లోక్‌సభలో ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: పార్లమెంటు నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వీధుల్లో నిరసనలు, గృహదహనాలకు దిగితే చివరికి అది అరాచకత్వానికి దారి తీస్తుందని ప్రధాని మోదీ ఘాటుగా హెచ్చరించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్) వ్యతిరేక నిరసనల్ని విపక్షాలే రెచ్చగొడుతూ లేనిపోని భయాందోళనలను సృష్టిస్తున్నాయన్నారు. సీఏఏపై విపక్షాల వైఖరిని పాకిస్తాన్‌తో పోల్చారు. కొన్ని దశాబ్దాలుగా భారత్‌లో ముస్లింలపై పాక్ ఇదే విధంగా బురద జల్లిందన్నారు. బడ్జెట్ సమావేశాల తొలిరోజు పార్లమెంటు ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై గురువారం ఉభయ సభల్లోనూ జరిగిన చర్చకు మోదీ బదులిచ్చారు.
లోక్‌సభలో గంటా 40 నిమిషాల సేపు మాట్లాడిన మోదీ సీఏఏ దేశ పౌరులపైనా, మైనార్టీల ప్రయోజనాలపైనా ఎలాంటి వ్యతిరేక ప్రభావాన్ని చూపించదని పునరుద్ఘాటించారు. రాజ్యసభలో ఎన్‌పీఆర్‌పై ఎక్కువగా మాట్లాడారు. ప్రధాని ప్రసంగం అనంతరం ఉభయ సభలు ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించాయి. ఎన్‌పీఆర్‌కి సవరణలు చేపడితేనే నిజమైన నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు. జన గణన, జనాభా పట్టిక సర్వసాధారణంగా జరిగే పరిపాలనాపరమైన ప్రక్రియ అని, ఇప్పుడే దీనిపై ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందన్న విపక్షాల దాడిని మోదీ తిప్పి కొట్టారు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీలను ముస్లింలుగా చూస్తే, తాము వారిని భారతీయులుగా చూస్తున్నామని చెప్పారు.
చారిత్రక నిర్ణయాలు తీసుకున్నాం
దేశ ప్రజలు తమ అయిదేళ్ల పని తీరు చూశాక బీజేపీపై నమ్మకం ఉంచి అధికారాన్ని తిరిగి అప్పగించారన్నారు. అందుకే పాలనలో వేగవంతం, విస్తృతి పెంచడం , సమస్యల్ని పరిష్కరించడం, నిబద్ధతతో నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తున్నామని మోదీ చెప్పారు. పాత విధానాలతో ముందుకు వెళితే ఆర్టికల్ 370 రద్దు అయ్యేది కాదని, ముస్లిం మహిళలు ట్రిపుల్ తలాక్‌తో బాధల్లోనే ఉండేవారని అన్నారు. ఇంకా పాత ఆలోచనలే చేస్తే రామజన్మభూమి వివాదమూ పరిష్కారమయ్యేది కాదు, కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్ సాకారమయ్యేది కాదు, భారత్, బంగ్లాదేశ్ మధ్య భూ ఒప్పందం కుదిరేది కాదని ప్రధాని చెప్పుకొచ్చారు.
ఆర్థిక లోటును నియంత్రిస్తున్నాం
ఆర్థిక లోటును నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ధరల పెరుగుదలను నియంత్రిస్తున్నామని మోదీ చెప్పారు. స్థూల ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉందని తెలిపారు. మేకిన్ ఇండియాపై విదేశాలకు నమ్మకం కుదిరి ఎఫ్‌డీఐలు బాగా పెరిగాయన్నారు. ఎన్డీయే హయాంలో వ్యవసాయ బడ్జెట్‌ను అయిదు రెట్లు ఎక్కువ చేశామని రూ. 27 వేల కోట్లు ఉన్నదానిని ప్రస్తుతం రూ.1.5 లక్షల కోట్లు చేశామన్నారు.
ఈశాన్యంలో అభివృద్ధి
నిత్యం రక్తపాతం, హింసతో సతమతమయ్యే ఈశాన్య రాష్ట్రా ల్లో వివిధ రంగాల్లో అభివృద్ధికి బాటలు వేశామన్నారు. బోడో ఒప్పందాన్ని కుదుర్చుకోవడం ద్వారా శాంతి స్థాపన జరుగుతోందని, పెట్టుబడులకు మార్గం సుగమం అయిందన్నారు.
గాంధీ మాకు జీవితం
ప్రధాని మోదీ లోక్‌సభ ఆవరణలోకి రాగానే బీజేపీ సభ్యులు జై శ్రీరామ్.. అంటూ నినాదాలు చేస్తే, దానికి కౌంటర్‌గా కాంగ్రెస్ సభ్యులు మహాత్మా గాంధీ జిందాబాద్ అంటూ నినదించారు. సభలో మోదీ ప్రసంగం మొదలు కాగానే కాంగ్రెస్ సభ్యులు మహాత్ముడిని కీర్తిస్తూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి ఇది ట్రయలర్ మాత్రమే అంటూ వ్యంగ్యబాణాలు విసిరారు. దీంతో మోదీ ఆయనకి చురకలంటించారు. ‘మీకు మహాత్మాగాంధీ ట్రయలర్ కావొచ్చు.. మాకు గాంధీయే జీవితం’ అంటూ బదులిచ్చారు.
రాహుల్ ట్యూబ్‌లైట్
తన ప్రసంగానికి విపక్షాలు అడ్డు తగిలినప్పుడల్లా మోదీ వారిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రసంగం మధ్యలో రాహుల్ లేచి ఉద్యోగాల గురించి ప్రస్తావించగానే, తాను మాట్లాడటం మొదలు పెట్టిన 40 నిమిషాల తర్వాత స్పందించడంతో రాహుల్‌ని ట్యూబ్‌లైట్ అంటూ ఎదురు దాడికి దిగారు. ఆరు నెలల్లో యువత మోదీ వీపుని కర్రలతో వాయిస్తారంటూ రాహుల్ వ్యాఖ్యానించారని వచ్చిన వార్తల్ని ప్రధాని ప్రస్తావించారు. రాహుల్ పేరు చెప్పకుండా.. ‘ప్రతిపక్ష ఎంపీ ఒకరు యువత నా వీపుని విమానం మోత మోగిస్తామని అన్నారట. అందుకే మరింత సమయం సూర్యనమస్కారాలకు సమయం కేటాయిస్తా. అప్పుడు ఎలాంటి దూషణలనైనా ఎదుర్కొనే సామర్థ్యం వస్తుంది’ అని ప్రధాని నరేంద్ర మోదీ సెటైర్లు వేశారు.
గీత గీసింది నెహ్రూయే
సీఏఏని సమర్థించుకునే క్రమంలో తొలి ప్రధాని నెహ్రూ మాటల్ని ఉదహరించారు. దేశ విభజన తర్వాత సరిహద్దుల నుంచి మన దేశంలోకి వచ్చిన వారిని హిందూ శరణార్థులు, ముస్లిం వలసదారులుగా నెహ్రూయే విభజించి చూశారని మోదీ తెలిపారు. నాటి అస్సాం సీఎం గోపీనాథ్ బర్దోలియాకి నెహ్రూ రాసిన లేఖలో అంశాలను మోదీ ప్రస్తావించారు. పాక్ నుంచి భారత్‌కొచ్చిన వారిలో హిందూ శరణార్థులకు, ముస్లిం వలసదారులకు మధ్య తేడా చూపాలని, పశ్చిమ పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్ (ఇప్పుడు బంగ్లాదేశ్) నుంచి వచ్చే మైనార్టీలను భారత్ కాపాడాలని లేఖలో ఉందన్నారు. అవసరమైతే హిందూ శరణార్థులకు పౌరసత్వం కల్పించేలా చట్టానికి సవరణలు చేద్దామని నెహ్రూ ఆ లేఖలో పేర్కొన్నారని మోదీ చెప్పారు. మరి అలా మాట్లాడిన నెహ్రూ మతవాదా? ఆయన హిందూ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారా అని కాంగ్రెస్‌ను ప్రశ్నించారు ‘నెహ్రూ నాటి పాక్ ప్రధాని లియాఖత్ అలీఖాన్ మధ్య కుదిరిన ఒప్పందంలో పౌరులందరినీ చేర్చకుండా, మైనార్టీల ప్రయోజనాలను ఇరుదేశాల్లో కాపాడాలని ఎందుకు అంగీకారానికి వచ్చారని నిలదీశారు.
ఏపీ విభజనను ప్రజలు మర్చిపోరు
పౌరసత్వ చట్టం సవరణలపైగానీ ఆర్టికల్ 370 రద్దు సమయంలో గానీ తమతో ఎలాంటి చర్చ జరపకుండానే ప్రభుత్వం ముందుకెళ్లిందంటూ ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలకు ప్రధాని స్పందిస్తూ.. ‘ఇది ఎంత మాత్రం నిజం కాదు. వీటిపై సవివరమైన చర్చ జరిగిన విషయం యావత్తు జాతికి తెలుసు. ప్రభుత్వ నిర్ణయాలకు అనుకూలంగా సభ్యులు ఓటు వేశారు’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన 2014లో యూపీఏ హయాంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ విభజనను ప్రస్తావించారు. ‘ప్రజలు అంత తేలిగ్గా ఏదీ మర్చిపోరు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనకు దారి తీసిన పరిస్థితులను ఈ సందర్భంగా ప్రతిపక్ష నేతకు గుర్తు చేస్తున్నా. ఆ సమయంలో సభను దిగ్బంధంలో ఉంచారు. టీవీల్లో సభా కార్యకలాపాల ప్రసారాలు నిలిపివేసి ఆంధ్రప్రదేశ్ విభజనను హడావుడిగా ప్రకటించారు’ అని తెలిపారు.
నిరుద్యోగంపై మాట్లాడరా?: రాహుల్
దేశం ఎదుర్కొంటున్న అతి ప్రధానమైన నిరుద్యోగ సమస్య ప్రధాని మోదీకి కనిపించలేదా అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. నెహ్రూ, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అంశాలను లేవనెత్తి మోదీయే ప్రజల్ని గందరగోళానికి గురి చేస్తున్నారని ఆరోపించారు. యువతకు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు కానీ అయిదున్నరేళ్లు గడిచిపోతున్నా ఆ హామీ నెరవేర్చలేదని అన్నారు. వంద నిమిషాల సేపు మాట్లాడిన ప్రధానికి గత ఏడాది కోటి మంది యువత ఉద్యోగాలు కోల్పోతే దానిపై మాట్లాడడానికి సమయం దొరకలేదా అని రాహుల్ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment