ద్వైపాక్షిక సంబంధాలకు బ్రేక్‌! | Pakistan snaps diplomatic ties with India over scrapping of Article 370 | Sakshi
Sakshi News home page

ద్వైపాక్షిక సంబంధాలకు బ్రేక్‌!

Published Thu, Aug 8 2019 3:59 AM | Last Updated on Thu, Aug 8 2019 12:37 PM

Pakistan snaps diplomatic ties with India over scrapping of Article 370 - Sakshi

ఇస్లామాబాద్‌లో పాక్‌ జాతీయ భద్రతా కమిటీ సమావేశంలో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ/శ్రీనగర్‌/షోపియాన్‌/ఇస్లామాబాద్‌: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు, స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ని కేంద్రం రద్దుచేయడంపై పాకిస్తాన్‌ ప్రతీకార చర్యలకు దిగింది. పాక్‌లో పనిచేస్తున్న భారత రాయబారి అజయ్‌ బిసారియాను దేశం నుంచి బహిష్కరించింది. అలాగే భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలన్నింటినీ తెంచుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని నిలిపివేయాలని నిర్ణయించింది. ఇస్లామాబాద్‌లో ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ అధ్యక్షతన బుధవారం జరిగిన జాతీయ భద్రతా కమిటీ(ఎన్‌ఎస్‌సీ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీకి ఇమ్రాన్‌తో పాటు పాక్‌ విదేశాంగ, హోం మంత్రులు, ఆర్థిక సలహాదారు, త్రివిధ దళాధిపతులు, ఐఎస్‌ఐ చీఫ్, కశ్మీర్‌ వ్యవహారాల మంత్రి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. కాగా, అజయ్‌ బిసారియా ఎన్నిరోజుల్లోగా దేశం విడిచిపెట్టిపోవాలో పాక్‌ స్పష్టత ఇవ్వలేదు.

భద్రతామండలిని ఆశ్రయిస్తాం
ఎన్‌ఎస్‌సీ సమావేశం అనంతరం పాక్‌ విదేశాంగ మంత్రి షా మెహమూద్‌ ఖురేషీ మీడియాతో మాట్లాడుతూ..‘మా దౌత్యాధికారులు ఇకపై ఢిల్లీలో(భారత్‌) ఉండబోరు. అలాగే పాక్‌లో భారత రాయబారి అజయ్‌ బిసారియాను వెనక్కి పంపాలని నిర్ణయించాం. జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొడుతూ, ఆర్టికల్‌ 370ను రద్దుచేస్తూ భారత్‌ ఏకపక్షంగా చట్టవిరుద్ధమైన నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో భారత్‌తో కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందాలు, ఇతర ముఖ్యమైన విషయాల్లో కుదిరిన పరస్పర అవగాహన, ప్రోటోకాల్స్‌ను సమీక్షిస్తాం. అంతేకాదు.. జమ్మూకశ్మీర్‌ విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఐక్యరాజ్యసమితి, భద్రతా మండలి దృష్టికి తీసుకెళతాం’ అని తెలిపారు. తమ గగనతలాన్ని సెప్టెంబర్‌ 5 వరకూ పాక్షికంగా మూసేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ విషయంలో తాము చైనాతోనూ సంప్రదింపులు జరుపుతామని చెప్పారు. ప్రస్తుతం భారత రాయబారి అజయ్‌ బిసారియా ఇస్లామాబాద్‌లో పనిచేస్తుండగా, భారత్‌లో పాక్‌ రాయబారి మొయిన్‌–ఉల్‌–హక్‌ ఇంకా బాధ్యతలు స్వీకరించలేదు.

ఆగస్టు 15.. ‘బ్లాక్‌ డే’
భారత్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచేందుకు పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందులోభాగంగా జమ్మూకశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘనను ప్రపంచదేశాల దృష్టికి తీసుకెళ్లేందుకు అన్ని దౌత్యమార్గాలను వినియోగించుకోవాలని ఆదేశించారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే)లో భారత్‌ ఎలాంటి దుశ్చర్యకు దిగినా దీటుగా తిప్పికొట్టేందుకు వీలుగా మరింత అప్రమత్తంగా ఉండాలని పాక్‌ సైన్యానికి సూచించారు. పాక్‌ స్వాతంత్య్ర దినోత్సవమైన ఆగస్టు 14ను కశ్మీరీలకు సంఘీభావ దినంగా జరుపుకోవాలని ఎన్‌ఎస్‌సీ భేటీలో నిర్ణయించినట్లు ఇమ్రాన్‌ ఖాన్‌ తెలిపారు. అలాగే భారత స్వాతంత్య్ర దినోత్సవమైన ఆగస్టు 15ను ‘బ్లాక్‌ డే’గా జరుపుకుంటామని ప్రకటించారు. మరోవైపు భారత్‌ చర్యలను తాము ఖండిస్తున్నామనీ, కశ్మీరీలకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని పాక్‌ పార్లమెంటు ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది.

ఐక్యరాజ్యసమితి ఆందోళన
జమ్మూకశ్మీర్‌ విషయంలో భారత్‌ తీసుకున్న చర్యలపై తాము ఆందోళన చెందుతున్నామని ఐక్యరాజ్యసమితి తెలిపింది. దీనివల్ల రాష్ట్రంలో మానవహక్కుల ఉల్లంఘనలు మరింత తీవ్రమవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇరుపక్షాలు చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ఐరాస ప్రధాన కార్యదర్శి గ్యుటెరస్‌ కోరుకుంటున్నట్లు ఆయన అధికార ప్రతినిధి స్టెఫేన్‌ డుజర్రిక్‌ తెలిపారు. మరోవైపు భారత్‌–పాక్‌ మధ్య మిలటరీ ఉద్రిక్తత తలెత్తకుండా సత్వరం చర్చలు జరపాల్సిన అవసరముందని అమెరికా అభిప్రాయపడింది. ‘ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులను మెరుగుపర్చేందుకు, అన్నిపక్షాలు చర్చలు జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారత్‌–పాకిస్తాన్‌ల మధ్య చర్చలు ప్రారంభమవ్వాలనీ, ఉద్రిక్తతలు తగ్గాలని అమెరికా కోరుకుంటోంది’ అని వైట్‌హౌస్‌లోని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఆర్టికల్‌ 370 రద్దు విషయంలో భారత ప్రభుత్వం తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని స్పష్టం చేశారు.

బలగాల అధీనంలో మసీదులు
జమ్మూకశ్మీర్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా బలగాలు డేగకళ్లతో పహారా కాస్తున్నాయి. ప్రజలను వేర్పాటువాదులు మైక్‌ల ద్వారా రెచ్చగొట్టకుండా శ్రీనగర్, దానిచుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా మసీదులను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ సందర్భంగా ఎలాంటి అల్లర్లు జరగకుండా మాజీ ముఖ్యమంత్రులు ఒమర్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ సహా 560 మందిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, కశ్మీర్‌లోయలో భద్రతాబలగాలు–ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణ పలువురికి బుల్లెట్‌ గాయాలు కాగా, ఓ యువకుడు పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో జీలంనదిలో దూకడంతో ప్రాణాలు కోల్పోయాడు. జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీని ఓ జైలు గదిలో ఒంటరిగా బంధించినట్లు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో సోమవారం బక్రీద్‌ పండుగ సందర్భంగా అధికారులు నిషేధాజ్ఞలు ఎత్తివేస్తారా? లేక కొనసాగిస్తారా? అనే విషయంలో ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు.

జమ్మూ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులు

కశ్మీరీలతో దోవల్‌ ముచ్చట్లు
జమ్మూకశ్మీర్‌లో హైటెన్షన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు(ఎన్‌ఎస్‌ఏ) అజిత్‌ దోవల్‌ బుధవారం షోపియాన్, శ్రీనగర్‌లో పర్యటించారు. పోలీస్, ఆర్మీ ఉన్నతాధికారులతో సమావేశమై శాంతిభద్రతలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఉగ్రవాది బుర్హాన్‌వనీ స్వస్థలం షోపియాన్‌లో దోవల్‌ స్థానికులతో కలిసి సంప్రదాయ కశ్మీరీ వంటకం ‘వజ్‌వాన్‌’ను రుచిచూశారు. స్థానిక ప్రజలతో ఈ సందర్భంగా దోవల్‌ మాట్లాడుతూ..‘పరిస్థితి ఎలా ఉంది? ప్రజలు ఏమనుకుంటున్నారు?’ అని అడిగారు. దీంతో ఓ స్థానికుడు అంతా బాగుందని జవాబిచ్చారు. వెంటనే దోవల్‌ స్పందిస్తూ..‘అవును.. సమస్యలన్నీ సమసిపోతాయి. అందరూ ప్రశాంతంగా బతకాలి. దేవుడు ఏది చేసినా మనమంచికే. మీ భద్రత, సంక్షేమం మా బాధ్యత. మీ భవిష్యత్‌ తరాల అభివృద్ధి, సంక్షేమం కోసమే మేం ఆలోచిస్తున్నాం’ అని తెలిపారు. అనంతరం సీఆర్పీఎఫ్‌ బలగాలను కలుసుకున్న దోవల్‌..‘వామపక్ష తీవ్రవాదం నుంచి కశ్మీర్‌లో ఉగ్రవాదం వరకూ సీఆర్పీఎఫ్‌ బలగాలపై నిశ్చింతగా ఆధారపడగలనని భారత్‌ నమ్ముతోంది’ అని వ్యాఖ్యానించారు.

షోపియాన్‌లో స్థానికులతో మాట్లాడుతున్న అజిత్‌ దోవల్‌

భారత్‌కు మద్దతుగా పాక్‌లో బ్యానర్లు
ఇస్లామాబాద్‌: అత్యంత కట్టుదిట్టమైన భద్రత గల రెడ్‌జోన్‌తో సహా పాకిస్తాన్‌ రాజధానిలోని పలు ప్రాంతాల్లో భారత్‌కు మద్దతుగా బ్యాన ర్లు దర్శనమిచ్చాయి. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఆ బ్యానర్లలో పేర్కొన్నారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు వాటిని తొలగించారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. అలాగే పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌ దేశాలతో కూడిన ‘అఖండ భారత్‌’ మ్యాప్‌ను బ్యానర్లలో ప్రదర్శించారు. ‘ఈరోజు జమ్మూకశ్మీర్‌ను తీసుకున్నారు. రేపు బలూచిస్తాన్‌.. ఆ తర్వాత పీవోకేను స్వాధీనం చేసుకుంటారు. అఖండ హిందుస్తాన్‌ కలను దేశ ప్రధాని సాకారం చేస్తారన్న పూర్తి నమ్మకం నాకుంది’ అని శివసేన నేత సంజయ్‌ రౌత్‌ చేసిన వ్యాఖ్యలను కూడా ఆ బ్యానర్లలో పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement