధికారం కూడా కేంద్రానికి ఉండదు. కేవలం యుద్ధం లేదా బాహ్య వత్తిళ్ల వల్ల ఏర్పడే పరిణామాల నేపథ్యంలోనే కశ్మీర్‌లో ఎమర్జెన్సీ ప్రకటించే అవకాశం ఉంటుంది.

ఒకవేళ రాష్ట్రంలో ఏవైనా అల్లర్ల చోటుచేసుకుంటే, ఆ సమయంలో ఎమర్జెన్సీ విధించే అవకాశం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతితోనే కేంద్రం ఎమర్జెన్సీని ప్రకటిస్తుంది. అయితే ప్రత్యేక చట్టాల అమలు కోసం తయారైన ఆర్టికల్‌ 370ని రద్దు చేయాలని బీజేపీ తొలినుంచి భావించింది. దాని కోసమే తన ఎన్నికల మ్యానిఫెస్టోలో వాగ్దానం కూడా చేసింది. 2019లో తిరిగి తాము అధికారంలోకి వస్తే కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తామని మోదీ ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. తాజాగా అమిత్‌ షా ప్రకటనతో ఎన్నికల హామీని నెరవేర్చారు. దీంతో దీంతో కశ్మీర్‌ ప్రత్యేక హక్కులను కోల్పోయి.. కేంద్ర ప్రభుత్వానికి పూర్తి హక్కులను కల్పించబడ్డాయి. ఇక పార్లమెంట్‌ చేసే ప్రతిచట్టం దేశమంతటితో పాటు కశ్మీర్‌లోనూ అమలు కానుంది. కశ్మీర్‌ భూభాగాల మార్పుపై కూడా పూర్తి అధికారం కేంద్ర ప్రభుత్వానికి సంక్రమించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement