Key Quotes From PM Modi’s 10th Independence Day Speech - Sakshi
Sakshi News home page

మరో వెయ్యేళ్లు భారత్‌ వెలుగుతూనే ఉంటుంది. పంద్రాగస్టు వేడుకల్లో ప్రధాని మోదీ

Published Tue, Aug 15 2023 10:06 AM | Last Updated on Tue, Aug 15 2023 12:58 PM

PM Modis 10th Independence Day Speech  - Sakshi

న్యూఢిల్లీ: భారత దేశ 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి త్రివిధ దళాధిపతులు, క్యాబినెట్ మంత్రులు, రాజకీయ నాయకులు, అధికారులతో పాటు వివిధ రంగాలకు చెందిన ముఖ్య అతిధులు హాజరయ్యారు. వరుసగా పదోసారి ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ కార్యక్రమం ప్రారంభానికి ముందు రాజ్ ఘాట్ వద్ద స్వాతంత్య్ర సమరయోధలకు నివాళులు అర్పించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల ముందు జరుగుతున్న స్వాతంత్య్ర వేడుకల కావడంతో జాతినుద్దేశించి ప్రధాని చేసిన ప్రసంగంలో కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు.    

దేశ ప్రజలందరికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మొదటగా మణిపూర్ అంశాన్ని ప్రస్తావిస్తూ దేశం మణిపూర్‌ ప్రజలకు అండగా ఉంటుందన్నారు. ఈశాన్య రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఇప్పుడిప్పుడే మణిపూర్‌లో పరిస్థితులు మెరుగుపడుతున్నాయని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ దేశం స్వాతంత్య్రం కోసం ఎందరో మహానుభావులు ప్రాణ త్యాగం చేశారు. వారందరి త్యాగఫలమే ఈ స్వాతంత్య్రం. ఈ సందర్బంగా ప్రపంచ దేశాలు భారత దేశం వైపు చూస్తున్నాయని గడిచిన పదేళ్లలో భారత్‌ ఎంతో వేగంగా అభివృద్ధి చెందిందన్నారు. 

ఈ పదేళ్లలో భారత దేశ గొప్పతనాన్ని ప్రపంచం గుర్తిస్తోంది. శాటిలైట్‌ రంగంలో దూసుకుపోతున్నాం, రాబోయే కాలాన్ని సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాసిస్తోంది. 30 ఏళ్ల లోపు యువతే భారత్‌కు దిశానిర్దేశం చేయాలి. సాంకేతికంగానే కాదు వ్యవసాయ రంగంలోనూ దేశం చాలా అభివృద్ధి చెందుతోందని అన్నారు. నారీ శక్తి, యువశక్తి భారత్‌కు బలమని భారత్‌లో యువశక్తి ఎంతో అద్భుతంగా ఉందని అన్నారు. డెమోగ్రఫీ, డెమోక్రసీ, బయోడైవర్సిటీ ఈ మూడు అంశాలు భారత దేశానికి ఎంతో ముఖ్యమైనవి. టెక్నాలజీ విషయంలో భారత్‌ ఎంతో మెరుగుపడి డిజిటల్‌ ఇండియా దిశగా భారత్‌ దూసుకెళ్తోన్నట్లు తెలిపారు. క్రీడా రంగంలో సైతం యువత ప్రపంచ పాఠం మీద తన  సత్తా చాటుతోంది. అలాగే సాంకేతికంగా స్టార్టప్స్‌ రంగంలో భారత్‌ టాప్‌-3లో ఉంది. ఇక ఈ ఏడాది జరగబోయే ప్రతిష్టాత్మక జీ-20  సమావేశానికి ఆతిధ్యమిచే అరుదైన అవకాశం భారత్‌కు లభించిందని అన్నారు.

కేవలం అవినీతి రాక్షసి వలననే దేశం వెనక్కు వెళ్లిందని అందుకే ప్రజలు సుస్థిరమైన అవినీతిరహిత ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. సుస్థిర ప్రభుత్వంతోనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. పేద, మధ్య తరగతి వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం ఎనలేని కృషి చేసిందని.. పీఎం సహాయనిధి పథకం ద్వారా 50 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. సైన్యంలో వన్‌ ర్యాంక్‌-వన్‌ పెన్షన్‌ అమలు చేస్తూ ప్రజలకు అవినీతి రహిత పాలన అందిస్తున్నామని దేశ ఆర్థిక వ్యవస్త బాగుంటేనే దేశం బాగుంటుందని రూ. 4 లక్షల కోట్లతో పేదలకు ఇళ్లు నిర్మించామని రూ. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చినట్లు తెలిపారు. 

కరోనా లాంటి అక్షిత సమయంలో ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచిందని అన్నారు. కరోనా మనకు ఎన్నో పాఠాలను నేర్పింది. కరోనా సంక్షోభం తర్వాత ప్రపంచానికి భారత దేశం దిక్సూచిగా మారింది. కరోనా సమయంలో ఎన్నో కఠిన సవాళ్లను ఎదుర్కొని ముందుకెళ్లాం ప్రపంచాన్ని మార్చడంలో భారత్‌ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తోందని అన్నారు. 

భిన్నత్వంలో ఏకత్వమే భారత్‌ బలమని ప్రతి నిర్ణయంలో దేశ ప్రగతికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. దేశంలో సుస్థిరమైన, శక్తివంతమైన ప్రభుత్వం ఉంది. గత పదేళ్లలో ఎన్నో కీలక సంస్కరణలు తీసుకురావడంతో అన్ని రంగాల్లో దేశం ముందుకు వెళ్తోందన్నారు. ఇక వైద్య రంగానికి వస్తే జన ఔషధితో ప్రజలందరికీ  చౌకగా మందులు అందజేస్తున్నామని, అందుకు వీలుగా జన ఔషధి కేంద్రాల సంఖ్య 10 వేల నుంచి 25 వేలకు పెంచామన్నారు. జన్‌ధన్‌ ఖాతాలో పేదల బతుకుల్లో వెలుగులు నింపామని తెలిపారు. 

మారుమూల గ్రామాలకు విద్యుత్‌ సదుపాయం కల్పించామన్నారు. దేశ  ప్రజలందరికీ ఇంటర్నెట్‌ను అందుబాలోకి తీసుకువచ్చామని వచ్చే ఐదేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరిస్తుందని ఆర్థిక వ్యవస్థలో అమెరికా, చైనా తర్వాత భారత దేశమే  ఉంటుందని భారత్‌ అభివృద్ధిపై నాకు పూర్తి విశ్వాసం ఉందని చెబుతూ ప్రసంగాన్ని ముగించారు. 

ఇది కూడా చదవండి: అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు: ప్రధాని మోదీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement