ఫైల్ ఫోటో
న్యూఢిల్లీ : పొరుగు దేశాలతోపాటు ప్రపంచంలోని ఏ దేశానికీ భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని.. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు పూర్తిగా భారతదేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వానికి సంబంధించిన వ్యవహారమని ఆయన మరోసారి స్పష్టం చేశారు. పంజాబ్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన దివంగత మాజీ కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ ప్రథమ స్మారకోపన్యాసం సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తూ ‘భారతదేశం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. ఆర్టికల్ 370 రద్దు విషయంలో పార్లమెంటు కూలంకశంగా చర్చించింది. ఉభయసభల ఆమోదం పొందింది. ఇదంతా భారతదేశ అంతర్గత వ్యవహారం. ఇతర దేశాలు (పరోక్షంగా చైనా, పాకిస్తాన్‌లను ఉద్దేశిస్తూ) మా దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు’ అని పేర్కొన్నారు.
సుష్మాస్వరాజ్ ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత.. ‘ఈ క్షణం కోసమే ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశానంటూ’ చివరి ట్వీట్ చేసిన విషయాన్ని గుర్తుచేసుకుని ఉపరాష్ట్రపతి ఉద్వేగానికి గురయ్యారు. భారతదేశ ఆలోచనలు, విదేశాంగ విధానాన్ని పలు అంతర్జాతీయ వేదికలపై చాలా స్పష్టంగా, హుందాగా అదే సమయంలో బలంగా ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. సుష్మా స్వరాజ్‌కు ఘనంగా నివాళులర్పించిన ఉపరాష్ట్రపతి.. ఆమెను ‘ఆదర్శ భారతీయ మహిళ’గా కీర్తించారు.
మాటలు, చేతల్లో స్పష్టత.. ఆలోచన, ఆహార్యం, ప్రసంగాల్లో భారతీయతకు ఆమె ప్రతిరూపమన్నారు. సుష్మా స్వరాజ్‌కు ఘనంగా నివాళులర్పించారు. తనకు అప్పగించిన ప్రతి బాధ్యతను అత్యంత సమర్థవంతంగా నిర్వహించారని.. తను పనిచేసిన ప్రతిచోట తనదైన ముద్రవేశారని ఉపరాష్ట్రపతి గుర్తుచేసుకున్నారు. అలాంటి ఆదర్శంతమైన రాజకీయ నాయకురాలి జీవితాన్ని, ఆమె సాధించిన విజయాలను కొత్తతరం రాజకీయ నాయకులు ప్రేరణగా తీసుకోవాలని సూచించారు. 1996లో పార్లమెంటులో ‘భారతీయత’పై శ్రీమతి సుష్మాస్వరాజ్ చేసిన ప్రసంగం తనకింకా గుర్తుందన్నారు.
‘ఓ చక్కటి వక్తగా, కార్యశీలిగా, రాజకీయ నాయకురాలిగా మాత్రమే కాకుండా.. మానవతా విలువలున్న వ్యక్తిగా కూడా సుష్మాస్వరాజ్ అందరి గుండెల్లో నిలిచిపోతారు. ఆమె పేరుముందు స్వర్గీయ అని పెట్టేందుకు కూడా మనసు అంగీకరించడంలేదు. మిత్రులు, మద్దతుదారులు, ప్రజలు ఇలా ఎవరికేం అవసరం వచ్చి ఆమె తలుపు తట్టినా.. నేనున్నానంటూ వచ్చి సాయం చేసే ఓ మంచి సోదరిని ఇంకా మరిచిపోలేకపోతున్నాను’ అని పేర్కొన్నారు. విదేశాంగ మంత్రిగా ఉన్నసమయంలోనూ.. సమస్య ఉందని సామాజిక మాధ్యమాల్లో విజ్ఞప్తులు వచ్చిన తక్షణమే స్పందించేవారని గుర్తుచేసుకున్నారు.
‘ఇటీవలి కాలంలో నేను చూసిన గొప్ప విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్’ అని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. ఏడుసార్లు లోక్‌సభకు, అంతకుముందు మూడుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారంటే.. ప్రజల గుండెల్లో ఆమెకున్న స్థానాన్ని అర్థం చేసుకోవచ్చన్నారు. ‘అందరికీ అర్థమయ్యేలా భాషలో స్పష్టత, ఆకట్టుకునే పదాలు వీటికితోడు చక్కటి వక్తృత్వం వెరసి సుష్మాస్వరాజ్ తన ఆలోచనలను చాలా స్పష్టంగా వెల్లడించేవారు. హిందీ, సంస్కృతం, హరియాణ్వీతోపాటుగా కర్ణాటక ఎన్నికల్లో కన్నడ భాషలోనూ స్పష్టంగా మాట్లాడి.. అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆమె బహుభాషా కోవిదురాలు’ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
‘సుష్మాజీ మా కుటుంబంలో ఒకరిగా ఉండేవారు. ప్రతి రాఖీపౌర్ణమికి ఇంటికొచ్చి ఆప్యాయంగా రాఖీ కట్టేవారు. ఆ బంధాన్ని ఇంకా మరిచిపోలేకపోతున్నాను. మొన్న రాఖీ పండగ సందర్భంగా సుష్మాజీ గుర్తుకొచ్చి ఉద్వేగానికి గురయ్యాను. ఆమె పేరుకు ముందు స్వర్గీయ అని పిలిచేందుకు ఇంకా మనసు రావడం లేదు’ అని ఉపరాష్ట్రపతి అన్నారు. గొప్ప వ్యక్తుల సంస్మరణ సభలు నిర్వహించడం కేవలం వారికి నివాళులు అర్పించడానికి మాత్రమే కాదని.. వారు చూపిన ఆదర్శాలను అన్వయం చేసుకుని ముందుకెళ్లాల్సిన అవసరముందని విద్యార్థులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పంజాబ్ విశ్వవిద్యాలయ ఉపకులపతి రాజ్ కుమార్, సుష్మాస్వరాజ్ కుమార్తె బాసురీ స్వరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment