గురువారం ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ, ఎర్రకోట వద్ద పాఠశాల విద్యార్థులతో ముచ్చటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎర్రకోటలో ఆరోసారి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం
జనాభా పెరిగితే రాబోయే తరాలకు లెక్కలేనన్ని సమస్యలు, సవాళ్లు ఎదురవుతాయి. జనాభా విస్ఫోటనాన్ని నియంత్రించేందుకు కేంద్రంతోపాటు రాష్ట్రాలూ చర్యలు చేపట్టాలి. ఒక్కో కుటుంబంలో మనుషులు ఎక్కువగా ఉంటే వారికి సరైన విద్య, వైద్య సౌకర్యాలు అందవు. ఇప్పటికే దేశంలో కొంత భాగం ప్రజలు చిన్న కుటుంబాలుగా ఉంటూ సుఖంగా జీవిస్తున్నారు. వారిని చూసి మిగతా వారు నేర్చుకోవాలి. దీన్ని అనేక మంది వ్యతిరేకించినా.. దేశ ప్రజలకు మంచి భవిష్యత్తును అందివ్వడం కోసం ఇది తప్పదు.
కశ్మీరీల కలలకు రెక్కలు
జమ్మూకశ్మీర్ అంశంలో కేవలం ప్రజలు అప్పజెప్పిన బాధ్యతను పూర్తి చేశా. జమ్మూకశ్మీర్, లదాఖ్ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చాల్సిన, వారి కలలకు కొత్త రెక్కలను ఇవ్వాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. 370వ అధికరణం రద్దవ్వడంతో ఇప్పుడు భారత్ ఒక దేశం, ఒకే రాజ్యాంగంగా మారింది. సాహసోపేత, పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి మా ప్రభుత్వం సంశయించదు.
‘సీడీఎస్’ రూపకల్పన..
త్రివిధ దళాలకు కలిపి కొత్తగా ఓ అధిపతిని నియమిస్తాం. సీడీఎస్ (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్)గా నియమితులయ్యే వ్యక్తి సైనిక, వాయుసేన, నౌకాదళానికి సంయుక్త అధిపతిగా ఉంటారు. త్రివిధ దళాల మధ్య సమన్వయాన్ని మరింత పెంచడం కోసం సీడీఎస్‌ను నియమించాల్సిన సమయం వచ్చింది. సీడీఎస్ నియామక విధి విధానాలను మా ప్రభుత్వం ఇంకా రూపొందిస్తోంది.
దేశంలోనే విహారం
ఏడాదికి దాదాపు 2 కోట్ల మంది భారతీయులు విదేశాలకు విహారయాత్రలకు వెళ్తున్నారు. వారంతా 75వ స్వాతంత్య్ర దినోత్సవం వచ్చే నాటికి దేశంలోనే కనీసం 15 పర్యాటక కేంద్రాలను సందర్శించాలి. దీంతో దేశీయంగా పర్యాటక రంగానికి ప్రోత్సాహం లభించి దేశం అభివృద్ధి చెందుతుంది.
ఒకే దేశం.. ఒకే ఎన్నిక..
దేశం గొప్పగా మార్చేందుకు లోక్‌సభతోపాటు అన్ని శాసనసభలకూ ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం తప్పనిసరి. ప్రస్తుతం జమిలి ఎన్నికల ప్రస్తావన వస్తుండటం శుభపరిణామం. ఒక దేశం, ఒక ఎన్నిక అంశంపై అన్ని భాగస్వామ్య పక్షాల్లో చర్చలు జరగాలి.
న్యూఢిల్లీ
దేశం ఎదుర్కొంటున్న వేలాది సమస్యలను పరిష్కరించేందుకు ఇప్పుడు భారత్‌కు ఎంతో బలమైన ప్రభుత్వం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలోని ఎర్రకోట నుంచి వరుసగా ఆరోసారి, 73వ స్వాతంత్య్ర దినోత్సవాన ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. రంగురంగుల తలపాగాతో గురువారం వేదిక మీదకు వచ్చిన మోదీ.. త్రివిధ దళాల మధ్య సమన్వయం కోసం ఆ మూడింటికీ కలిపి కొత్తగా ఒక అధిపతిని (చీఫ్ ఆఫ్ డిఫెన్స్‌స్టాఫ్ – సీడీఎస్) నియమించడం, దేశంలో జనాభా విస్ఫోటనాన్ని అరికట్టడం, జమ్మూ కశ్మీర్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం తదితర అంశాలను తన ప్రసంగంలో ప్రస్తావించారు.
దేశంలోని ప్రతి ఇంటికీ పైపుల ద్వారా నీరు అందించేందుకు తమ ప్రభుత్వం రాబోయే కొన్నేళ్లలో రూ. 3.5 లక్షల కోట్లను ఖర్చు చేయనుందని మోదీ చెప్పారు. ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్న నేపథ్యంలో, రాబోయే ఐదేళ్లలో ఏకంగా వంద లక్షల కోట్ల రూపాయలను మౌలిక వసతుల రంగంలో పెట్టి, ఆర్థిక వ్యవస్థ ఐదు లక్షల కోట్ల డాలర్లకు చేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మోదీ వెల్లడించారు. ఒక దేశం, ఒకే కార్డు వ్యవస్థతో ఒకే కార్డుతో దేశంలో ఎక్కడైనా ప్రయాణాలకు చెల్లింపులు చేసే వ్యవస్థను తమ ప్రభుత్వం తీసుకొచ్చిందని అన్నారు. దాదాపు 95 నిమిషాల పాటు, సుదీర్ఘంగా సాగిన మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...
జనాభాను నియంత్రించాల్సిందే..
‘జనాభా పెరిగితే రాబోయే తరాల వారికి లెక్కపెట్టలేనన్ని సమస్యలు, సవాళ్లు ఎదురవుతాయి. జనాభాను నియంత్రించేందుకు కేంద్రంతోపాటు రాష్ట్రాలు కూడా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. దేశం నేరుగా ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటైన జనాభా విస్ఫోటన సమస్యకు పరిష్కారం కనుగొనాల్సిన సమయం వచ్చింది. కుటుంబాలు చిన్నగా ఉండాలి. ఒక్కో కుటుంబంలో మనుషులు ఎక్కువగా ఉంటే వారికి సరైన విద్య, వైద్య సౌకర్యాలు అందవు. వారి ఇళ్లతోపాటు మొత్తంగా దేశం కూడా సంతోషంగా ఉండదు. ఇప్పటికే దేశంలో కొంత భాగం మంది ప్రజలు జనాభాను తగ్గించుకుని, చిన్న కుటుంబాలుగా ఉంటూ సుఖంగా జీవిస్తున్నారు. వారిని చూసి మిగతా వారు నేర్చుకోవాలి. ఈ నిర్ణయాన్ని అనేక మంది వ్యతిరేకించినా సరే, దేశ, ప్రజలకు మంచి భవిష్యత్తును అందివ్వడం కోసం ఇది తప్పదు’.
‘సీడీఎస్’విధివిధానాలను రూపొందిస్తున్నాం
‘త్రివిధ దళాలకు కలిపి కొత్తగా ఓ అధిపతిని నియమిస్తాం. సీడీఎస్ (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్)గా నియమితులయ్యే వ్యక్తి ఆర్మీ, వాయుసేన, నౌకాదళం.. మూడింటికి కలిపి సంయుక్త అధిపతిగా ఉంటారు. త్రివిధ దళాల మధ్య సమన్వయాన్ని మరింత పెంచడం కోసం సీడీఎస్‌ను నియమించాల్సిన సమయం వచ్చింది. సీడీఎస్ నియామక విధి విధానాలను మా ప్రభుత్వం ఇంకా రూపొందిస్తోంది’అని మోదీ చెప్పారు. ప్రస్తుత విధానంలో త్రివిధ దళాల మధ్య సమన్వయం కోసం మూడు సేనల చీఫ్‌ల కమిటీ (చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ–సీవోఎస్‌సీ) ఉంది. ఆ ముగ్గురు అధిపతుల్లో ఎవరు అత్యంత సీనియర్ అయితే వారు సీవోఎస్‌సీ చైర్మన్‌గా ఉంటారు. కొత్తగా నియమితులయ్యే సీడీఎస్ త్రివిధ దళాల మధ్య సమన్వయం కోసం కృషి చేయడంతోపాటు ప్రధాని, రక్షణ మంత్రులకు సైనిక సలహాదారుగానూ ఉంటారు.
కశ్మీరీల కలలకు కొత్త రెక్కలు ఇవ్వాలి
‘జమ్మూ కశ్మీర్ అంశంలో నాకు వ్యక్తిగతంగా ఎలాంటి ఉద్దేశం, భావం లేదు. కేవలం ప్రజలు అప్పజెప్పిన బాధ్యతను పూర్తి చేశా. జమ్మూ కశ్మీర్, లదాఖ్ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చాల్సిన, వారి కలలకు కొత్త రెక్కలను ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. 370వ అధికరణం రద్దవ్వడంతో ఇప్పుడు భారత్ ఒక దేశం, ఒకే రాజ్యాంగంగా మారింది. సాహసోపేత, పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి మా ప్రభుత్వం సంశయిం చదు. ఆర్టికల్ 370పై గత 70 ఏళ్లలో చేయలేని దానిని మేము ఇప్పుడు చేసి చూపించాం’
దేశంలోనే విహారయాత్రలకు వెళ్లండి..
‘ఏడాదికి దాదాపు 2 కోట్ల మంది భారతీయులు విదేశాలకు విహారయాత్రలకు వెళ్తున్నారు. వారంతా 2022 నాటికి దేశంలోనే కనీసం 15 పర్యాటక కేంద్రాలను సందర్శించాలి. దీనివల్ల దేశీయంగా పర్యాటక రంగానికి ప్రోత్సాహం లభించి దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుతం విదేశాల్లో మాదిరిగా దేశంలోని పర్యాటక కేంద్రాల్లో చాలా మంచి హోటళ్లు ఉండకపోవచ్చు. కానీ, ప్రజలు వెళ్లడం మొదలుపెడితే వాటంతట అవే వస్తాయి.
దేశం గొప్పగా మారాలంటే తప్పదు..
‘దేశం గొప్పగా మార్చేందుకు లోక్‌సభతోపాటు అన్ని శాసనసభలకూ ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం తప్పనిసరి. ప్రస్తుతం జమిలి ఎన్నికల ప్రస్తావన వస్తుండటం శుభపరిణామం. ‘ఒక దేశం, ఒక ఎన్నిక’ అంశంపై అన్ని భాగస్వామ్య పక్షాల్లో చర్చలు జరగాలి’అని మోదీ అన్నారు. అయితే రాజ్యాంగం మార్చకుండానే జమిలి ఎన్నికలు అసాధ్యమని న్యాయ కమిషన్ గతేడాది ఆగస్టులోనే తేల్చి చెప్పడం తెలిసిందే.
ఆరేళ్లు.. ఆరు తలపాగాలు
స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలప్పుడు ప్రసంగం చేసే సమయంలో వైవిధ్యమైన తలపాగాలు ధరించడం మోదీ ప్రత్యేకత. 73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై ప్రసంగం చేసే సమయంలోనూ మోదీ ఆ ప్రత్యేకతను చాటుకున్నారు. పసుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగులున్న తలపాగాను, సగం వరకే చేతులున్న తెల్ల కుర్తా, పైజామా, కాషాయ రంగు అంచులున్న కండువాను ధరించి మోదీ వేదికపైకి వచ్చారు. 2014లో తొలిసారి ఎర్రకోటపై నుంచి ప్రసంగించినప్పుడు మోదీ తల భాగం ఎర్రగా, తోక భాగం ఆకుపచ్చ జోధ్‌పురీ తలపాగా పెట్టుకున్నారు. 2015లో పసుపు రంగు వస్త్రంపై ఎరుపు, ముదురు ఆకుపచ్చ రంగు గీతలున్న తలపాగాను, 2016లో పసుపు, గులాబీ రంగు తలపాగాను మోదీ ధరించారు. 2017లో దట్టమైన ఎరుపు, పసుపు రంగులపై బంగారు వర్ణం గీతలున్న తలపాగాను, 2018లో కాషాయ తలపాగాతో మోదీ ఎర్రకోటపైకి వచ్చారు.
ఆహ్లాద వాతావరణంలో ఉత్సాహంగా..
73వ స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమం ఎర్రకోటలో ఆహ్లాద వాతావరణంలో ఉత్సాహంగా సాగింది. మోదీ ఎర్రకోటకు చేరుకుని తిరిగి వెళ్లే వరకూ కార్యక్రమం జరిగిన తీరు ఇలా...
► చారిత్రక కోట వద్దకు ప్రధాని చేరుకోగానే సందర్శకులంతా లేచి నిలబడ్డారు.
► కార్యక్రమానికి నరేంద్ర మోదీ తెల్లని పైజామా–కుర్తా, రాజస్తానీ తరహా రంగురంగుల తలపాగా ధరించి వచ్చారు.
► రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మోదీకి స్వాగతం పలికారు.
► తర్వాత మోదీ ఇంటర్ సర్వీసెస్, పోలీస్‌గార్డ్‌ల వందనం స్వీకరించారు
► అనంతరం ప్రధాని ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
► తర్వాత మోదీ జాతిని ఉద్దేశించి 95 నిమిషాల పాటు ప్రసంగించారు. వరుసగా ఆరోసారి బుల్లెట్ ప్రూఫ్ పోడియం రక్షణ లేకుండా ప్రసంగించారు.
► ఈ కార్యక్రమానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, ఎస్ జైశంకర్, నితిన్ గడ్కరీ, రమేశ్ పోఖ్రియాల్, ప్రహ్లాద్ సింగ్ పటేల్ త్రివిధ దళాధిపతులు బిపిన్ రావత్, బి.ఎస్. ధనోవా, కర్మబీర్ సింగ్ హాజరయ్యారు.
► ఎర్రకోట ముందు వేలాది మంది పాఠశాల పిల్లలు ’నయా భారత్’ అనే హిందీ అక్షరాల ఆకారంలో నిలబడ్డారు.
► తెల్లవారుజామున కురిసిన వర్షం వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చింది.
అమరవీరులకు సలాం
ఢిల్లీలోని ఇండియా గేట్ వద్దనున్న అమర్‌జవాన్ జ్యోతి వద్ద నివాళులర్పిస్తున్న రాష్ట్రపతి కోవింద్
వందనం ఆసేతు హిమాచలం
జమ్మూలో జరిగిన స్వాతంత్య్రదిన వేడుకల్లో అలరించిన పాఠశాల విద్యార్థుల ప్రదర్శన
భారీ త్రివర్ణం
ముంబైలోని హిరానందాని గార్డెన్స్‌లో భారీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్న ప్రజలు
తల్లీ భారతి వందనం
మహారాష్ట్ర కొల్హాపూర్‌లోని ఓ పాఠశాలలో విద్యార్థులతో కలిసి జెండా వందనం చేస్తున్న నటి ఊర్మిళ మతోండ్కర్
Comments
Please login to add a commentAdd a comment