సాక్షి, న్యూఢిల్లీ : ‘గత 600 సంవత్సరాల్లో మొట్టమొదటి సారిగా ఈద్, శుక్రవారం సందర్భంగా ముస్లింల ప్రార్థనలు లేకుండా పోయాయి’ అని ఇస్లాం మత గురువు హజీ బిలాల్ అహద్ అమ్దాని వ్యాఖ్యానించారు. ఆయన శ్రీనగర్‌లోని జేలం నదీ ఒడ్డునగల 14వ శతాబ్దం నాటి ‘ఖాంక్ ఏ మౌలా’కు ఆయన డిప్యూటి ఇమామ్‌గా పనిచేస్తున్నారు. ‘ఎన్నో ఆందోళనల సందర్భంగా కూడా ఇలా ప్రార్థనలు జరగకుండా ఉన్న రోజు లేదు. అంతెందుకు, మిలిటెన్సీ ఎక్కువగా ఉన్న 1989లో నలువైపుల నుంచి తుపాకీ తూటాలు దూసుకొచ్చినప్పుడు కూడా ఈ మౌలాలో ప్రార్థనలు నిలిచిపోలేదు. రాజ్యాంగంలోని 370 అధికరణను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న ఆగస్టు 5వ తేదీ నుంచి నేటి వరకు కూడా ఈద్ రోజునగానీ, శుక్రవారం నాడుగానీ మౌలాలో సామూహిక ప్రార్థనలకు స్థానిక అధికారులు అనుమతించలేదు’ అని ఆయన గురువారం స్థానిక మీడియాతో వ్యాఖ్యానించారు.
‘హమ్ క్యా చాహ్‌తే హై, ఆజాదీ’ అంటూ 1989లో మిలిటెంట్లు జరిపిన ఆందోళనలో అనేక మంది మరణించారు. 1947లో కశ్మీర్‌లో జరిగిన మత కలహాల్లో కూడా వందలాది మంది మరణించారు. ఈ రెండు సందర్భాల్లోనే కాకుండా 1975లో కశ్మీర్‌లో ప్రధాన మంత్రి వ్యవస్థను రద్దు చేసి షేక్ అబ్దుల్లాను అరెస్ట్ చేసినప్పుడుగానీ, 1998 కశ్మీర్‌లో సైన్యం సద్భావన యాత్ర నిర్వహించినప్పుడుగానీ ప్రార్థనలు నిలిచిపోలేదన్నది అమ్దాని ఉద్దేశం.
కశ్మీర్‌లో అప్రకటిత కర్ఫ్యూ అమల్లోకి వచ్చి సెప్టెంబర్ 5వ తేదీ నాటికి సరిగ్గా నెల రోజులు గడిచాయి. అయినప్పటికీ శ్రీనగర్‌తోపాటు పలు పట్టణ ప్రాంతాల్లో స్మశాన నిశబ్దం కొనసాగుతోంది. ల్యాండ్, మొబైల్ టెలిఫోన్ సర్వీసులను, ఇంటర్నెట్ సదుపాయాలను ఇంతవరకు పునరుద్ధరించలేదు. రాష్ట్రం నుంచి ఎవరు ఇతర రాష్ట్రాలకు వెళ్లాలన్నా, ఇతర రాష్ట్రాల నుంచి ఎవరు కశ్మీర్‌లోకి రావాలన్నా ముందస్తు అనుమతి తీసుకోవాలన్న అప్రకటిత ఆంక్ష కొనసాగుతోంది. ప్రార్థనలు నిర్వహించకుండా కొన్నిచోట్ల ఇమామ్‌లను అరెస్ట్ చేసినట్లు అమ్దాని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను శ్రీనగర్ పోలీసు ఉన్నతాధికారి ఖండించారు. ఇతర కేసుల విషయంలో కొందరు ఇమామ్‌లను అరెస్ట్ చేసిన మాట వాస్తవమేనని ఆయన చెప్పారు. అయితే తాజా పరిణామాలకు, వారి అరెస్ట్‌లకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.
అయితే తనను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో ఇప్పటికీ అర్థం కావడం లేదని శ్రీనగర్‌లోని అగ సయ్యద్ హజీ హాసన్ మందిరం ఇస్లాం గురువు అగా సయ్యద్ ఐజాజ్ రిజ్వీ తనను కలిసిన మీడియా ప్రతినిధితో వ్యాఖ్యానించారు. ఆయన్ని ఆగస్టు 22వ తేదీన ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. జడిబాల్‌లోని మరో మసీదు ఇమామ్ ఇమ్రాన్ రెజా అన్సారీతోపాటు మరొ కొందరు ఇమామ్‌లను సీఆర్‌పీఎఫ్ జవాన్లతో కలిసి స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారట. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అరెస్ట్ చేస్తున్నామని మాత్రమే పోలీసులు వారికి చెప్పారట. శ్రీనగర్‌లోని పలు చారిత్రక మసీదుల్లో కూడా శుక్రవారం నాటి ప్రార్థనలు నిలిచిపోయాయి. ఇప్పుడు వాటిల్లో పావురాల రెక్కల చప్పుడు మినహా మరే ఇతర శబ్దాలు వినిపించడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment