కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడిస్తున్న మంత్రులు గోయల్, జవదేకర్
సాక్షి, న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టంపై ఒకవైపు తీవ్రస్థాయిలో ఆందోళనలు చెలరేగుతున్న తరుణంలోనే.. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ మంగళవారం జాతీయ జనాభా పట్టిక (నేషనల్ పాపులేషన్ రిజిస్టర్– ఎన్పీఆర్)ను తాజాగా సవరించేందుకు(అప్‌డేట్) రూ. 3,941.35 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. 2020 ఏప్రిల్– సెప్టెంబర్ మధ్య జరిగే ‘జనగణన – 2021’ తొలి దశతో పాటు ఎన్పీఆర్‌ను అప్‌డేట్ చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది.
దేశంలోని ‘సాధారణ నివాసుల’ వివరాలను ఈ ఎన్‌పీఆర్‌లో నమోదు చేస్తారు. ఆరు నెలలు లేదా అంతకన్నా ఎక్కువ కాలం పాటు ఒక చోట నివాసం ఉన్న వ్యక్తి లేదా కనీసం రానున్న ఆరునెలలు ఒక ప్రాంతంలో నివాసం ఉండాలని నిర్ణయించుకున్న వ్యక్తిని ‘సాధారణ నివాసి’గా పరిగణిస్తారు. మొదట 2010లో జాతీయ జనాభా పట్టికను రూపొందించగా, 2015లో ఇంటింటి సర్వే ద్వారా దీన్ని అప్‌డేట్ చేశారు. 2021 జనాభా గణనకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో.. జనాభా పట్టికను సవరించేందుకు తాజాగా నిర్ణయం జరిగింది. అస్సాం మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ కార్యక్రమం జరగనుంది.
ఎన్నార్సీతో సంబంధం లేదు
ఎన్పీఆర్‌ను 2010లోనే రూపొందించారని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. యూపీఏ హయాంలో పౌరసత్వ చట్టం–1955 లోని నిబంధనల కింద 2010లోనే ఎన్పీఆర్ ప్రక్రియ ప్రారంభమైందని, 2015లో ఒకసారి అప్‌డేట్ అయిందని వివరించారు. అప్పుడు ఆధార్‌తో అనుసంధానం చేశారన్నారు. తాజాగా, ఆ జాబితాను అప్‌డేట్ చేస్తున్నామని వివరించారు. ఎన్పీఆర్ ఆధారంగానే ఎన్నార్సీ(జాతీయ పౌర పట్టిక) ప్రక్రియ చేపడ్తారన్న ఆందోళనలను ఆయన తోసిపుచ్చారు. ఎన్పీఆర్‌కు ఎన్సార్సీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీ నిర్ణయాలను మరో మంత్రి పియూష్ గోయల్‌తో కలిసి ఆయన వెల్లడించారు. ‘ఎన్‌పీఆర్ ప్రక్రియలో ఎలాంటి ధ్రువీకరణలు సమర్పించాల్సిన అవసరం లేదు. అలాగే బయోమెట్రిక్ ముద్రలు కూడా అవసరం లేదు. ఇదొక స్వీయ ధ్రువీకరణ వంటిదే. కేంద్ర సంక్షేమ పథకాలను అవసరమైన వారందరికీ చేర్చే లక్ష్యంతో ఈ ఎన్‌పీఆర్ ప్రక్రియ ఉంటుంది. గతంలో మాదిరిగా పెద్ద దరఖాస్తు నింపాల్సిన పనేమీ లేదు. మొబైల్ యాప్ ద్వారా సులువుగా నింపే వెసులుబాటు ఉంటుంది’ అని వెల్లడించారు. అయితే, జనగణన కమిషనర్ అధికారిక వెబ్‌సైట్లో మాత్రం ఎన్పీఆర్ కోసం బయోమెట్రిక్ వివరాలను కూడా సేకరిస్తామని ఉండటం గమనార్హం.
గతంలో తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఒడిశా తదితర రాష్ట్రాలు ఎన్పీఆర్ డేటాను సంక్షేమ పథకాల లబ్ధిదారులను గుర్తించేందుకు ఉపయోగించుకున్నాయని జవదేకర్ గుర్తు చేశారు. ఎన్పీఆర్ డేటాను ఆయుష్మాన్‌భారత్, ప్రధానమంత్రి ఆవాస్‌యోజన, ఉజ్వల, సౌభాగ్య తదితర కేంద్ర పథకాల లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ఉపయోగిస్తామన్నారు. పశ్చిమబెంగాల్, కేరళసహా కొన్ని బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలు ఎన్పీఆర్ కార్యక్రమంలో పాలు పంచుకోబోమని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేయగా.. ‘ఈ ప్రక్రియకు సంబంధించి అన్ని రాష్ట్రాలు నోటిఫికేషన్‌లను విడుదల చేశాయి. దీనికి సంబంధించి అధికారులకు శిక్షణనివ్వడం కూడా ప్రారంభించాయి’ అని జవదేకర్ సమాధానమిచ్చారు.
ఎన్నార్సీకి ఎన్పీఆర్‌తో లింక్: కాంగ్రెస్
ఎన్నార్సీకి ఎన్పీఆర్‌తో లింక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ చర్య రాజ్యాంగంలోని లౌకికభావనకు భంగకరమని కాంగ్రెస్ పేర్కొంది. ఎన్పీఆర్‌కు, ఎన్నార్సీకి ఏమాత్రం సంబంధం లేదంటూ హోం మంత్రి అమిత్‌షా చేస్తున్న ప్రకటన..ఎన్నార్సీపై పార్లమెంట్‌లో చర్చించలేదంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్య కంటే పెద్ద అబద్ధమని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ విమర్శించారు. ఎన్నార్సీకి మొదటి మెట్టు ఎన్‌పీఆర్ అంటూ హోం శాఖ తన వార్షిక నివేదికలో తెలిపిందన్నారు. 2021లో జనగణనతోపాటుగా ఎన్‌పీఆర్ చేపట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
‘జనగణన’కు ఆమోదం
దేశ జనాభాను లెక్కించేందుకు ఉద్దేశించిన జనగణన– 2021 కార్యక్రమానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకు రూ. 8,754.23 కోట్ల అంచనా వ్యయాన్ని ఆమోదించింది. ఇది దేశంలో జరిగే 16వ జనగణన. స్వాతంత్య్రం వచ్చాక జరుగుతున్న 8వ జనగణన. ఈ జనగణన దేశమంతటా చేస్తారు. జనగణన రెండు విడతలుగా జరుగనుంది. తొలి దశలో 2020 ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు కుటుంబాల గణన, 2021 ఫిబ్రవరి 9 నుంచి 28 వరకు మొత్తం జనాభా గణన ఉంటుంది. మొబైల్ యాప్ ద్వారా డేటా సేకరిస్తుండడంతో జనగణన వివరాలను ప్రకటించే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment