శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఇంకా కొన్ని చోట్ల నిషేదాజ్ఞలు కొనసాగుతున్న వేళ విపక్షాల పర్యటన ఉత్కంఠకు దారితీస్తోంది. ఈ పరిణామం అక్కడి అధికారులను, సిబ్బందిని కలవర పెడుతోంది. విపక్షాల అగ్రనాయకుల పర్యటన శాంతి స్థాపనకు తీవ్ర విఘాతం కలిగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు మరికొన్ని జాతీయ పార్టీల నేతలు నేడు కశ్మీర్‌లో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ విభజన అనంతరం అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లోయలో పరిస్థితులు ప్రశాతంగా ఉన్నాయని, అవసమరయితే స్వయంగా తెలుసుకునేందుకు లోయలో పర్యటించాలని గతంలో గవర్నర్ సత్యపాల్ రాహుల్‌కు ఆహ్వానించారు. రాహుల్ గాంధీ అందుకు అంగీకరించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో శనివారం కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, ఆర్‌జేడీ, ఎన్‌సీపీ, టీఎంసీ, డీఎంకేకు చెందిన విపక్ష లోయలో బృందం పర్యటించనుంది. ఈ బృందంలో రాహుల్ సహా గులాం నబీ ఆజాద్, కేసీ.వేణుగోపాల్, ఆనంద్ శర్మ, డి.రాజా, సీతారాం ఏచూరి, సహా ఇతర నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. వీరింత ఇప్పటికే ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నట్లు సమాచారం. అయితే కశ్మీర్‌లో పర్యటించేందుకు మాత్రం అక్కడి సిబ్బంది అనుమతి ఇవ్వలేదు. విమానాశ్రయం దాటి రావడానికి వీళ్లేదని తేల్చిచెప్పాయి. వారు పర్యటించే ప్రాంతాల్లో ముందస్తు చర్యల్లో భాగంగా 144 సెక్షన్‌ను అమలు చేశారు. కశ్మీర్ మాజీ సీఎం, సీనియర్ నేత గులాంనబీ అజాద్ ఇంటి ముందు భారీ ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు. దీనిపై ఆయన తీవ్రంగా స్పందించారు. లోయలో వాతావరణం ప్రశాతంగా ఉంటే తమపై ఇన్ని ఆంక్షలు ఎందుకని ప్రశ్నించారు. అమాయక కశ్మీరీ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆయన విమర్శించారు.
మరోవైపు విపక్ష నేతల పర్యటనపై అధికార బీజేపీ తీవ్రంగా మండిపడుతోంది. ప్రశాతంగా ఉన్న కశ్మీర్‌లో అల్లర్లు సృష్టించేందుకే అక్కడ పర్యటిస్తున్నారని తీవ్ర స్థాయిలో విరుచుపడింది. మరోవైపు వీరి పర్యటన నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం.. లోయలో శాంతి, భద్రతల పునరుద్ధరణ కొనసాగుతున్న వేళ నాయకులు ఇక్కడ పర్యటించే ప్రయత్నం చెయ్యొద్దని కోరింది. అలాగే అనేక ప్రాంతాల్లో ఇంకా నిషేదాజ్ఞలు కొనసాగుతున్నాయని.. ఈ నేపథ్యంలో తాజా పర్యటన.. నిబంధనలు ఉల్లంఘించినట్లే అవుతుందని ప్రకటించింది. శాంతి, భద్రతల పునరుద్ధరణకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని పర్యటనను రద్దు చేసుకోవాలని అధికారులు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment